2080 నాటికి నగరాల్లో మరణాలు రెట్టింపు

సూర్య ప్ర‌తాపానికి 2080 నాటికి నగరాల్లో వడదెబ్బ మరణాలు రెట్టింపు అవుతాయని ఐఐఎం-అహ్మదాబాద్‌ బృందం చేసిన అధ్యయనంలో తేలింది. 52 నగరాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. ఈ శతాబ్దం ముగిసే నాటికి ఎండదెబ్బకు మరణించే వారి సంఖ్య 71 శాతం నుంచి 140 శాతానికి చేరుకుంటుందని పరిశోధకులు హెచ్చరించారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లో ఆ మరణాలు విపరీతంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చే జబ్బుల ప్రభావం మాత్రం ఉండదని అంచనా వేశారు. 2080 నాటికి సగటు ఉష్ణోగ్రతలు 3.3 డిగ్రీల నుంచి 4.8 డిగ్రీల దాకా పెరుగుతాయని తెలిపారు. వాతావరణ మార్పులు సృష్టిస్తున్న సవాళ్లపై ఇప్ప‌టి నుంచే దృష్టి పెట్టి, ఆ ముప్పును ఎదుర్కోవ‌డానికి సిద్ధ‌ప‌డాల‌ని సూచించారు.