ల‌లిత్ మోడీకి ప‌ద్మ అవార్డు!

ఐపిఎల్ స్కాంలో వేల‌కోట్లు దండుకుని లండ‌న్‌లో పండ‌గ చేసుకుంటున్నాడు ల‌లిత్ మోడీ. అలాంటి మోస‌గాడికి ప‌ద్మ అవార్డు ఇప్పించాల‌ని కోరారు రాజ‌స్థాన్ సీఎం వ‌సుంధ‌రాజె. ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. ల‌లిత్ మోడీని ప‌ద్మ అవార్డుకు సిఫార్సు చేస్తూ రాజ‌స్థాన్ సీఎం కేంద్రానికి పంపిన ప‌త్రాలు తాజాగా మీడియాకి చిక్కాయి. ఇప్ప‌టికే ల‌లిత్ మోడీ వ్య‌వ‌హారంపై డిఫెన్స్‌లో ప‌డ్డ వ‌సుంధ‌రా రాజెకి ప‌ద్మ అవార్డుల ఎపిసోడ్ మ‌రిన్ని చిక్కుల్లోకి నెట్టింది.

వ‌సుంధ‌ర కొడుక్కి చెందిన కంపెనీలో ల‌లిత్ మోడీ పెట్టుబ‌డులు, ముంబైలో ఐపిఎల్‌ మ్యాచ్ నేప‌థ్యంలో ఆమె బ‌స చేసిన హోట‌ల్ బిల్లులు ల‌లిత్ మోడీ క‌ట్ట‌డం., ఆయ‌న భార్య క్యాన్స‌ర్ ట్రీట్‌మెంట్ కోసం పోర్చుగ‌ల్ వెళ్ల‌డం..ఇలా అనేక విష‌యాల్లో స‌మాధానం చెప్ప‌లేని స్థితిలో ప‌డిపోయారు వ‌సుంధ‌ర‌! ఇప్పుడు ఏకంగా ల‌లిత్ మోడీకి ప‌ద్మ అవార్డు కూడా ఇప్పించ‌డానికి ప్ర‌య‌త్నించార‌న్న‌విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో విప‌క్ష కాంగ్రెస్‌కి మ‌రో ఆయుధం దొరికిన‌ట్ట‌యింది.