కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన‌ పాక్… తిప్పికొట్టిన భార‌త్

భార‌త్ పాక్ ల మ‌ధ్య  విభేదాలు, వివాదాలు స్వ‌స్తి చెప్పేందుకు త్వ‌ర‌లోనే చ‌ర్చ‌లు జ‌రుపుదామ‌ని భార‌త‌, పాక్ ప్ర‌ధానులు ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో తీసుకున్న నిర్ణ‌యానికి పాక్ సైన్యం తూట్లు పొడిచింది. గ‌త రెండు రోజులుగా భార‌త అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు, నియంత్ర‌ణ రేఖ, జ‌మ్ము ప్రాంతాల్లో పాక్ సైనికులు ప‌లుమార్లు కాల్పులు జ‌రిపారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం జ‌మ్ములో ప‌ర్య‌టించాల్సి ఉండ‌గా, పాక్ సైనికులు  స‌రిహ‌ద్దు గ్రామాల్లోని ప్ర‌జ‌ల‌పై  భారీ ఆయుధాలు, మోర్టార్ల‌తో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. గురువారం తెల్ల‌వారుజామ‌న కంచ‌క్ -అంకూర్ సెక్టార్ నుంచి  ఆర్ ఎస్ పుర  సెక్టార్ వ‌ర‌కూ ప‌లు గ్రామాల్లో  పాక్ సైన్యం భ‌యాందోళ‌న‌లు సృష్టించింది. ఈ కాల్పుల్లో ఒక మ‌హిళ మ‌ర‌ణించ‌గా, ఇద్ద‌రు బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌తో పాటు ఆరుగురు గాయ‌ప‌డ్డారు.  పాక్ కాల్పుల‌తో భ‌య‌భ్రాంతులైన ప్ర‌జలు గుహ‌ల్లోకి, లోయ‌ల్లోకి వెళ్లి త‌ల‌దాచుకున్నారు. అయితే, భార‌త స‌రిహ‌ద్దుల్లోకి ప్ర‌వేశించాల‌ని పాక్ సైన్యం జ‌రిపిన దాడిని భార‌త సైన్యం స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పి కొట్టింద‌ని అధికారులు తెలిపారు. పాక్ క‌వ్వింపు చ‌ర్య‌లు, స‌రిహ‌ద్దు గ్రామాల్లో నెల‌కొన్న ప‌రిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, విదేశాంగ శాఖ మంత్రి  సుష్మా స్వ‌రాజ్, ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో విదేశాంగ కార్య‌ద‌ర్శి జ‌య‌శంక‌ర్‌, జాతీయ భద్ర‌తా స‌ల‌హాదారు దోవ‌ల్ పాల్గొన్నారు.  సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఉపేక్షించేంది లేద‌ని దోవ‌ల్ స్ప‌ష్టం చేశారు. అయితే, పాక్ మిలిటెంట్ల కాల్పుల‌పై పాక్ భిన్న‌మైన వాద‌న వినిపిస్తోంది. పాక్ భూభాగంలోకి భార‌త నిఘా విమానాన్ని పంపింద‌ని ఆరోపించింది.