లఖ్వీ, దావూద్‌లకు ఉరి: మోడికి తొగాడియా పిలుపు

ముంబయి పేలుళ్ళ ప్రధాన సూత్రధారులైన లఖ్వీని, దావూద్‌ ఇబ్రహింలను భారత్‌ తీసుకువచ్చి ఉరి తీయాలని, ఈ పని ప్రధాని మోడీ ప్రభుత్వం చేయాలని విశ్వహిందూ పరిషత్‌ అధినేత ప్రవీణ్‌ తొగాడియా అన్నారు. పాక్‌లో ప్రధాని మోడి పర్యటనపై ఆయన స్పందిస్తూ అక్కడి నుంచి మోడీ తిరిగి వచ్చేటప్పుడు వారిద్దరినీ తీసుకువచ్చి ఈ గడ్డ మీద ఉరి తీసి, భారత్‌ జోలికొస్తే ఎంతటివారికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించాలని ఆయన స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన విహెచ్‌పీ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కాగా రామమందిర నిర్మాణానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ నిర్మాణానికి పార్లమెంటులో సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది చెప్పారు. దేశంలో రైతులు వ్యవసాయానికి అధిక వ్యయం చేస్తున్నారని, తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి సాధించే విషయమై అన్నదాతలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.