ఎర్రటి రాయి (Devotional)

సృష్టి విచిత్రమయింది. మనోహరమైంది. వైవిధ్యభరితమయింది. ప్రతిమనిషీ ప్రత్యేకత కలిగినవాడే. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఎవర్నీ ఎవరితో పోల్చడానికి లేదు.

సృష్టిలోని ఆ అనంతవైవిధ్యమే మనల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. ఆసక్తిని రేపుతుంది. ప్రతిదీ సృష్టిలో అర్థవంతమైందే.

బయాజిద్‌ అన్న సూఫీ గురువు ఉండేవాడు. ఆయన శిష్యులతో కలిసి పర్యటించేవాడు. మధ్యలో బస చేస్తూ ఆసక్తి కలిగినవాళ్ళకు బోధనలు చేస్తూ గడిపేవాడు.

ఒకసారి ఒక గ్రామంనించీ ఆయన ఇంకో గ్రామానికి వెళుతున్నాడు. శిష్యులు వెంటవున్నారు.

బయాజిద్‌ దారిపక్కన ఒక రాయిని చూశాడు. అది ఎర్రగా నునుపుదేలి మెరుస్తోంది. ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆయన కాసేపు అక్కడ ఆగి ఆ రాయిని తదేకంగా చూశాడు. ఆ రాయిని దగ్గరకు తీసుకుని శ్రద్ధగా పరిశీలించి మళ్ళీ ఆ రాయిని యధా స్థానంలో ఉంచి ముందుకు సాగాడు.

శిష్యులకు ఆశ్చర్యం కలిగింది.

“మీరు ఎందుకు ఆ రాయిని తీసుకున్నారు. దాన్ని చూసి మళ్ళీ అది ఎక్కడవుందో అక్కడే ఎందుకు వుంచారు?” అన్నారు.

దానికి గురువు “దేవుడు దానికో ప్రత్యేకత నిచ్చాడు. దాని నిర్మాణంలో నైపుణ్యం ప్రదర్శించాడు. దానికొక స్థానమిచ్చాడు. అందుకనే అది అక్కడవుంది. ఆ కారణంగా దాన్ని అక్కడ ఉంచారు. దాని చోటును మార్చడానికి నేనెవర్ని? నాకేం హక్కుంది. నేను ఉద్రేక పడ్డాను. నిజానికి దానికి స్థానచలనం కలిగించాను. ఆ రాయి సౌందర్యం నన్ను కదిలించింది. కానీ వెంటనే సరయిన సమయంలో దైవసృష్టి స్మరణకువచ్చింది. అది అక్కడే ఉండాలని గుర్తు తెచ్చుకున్నాను. అందుకనే దాన్ని తిరిగి యధాస్థానంలో పెట్టాను” అన్నాడు.

ఆ మార్మికుడి విచిత్ర వాక్యాలు విని శిష్యులు పరవశించారు.

– సౌభాగ్య