Telugu Global
Family

రుక్మిణి (For Children)

కుండిన దేశాధీశుడైన భీష్మకుని ఏకైక కూతురు రుక్మిణి. ఆమె తోడ అయిదుగురు అన్నదమ్ములు. రుక్మి, రుక్మధరుడు, రుక్మబాహువు మొదలైన వాళ్ళు. అయితే తండ్రి భీష్మకుని దగ్గరకు వచ్చీపోయే వాళ్ళ కబుర్లలో శ్రీకృష్ణుని గురించి విన్నది. వింటూ శ్రీకృష్ణుని గురించి ఆశపడ్డది. తండ్రి అర్థం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు అల్లుడయితే బాగుణ్ను అనీ అనుకున్నాడు. కాని రుక్మిణి పెద్దన్న రుక్మికి ఇష్టం లేదు. అతనికి శశిపాలుడు ప్రాణమిత్రుడు. శిశుపాలునికి శ్రీకృష్ణుడంటే పడదు, వైరం.  శత్రువుగా భావించడంతో రుక్మి కూడా అలాగే […]

కుండిన దేశాధీశుడైన భీష్మకుని ఏకైక కూతురు రుక్మిణి. ఆమె తోడ అయిదుగురు అన్నదమ్ములు. రుక్మి, రుక్మధరుడు, రుక్మబాహువు మొదలైన వాళ్ళు. అయితే తండ్రి భీష్మకుని దగ్గరకు వచ్చీపోయే వాళ్ళ కబుర్లలో శ్రీకృష్ణుని గురించి విన్నది. వింటూ శ్రీకృష్ణుని గురించి ఆశపడ్డది. తండ్రి అర్థం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు అల్లుడయితే బాగుణ్ను అనీ అనుకున్నాడు. కాని రుక్మిణి పెద్దన్న రుక్మికి ఇష్టం లేదు. అతనికి శశిపాలుడు ప్రాణమిత్రుడు. శిశుపాలునికి శ్రీకృష్ణుడంటే పడదు, వైరం. శత్రువుగా భావించడంతో రుక్మి కూడా అలాగే భావించాడు. తండ్రిని నిందించాడు. రుక్మిణిని శశిపాలునికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని నిర్ణయించేసారు. రుక్మిణికేమో శశిపాలుడంటే ఇష్టం లేదు. ఆమాట అన్నదమ్ములకు చెప్పుకోలేక, చెప్పినా వినరుగనుక శ్రీకృష్ణునికే చెప్పుకోవాలనుకుంది. ఏది దారి? ఒకవైపు పెళ్ళి ముహూర్తం దగ్గరకొచ్చేస్తోంది. అప్పుడు అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణ గురువు ద్వారా రహస్య రాయబారం పంపింది. అలా పంపిన ఉత్తరంలో – చిన్ననాటి నుండీ నీ కథలు విన్నానంది. ఇష్ట పడ్డానంది. నువ్వే నా భర్తవి అంది. శిశుపాలునికి చిక్కకుండా నన్ను ఎత్తుకుపోమంది. రాక్షస వివాహమయినా చేసుకొని నన్ను తీసుకెళ్ళు – నా ప్రాణాలు నిలుపూ – నా చావయినా బతుకయినా నీతోనే అంది.

శ్రీకృష్ణుడికి రుక్మిణి అందాల చందమామ అని తెలుసు. విన్నాడు. తన దాన్ని చేసుకోవాలని అనుకున్నాడు. రుక్మిణి ఇష్టం తెలిసాక ఆగలేదు. మర్నాడు పొద్దున బ్రహ్మణ గురువుని రథ మెక్కించుకొని కుండిన నగరం వెళ్ళాడు. కృష్ణుడు ఒక్కడూ వెళ్ళడం తెలిసి బలరాముడు సైన్యసమేతంగా వెళ్ళాడు.

ఒకపక్క రుక్మిణి కృష్ణుని రాకకై చూస్తోంది. చూస్తూనే దుర్గాదేవి కోవెలకు బంధుపరివారంతో వెళ్ళింది. మరోపక్క బలరామకృష్ణులు పెళ్ళికి వస్తున్నారని తెలిసి భీష్మకుడు సంతోషంగా ఆహ్వానించి విడిది ఇచ్చాడు. శిశుపాలుడు అప్పటికే వచ్చివున్నాడు.

రుక్మిణి పూజ పూర్తి చేసి వస్తోంది. దారి కాసిన కృష్ణుడు రుక్మిణిని రథం ఎక్కించుకువెళ్ళాడు. విషయం తెలిసి రుక్మి వెంట పడ్డాడు. శ్రీకృష్ణుడితో యుద్ధం చేసాడు. ఓడిపోయాడు. చంపబోతే తన అన్నని చంపవద్దని రుక్మిణి వేడుకుంది. అలా అన్నప్రాణాలను నిలబెట్టుకొని ప్రాణసఖుణ్ని దక్కించుకుంది.

ద్వారకా నగరం చేరాక దేవకీదేవి అంతఃపురంలో రుక్మిణిని ఉంచారు. మంచి ముహూర్తం చూసి రుక్మిణీ కృష్ణుల పెళ్ళి ఘనంగా జరిపారు. అలా రుక్మిణి శ్రీకృష్ణుని పట్ట మహిషి అయింది. పదిమంది కొడుకుల్ని కన్నది. వారిపేరు ప్రద్యుమ్ముడు, చారు దేష్ణుడు, చారు భద్రుడు, సుధేష్ణుడు, సుచారువు, చారు దేహుడు, చారు గుప్తుడు, చారు చంద్రుడు, విచారువు, చారువు.

రుక్మిణికి సత్యభామ, మిత్రవింద లాంటి సవతులూ ఉన్నారు. అష్ట భార్యలున్నా రుక్మిణి స్థానం రుక్మిణిదే. ఆమె ఎవరిమీద ఈర్ష్యపడి ఎరుగదు. ఇంక సత్యభామే రుక్మిణి మీద ఈర్ష్యపడ్డది. సత్యభామ నోమునోచి తులాభారమంటూ శ్రీకృష్ణుని భారాన్ని బంగారు ఆభరణాలు వేసి తూసింది. వాటికి తూగని కృష్ణుడు రుక్మిణి తులసీదళానికే తూగిపోయాడు! రుక్మిణి పట్ల శ్రీకృష్ణుడు ఎంతలా మొగ్గాడో ఈ ఘటనే చెప్పుంది.

చివరకు శ్రీకృష్ణుడు నిర్యాణం పొందాడని తెలిసి రుక్మిణి అగ్నిప్రవేశం చేసింది. ఇంతకీ రుక్మిణి ఎవరో కాదట…. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమట!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  7 July 2015 1:02 PM GMT
Next Story