జిమ్మీ బాబు ఎక్క‌డ‌?

ఓటుకు నోటు కేసులో అక‌స్మాత్తుగా తెర‌పైకి వ‌చ్చిన పేరు జిమ్మిబాబు. క‌రీంన‌గ‌ర్ జిల్లా గోదావ‌రిఖ‌నికి చెందిన జిమ్మీబాబు ప్ర‌స్తుతం తెలుగుయువ‌త రాష్ర్ట నాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. అలాగే హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ లో కో-ఆర్డినేట‌ర్ బాధ్య‌త‌లు కూడా చూస్తున్నారు. రేవంత్‌రెడ్డి వ‌ద్ద దొరికిన రూ.50 ల‌క్ష‌లను ఇత‌డే ప్ర‌ముఖుల నుంచి త‌ర‌లించాడ‌ని ఏసీబీ వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని తెలుస్తోంది. ఈ కేసులో జిమ్మీ బాబు వ్య‌వ‌హారం సైతం మ‌త్త‌య్య త‌ర‌హాలోనే వివాదాస్ప‌దంగా సాగుతోంది. రేవంత్ రెడ్డి అరెస్టు కాగానే మ‌త్త‌య్య విజ‌య‌వాడ‌కు పారిపోయాడు. ఆపై గుంటూరులో బంధువుల ఇంటికి చేరాడు. జిమ్మీబాబు సైతం గుంటూరులోనే ఆశ్ర‌యం పొందిన‌ట్లు స‌మాచారం. సోమ‌వారం విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా జిమ్మీబాబు ఎక్క‌డున్నాడ‌న్న‌ది చ‌ర్చానీయాంశంగా మారింది. మ‌త్త‌య్య త‌ర‌హాలోనే క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేసేందుకు జిమ్మీబాబు ప్ర‌య‌త్నించిన‌ట్లు మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే కేసులో జిమ్మీబాబు నిందితుడు కాదు కాబ‌ట్టి పిటిష‌న్ వేయ‌డానికి వీలు లేద‌ని లాయ‌ర్లు చెప్పిన‌ట్లు తెలిసింది. అన్ని దారులు మూసుకుపోవ‌డంతో జిమ్మీబాబు మ‌రోసారి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే ఎక్క‌డికి వెళ్లాడు? ఎక్క‌డ ఆశ్ర‌యం పొందుతున్నాడు? మ‌రోసారి ఏపీకి వెళ్తాడా?  ఇత‌ను కూడా తెలంగాణ సీఎంపై ఫిర్యాదు చేసి ప్రాణభ‌యం ఉంద‌ని చెప్తాడా?  ఏపీ పోలీసులు మ‌రోసారి అదే బాటలో న‌డుస్తారా? ఇప్ప‌టికే త‌మ పార్టీ నేత‌ల‌ను కాపాడే య‌త్నంలో కావాల్సినంత మ‌కిలి అంటించుకుంది ఏపీ స‌ర్కారు. జిమ్మీబాబుకు మ‌ద్ద‌తిచ్చి మ‌రోసారి విమ‌ర్శ‌ల‌ బుర‌ద‌లో కూరుకుంటుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌నుంది.