Telugu Global
Family

శిశుపాలుడు (For Children)

తప్పుమీద తప్పు… వరుసగా వంద తప్పులు చేసాడు శిశుపాలుడు. వందవరకు తప్పుల్ని లెక్కపెట్టి అంతవరకూ అవకాశమిచ్చాడు కృష్ణుడు. ఎందుకని? అది తెలియాలంటే శిశుపాలుని కథ తెలియాల్సిందే!        సాత్వతి దమఘోష దంపతులకు పుట్టిన వాడే శిశుపాలుడు. సాత్వతి యెవరో కాదు, శ్రీకృష్ణుని మేనత్త. అంటే శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్తకొడుకన్న మాట. శిశుపాలుడు పుట్టినప్పుడు నాలుగు భుజాలతోనూ అంటే నాలుగు చేతులతోనూ, నుదిటి మీద ఒక కన్నుతో కలిపి మూడు కళ్ళతోనూ పుట్టాడట. రూపంకాని రూపంతో […]

తప్పుమీద తప్పు… వరుసగా వంద తప్పులు చేసాడు శిశుపాలుడు. వందవరకు తప్పుల్ని లెక్కపెట్టి అంతవరకూ అవకాశమిచ్చాడు కృష్ణుడు. ఎందుకని? అది తెలియాలంటే శిశుపాలుని కథ తెలియాల్సిందే!

సాత్వతి దమఘోష దంపతులకు పుట్టిన వాడే శిశుపాలుడు. సాత్వతి యెవరో కాదు, శ్రీకృష్ణుని మేనత్త. అంటే శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్తకొడుకన్న మాట. శిశుపాలుడు పుట్టినప్పుడు నాలుగు భుజాలతోనూ అంటే నాలుగు చేతులతోనూ, నుదిటి మీద ఒక కన్నుతో కలిపి మూడు కళ్ళతోనూ పుట్టాడట. రూపంకాని రూపంతో పుట్టేసరికి తలిదండ్రులు భయపడి పోయారట. అప్పుడు ఆకాశవాణి పలికిందట. ఏమని? “ఓ దంపతులారా! ఈ శిశువుని ఎవరు ఎత్తుకుంటారో, అలా ఎత్తుకున్నప్పుడు ఎక్కువగా ఉన్న కన్నూ, చేతులూ అదృశ్యమయిపోతాయో- వారి చేతిలోనే తదనంతరం ప్రాణాలు కోల్పోతాడూ” అని! ఇంకేముంది? అది మొదలు వచ్చిన వాళ్ళ చేతికల్లా శిశు పాలుణ్ని ఎత్తుకోమని ఇచ్చేవారు. వచ్చిన అందరూ ఎత్తుకున్నారు. అయినా శిశుపాలుని వికృత రూపం పోలేదు.

ఒకరోజు బలరామ కృష్ణులిద్దరూ మేనత్తని చూడాలని చేది దేశానికి వచ్చారు. అందరికీ ఇచ్చినట్టే శిశుపాలుణ్ని ఇచ్చి ఎత్తుకోమన్నది. శ్రీకృష్ణుడు ఎత్తుకున్నాడు. ఎక్కువగా ఉన్న కన్ను అణిగి అదృశ్యమయి పోయంది. అలాగే ఎక్కువగా ఉన్న రెండు చేతులు కూడా! కొడుకుకి వికృత రూపుపోయి మామూలు రూపు వచ్చిన ఆనందం కంటే, మేనల్లుని చేతిలో చావనున్నందుకు ఆందోళన పడింది. పరిపరి విధాల అర్థించింది. దయ చూపు మయ్యా దామోదరా అని వేడుకుంది. వధకు అర్హమైన వందతప్పుల వరకు మన్నిస్తానని మాట ఇచ్చాడు. ఆ తరువాత నువ్వేనన్ను మన్నించాలన్నాడు. అందుకనే శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు ఓర్చుకున్నాడు కృష్ణుడు.

శ్రీకృష్ణుని వల్లగాని ఎవరివల్లగాని ఎటువంటి దండన లేక పోవడంతో తనకు తిరుగులేదని విర్రవీగిన శిశుపాలుడు తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయాడు. భోజ రాజుల్ని చంపాడు. వసుదేవుడు యజ్ఞము చేయబోతే అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని చంపేసాడు కూడా. కృష్ణుడు లేని సమయంలో ద్వారక నగరానికి నిప్పంటించి కాల్చాడు, చాలక రుక్మిణిని పెళ్ళి చేసుకోవాలని చూసాడు. బభ్రు భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇన్ని జరిగినా కృష్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడేవున్నాడు.

ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న కాలమది. ఆ దిగ్విజయ యాత్రలో చేరి దేశానికి వచ్చాడు భీముడు. శిశుపాలుడు ఆదరించాడు. యాగానికి అవసరమైన ధనం కూడా ఇచ్చాడు. తరువాత ధర్మరాజు సభకు వచ్చాడు. తొలి అర్ఘ్యానికి అంటే పూజా గౌరవానికి అర్హుడు శ్రీకృష్ణుడేనని భీష్ముడు చెప్పడంతో శాశ్వత శత్రుత్వంతో ఉన్న శిశు పాలుడు క్రిష్ణుడిని అవమానించాడు. భీష్మున్నీ తప్పు పట్టాడు. ధర్మరాజుని దుయ్యబట్టాడు. దాంతో సహ దేవుడు సహ భీముడు వుగ్రుడైలేస్తే భీష్ముడు వారించాడు. గొల్లవాడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు శిశుపాలుడు తూలనాడాడు. అప్పుడు కృష్ణుడు సభనుద్దేశించి – శిశుపాలుని తల్లికిచ్చిన మాట వల్ల అపరాధాలను మన్నించాను – ఇవాల్టితో వంద తప్పులు పూర్తయినవి – మీ యెదుటనే వధిస్తున్నాను – అన్నాడు. చక్రం వేసాడు. శిశుపాలుని శిరస్సును ఖండించాడు. శిశుపాలును ప్రాణ తేజం శ్రీకృష్ణునిలో ప్రవేశిందని చెపుతారు.

కృత యుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభ కర్ణులుగా, ద్వాపర యుగంలోశిశుపాల దంత వక్త్రులుగా శాపవశమున పుట్టిన వీళ్ళంతా విష్ణుమూర్తి ద్వారపాలకులే!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  5 July 2015 1:02 PM GMT
Next Story