Telugu Global
NEWS

ఎస్మాకు భయపడం... సమ్మె బాట వీడం

రేపటి నుంచి మరింత ఉధృతానికి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు   ఎస్మాకు భయపడేది లేదని… సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె బాటను విడిచిపెట్టే ప్రసక్తే లేదని జీహెచ్‌ఎంసీ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) పిలుపు ఇచ్చింది. కుయత్తులతో సమ్మెను నిర్వీర్యం చేయాలనుకుంటున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ వంటి వారు వంద మంది వచ్చినా సమ్మెను ఆపలేరని స్పష్టం చేసింది. చెత్త నుంచి సచివాలయం, సీఎం ఇల్లు, క్యాంపు కార్యాలయం, ఫాం హౌస్‌, మంత్రుల […]

ఎస్మాకు భయపడం... సమ్మె బాట వీడం
X
రేపటి నుంచి మరింత ఉధృతానికి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
ఎస్మాకు భయపడేది లేదని… సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె బాటను విడిచిపెట్టే ప్రసక్తే లేదని జీహెచ్‌ఎంసీ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) పిలుపు ఇచ్చింది. కుయత్తులతో సమ్మెను నిర్వీర్యం చేయాలనుకుంటున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ వంటి వారు వంద మంది వచ్చినా సమ్మెను ఆపలేరని స్పష్టం చేసింది. చెత్త నుంచి సచివాలయం, సీఎం ఇల్లు, క్యాంపు కార్యాలయం, ఫాం హౌస్‌, మంత్రుల ఇళ్లు.. ఇలా ఇక దేన్నీ మినహాయించబోమని హెచ్చరించారు. సోమవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏడు కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నడిపిస్తున్న మునిసిపల్‌ ఉద్యోగ, కార్మికుల జేఏసీకి అధికార టీఆర్‌ఎస్‌ మినహా తక్కిన రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద జరిగిన బహిరంగ సభ, ధర్నాలకు తెలంగాణకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ తదితర పార్టీల ప్రతినిధులు హాజరై సంఘీభావం ప్రకటించారు. సమ్మెను విజయవంతం చేయడంలో భాగంగా.., జేఏసీ తీసుకునే నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. మునిసిపల్‌ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, లేదంటే సీఎం కేసీఆర్‌ ఇంటి ఎదుట చెత్త వేసి నిరసన తెలుపుతామని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ హెచ్చరించారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో పారిశుధ్య కార్మికులను దేవుళ్లు అని ప్రశంసించిన సీఎం.. నేడు వారి సమస్యల పరిష్కారంలో దెయ్యంలా ఎందుకు మారిపోయారని ప్రశ్నించారు. మునిసిపల్‌ శాఖను నిర్వహించడంలో కేసీఆర్‌ విఫలం అయ్యారని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం బంగారు కుటుంబం కావడం కోసం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కృషి చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి చాలా మంచివారని, కార్మిక నేతగా బాగా పనిచేశారని, అయితే కేసీఆర్‌ వద్దకు వెళ్లాక చెడిపోయారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ వీ హనుమంతరావు విమర్శించారు. ఓట్ల కోసమైతే బడుగు, బలహీనవర్గాలు కావాలిగానీ, పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న ఈ వర్గాల సమస్యలు మాత్రం పరిష్కరించరా అని ప్రశ్నించారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో రూ. 400 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కార్మికుల కోసం పైసా విదల్చడం లేదని మాజీ మంత్రి దానం నాగేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దండం, దరఖాస్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోర్కెలు తీర్చరని, దండం (కట్టె) పడితేనే కోర్కెలు తీరుస్తారని టీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ‘పారిశుధ్య కార్మికులు చెత్తను ఊడుస్తారు. అన్యాయం చేస్తే రాజకీయ పార్టీలను ఊడ్చేస్తారు. కార్మికుల సమస్యలు ఒప్పుకోకపోతే ప్రభుత్వాన్నీ ఊడ్చేస్తారు’ అని హెచ్చరించారు. ధనిక రాష్ట్రమంటూ ప్రకటనలు చేస్తున్న కేసీఆర్‌కు పారిశుధ్య కార్మికుల వేతనాలకు పెంచడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు వ్యవస్థ ఉండదు అంటూ ఇచ్చిన హామీలు అబద్ధాలేనా అని కేసీఆర్‌ను నిలదీశారు. రాజుల పాలనలో కాక, ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది గుర్తెరిగి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఉప సంఘంను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్క కలం పోటుతో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తానన్న కేసీఆర్‌… కార్మికులు సమ్మె చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని న్యూ డెమొక్రసీ నేత గోవర్థన్‌ ప్రశ్నించారు.
First Published:  12 July 2015 1:30 AM GMT
Next Story