Telugu Global
Family

శిబి (For Children)

చక్రవర్తులలో శిబి చక్రవర్తికి మంచి పేరుంది. శరణు అని వచ్చిన వారికి రక్షణ యివ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనను పోలినవారు మరొకరు లేరు అనడం అతిశయోక్తి కాదు!             శిబి తల్లి పేరు మాధవి. తండ్రి పేరు ఉశీనరుడు. ఉశీనర దేశానికి ఇతడే చక్రవర్తిగా ఉన్నాడు. ఏడు దీవుల వరకు శత్రువనేవాడు లేకుండా ఉన్నాడు. శిబిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించారు. ఈశ్వరుడే మెచ్చుకున్నాడు. తరగనంత ధనం ఇచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు అనేక అశ్వమేధ […]

చక్రవర్తులలో శిబి చక్రవర్తికి మంచి పేరుంది. శరణు అని వచ్చిన వారికి రక్షణ యివ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనను పోలినవారు మరొకరు లేరు అనడం అతిశయోక్తి కాదు!

శిబి తల్లి పేరు మాధవి. తండ్రి పేరు ఉశీనరుడు. ఉశీనర దేశానికి ఇతడే చక్రవర్తిగా ఉన్నాడు. ఏడు దీవుల వరకు శత్రువనేవాడు లేకుండా ఉన్నాడు. శిబిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించారు. ఈశ్వరుడే మెచ్చుకున్నాడు. తరగనంత ధనం ఇచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు అనేక అశ్వమేధ యాగాలు చేసాడు శిబి. అప్పుడు గంగా తీరంలోనే ఉన్నాడు.

శిబి చేసే అశ్వమేధ యాగాలకు మించి శరణాగత రక్షకుడిగానే పేరు పొందాడు. ఆమాట ఆనోటా ఆనోటా చేరి ఇంద్రుని చెవిన పడింది. అగ్ని దేవుడూ ఆమాట విన్నాడు. ఇంద్రుడూ అగ్నీ ఇద్దరూ శిబిని పరీక్షించాలనుకున్నారు. అతనేపాటి శరణాగత రక్షకుడో చూద్దామనుకున్నారు. వారి రూపాలు మార్చుకున్నారు. డేగగానూ, పావురంగానూ మారిపోయారు!

శిబి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో పావురాన్ని వేటాడి తినడానికన్నట్లుగా తరుముకుంటూ వచ్చింది డేగ. తప్పించుకు వచ్చిన పావురం శిబి చక్రవర్తిని శరణుకోరింది. తన ప్రాణాలు కాపాడమని వేడుకుంది. శిబి అభయమిచ్చాడు. దాంతో వేటాడ వచ్చిన డేగను అడ్డుకున్నాడు. అప్పడు డేగ అడిగిందట. నా ఆహారాన్ని నాకు వదిలిపెట్టు అని. శిబి ఒప్పుకోలేదట.శరణు కాచానని అన్నాడట. అన్నీ తెలిసిన న్యాయమూర్తి మీరు, నా ఆహారానికి అభయమిచ్చారు సరే, నా ఆకలి మాటేమిటి? అని అడిగిందట డేగ! ఈ పావురాన్ని వదిలిపెట్టు, దీనికి బదులుగా కోరింది ఇస్తానన్నాడట శిబి. ఏమిస్తే ఆకలి తీరుతుంది?, నీ ఒంట్లోని మాంసమివ్వు, అది కూడా పావురమంత బరువు చాలు అందట డేగ. అప్పుడు తక్కెడ తెచ్చి పావురాన్ని ఒక వైపున పెట్టి – మరోవైపున తన తొడభాగం కోసి వేసాడట శిబి. అలా శరీరాన్ని కోసుకుంటూ మంసాన్ని యెంతగా తక్కెడలో వేసినా పావురానికి సరి తూగింది కాదట!? అయినా శిబి అలాగే తన శరీరంలోని కండరాలన్నీ కోసుకుంటూనే ఉన్నాడట. తక్కెడలో వేస్తూనేవున్నాడట. అది చూడలేక పోయిన పావురమూ డేగ తమ తమ అసలు రూపాల్లోకి – అంటే ఇంద్రుడిగా, అగ్నిగా మారారట. శిబి చక్రవర్తి ముందు తల దించుకున్నారట. తర్వాత మెచ్చుకున్నారట, దీవించారట. దాంతో శిబి చక్రవర్తి అస్థిపంజరానికి కోసిన చర్మం ఎక్కడిదక్కడ అతుక్కుందట. గాయాలు మాని ఎప్పటిలా శిబి శరీరంగా మారిందట. శిబి చక్రవర్తి శరణాగత రక్షకుడిగా మరింత పేరు పొందాడట!

అన్నట్టు శిబి, వృష దర్ప, సువీర, మద్ర, కేకయులను కొడుకుల్ని కన్నాడట!

శరణాగత రక్షకుడిగా శిబి చిరాయువు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  6 July 2015 1:02 PM GMT
Next Story