పుష్కరఘాట్‌లో రివాల్వర్… ఒకరి అరెస్ట్‌

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరు గౌతిమి ఘాట్‌లో రివాల్వర్‌ కలకలం రేపింది. పుష్క‌ర‌ఘాట్‌ల‌లో తనిఖీలు నిర్వహిస్తున్న‌ పోలీసులు ఓ వ్యక్తి వద్ద రివాల్వర్‌ను గుర్తించారు. పుష్క‌రాలు పూర్త‌య్యే వ‌ర‌కు ఇక్క‌డే ఉంటాన‌న్న చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌, ఆయ‌న ఘాట్‌ల‌లో తిరుగుతూ భ‌క్తుల‌ను ప‌ల‌క‌రించ‌డం జ‌రుగుతోంది. మ‌రి కాసేపట్లో కొవ్వూరు గౌతమి ఘాట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వద్ద తుపాకీ లభ్యం కావడం కలకలం రేపింది. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అస‌లు ఈ అగంత‌కుడి ద‌గ్గ‌ర తుపాకీ ఎందుకుంది… ఏ ల‌క్ష్యాన్ని పెట్టుకుని ఇక్క‌డ‌కు వ‌చ్చాడు? ఇత‌నిది ఏ ప్రాంతం అన్న విష‌యాల‌పై అత‌న్ని ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ స‌రైన స‌మాధానాలు రాలేద‌ని తెలిసింది. దీంతో అత‌న్ని క్రైం పోలీస్ స్టేష‌న్‌కి తీసుకువెళ్ళి విచారించ‌డం మొద‌లెట్టారు. 
మరోవైపు మహాపుష్కరాల సందర్భంగా మూడో రోజు కూడా ర‌ద్దీ కొన‌సాగుతోంది. మొద‌టి రోజు 29 మందిని బ‌లిగొన్న తొక్కిస‌లాట‌తో గుణ‌పాఠం నేర్చుకున్న అధికార‌గ‌ణం ఆ త‌ర్వాత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లేమీ జ‌ర‌గ‌కుండా రెండో రోజు పూర్త‌య్యింది. భ‌క్తుల రాక పెరుగుతూనే ఉంది. తొలి రెండు రోజుల క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చి ప‌డుతున్నారు. రాజ‌మండ్రి, న‌ర్సాపురం, దొడ్డిప‌ట్ల‌, కొవ్వూరు, అంత‌ర్వేది త‌దిత‌ర రేవులన్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. కొవ్వూరులో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు రెండు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల్లో 60 నుంచి 70 శాతం మంది పిండ ప్ర‌దానాల కోస‌మే వ‌స్తున్నార‌ని తెలుస్తోంది. అర్చ‌కులు అందుబాటులో లేరు. న‌కిలీ అర్చ‌కులు కూడా ఇక్క‌డ‌కు వ‌స్తున్నార‌ని ఆరోపిస్తూ కొంత‌మంది పండితులు వారితో వాగ్వివాదానికి దిగ‌డం మ‌రింత అయోమ‌యం సృష్టిస్తోంది.