నీళ్లు దొర‌క‌ని చోట కూడా మ‌ద్యం

ఆదాయం కోసం ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చంద్ర‌బాబు చెల‌గాటం…మద్య నియంత్రణ ఉద్యమ సదస్సు ఆగ్ర‌హం…!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం నియంత్రిస్తే పరిపాలన కొనసాగించలేరా..? ఆదాయాన్ని సమకూర్చు కోవడానికే ఎన్నో మార్గాలుండగా.. మద్యం ఒక్కటే మార్గమని ఎంచుకోవడం ఏమిటి? ఆదాయం కోసం ప్రజల ప్రాణాలే ఫణంగా పెడతారా..?  అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మద్య నియంత్రణ సదస్సు నిల‌దీసింది. రాష్ట్రంలో మంచినీళ్లు కంటే మద్యమే ఎక్కువగా లభిస్తోందని. మ‌ద్యం వ‌ల్ల కుటుంబాలు విచ్చిన్నమవుతు న్నాయని స‌ద‌స్సు ఆవేదన వ్యక్తం చేసింది. అప్సా, మద్య నియంత్రణ కమిటీ హైదరాబాద్‌లో సంయుక్తంగా నిర్వహించిన మద్య నియంత్రణ ఉద్యమ సదస్సులో వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ప్ర‌తినిధులు మాట్లాడారు.

 మ‌ద్యం త‌ప్ప ఆదాయ‌మార్గ‌మే లేదా : వైఎస్ఆర్‌సీపీ 
ఆదాయ వనరుల సమీకరణ కోసం మద్యపానం ఒక్కటే ఏపీ ప్రభుత్వానికి కన్పించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ  అన్నారు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా ఏపీ ప్రభుత్వం పెట్టిందని ఆరోపించారు. మద్యపానం కారణంగా రాష్ట్రంలో 2 నుంచి 3 శాతం మరణాల సంఖ్య పెరిగిందని తెలిపారు. కుటుంబాలే చిన్నాభిన్నమవుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 
మ‌ద్యంపై బాబు మాట మార్చారు : సీపీఎం
మద్య నియంత్రణపై టీడీపీ మాట మార్చిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యం నియంత్రిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు పెరిగేట్టు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎక్సైజ్‌ శాఖాధికారులకు టార్గెట్లు నిర్ణయించి మద్యం విక్రయాలు పెరిగే విధంగా ఆదేశాలిస్తున్నారని తెలిపారు. మద్యం అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం భావించి, విక్రయాలను పెంచేందుకు షాపింగ్‌మాల్స్‌లో కూడా అమ్మడానికి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.
 
ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తేవాలి : సీపీఐ
మద్యం నియంత్రణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజల్లో ఛైతన్యం తేవాలని సీపీఐ తెలంగాణ శాఖ కార్యదర్శివర్గ సభ్యుడు రాంనర్సింహ్మారావు అన్నారు. ఇందుకు అనుగుణంగా మద్యపానం వల్ల కలిగే అనర్దాలను, నియంత్రణ కారణంగా కలిగే లాభాలను వివరించాలన్నారు. ఇందుకోసం రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. రాజకీయప రమైన నిర్ణయాలతో నిరంతరంగా ఉద్యమాలు నిర్మించాల న్నారు. తెలంగాణలో నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
 
ప్ర‌జ‌ల బాగోగులు ప‌ట్ట‌వా? : మ‌ద్య నియంత్ర‌ణ క‌మిటీ
మద్యం అమ్మకాల ద్వారా ఆదాయ వనరుల సేకరణపై దృష్టిపెట్టారు త‌ప్ప‌. ప్రజల బాగోగులు అవసరం లేదా..? అని మద్య నియంత్రణ కమిటీ ఛైర్మన్‌ అంబటి లక్ష్మణ్‌రాజు ప్రశ్నించారు. సామాజిక, ఆర్ధిక సమస్యగా పరిగణించి, మద్యాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. మహిళా కాంగ్రెస్‌ నేత గంగాభవాని, బీజేపీ మహిళా మోర్చా నేత నర్రా జయలక్ష్మి, బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు అచ్యుతరావు, అప్సా డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు.