Telugu Global
Others

కార్మికులకై కేసీఆర్‌ మెడలు వంచుతాం:లెఫ్ట్‌

కార్మికుల హక్కులను కాలరాస్తున్న సీఎం కేసీఆర్‌ మెడలు వంచి కార్మికుల న్యాయమైన డిమాండ్లను సాధిస్తామని వామపక్షాలు ప్రతిన బూనాయి. సమ్మె బాటలో మునిసిపల్‌ కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఉపాధి హామీ సిబ్బందికి మద్దతుగా సోమవారం నల్లగొండలో ప్రాంరభమైన 10 వామపక్షాల బస్‌ జాతా సాయంత్రానికి ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డిలు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలకు వెన్నుదన్నుగా ఉంటామని పేర్కొన్నారు. మునిసిపాలిటీ, పంచాయతీ శాఖలను నిర్వహిస్తున్న కేసీఆర్‌, […]

కార్మికులకై కేసీఆర్‌ మెడలు వంచుతాం:లెఫ్ట్‌
X

కార్మికుల హక్కులను కాలరాస్తున్న సీఎం కేసీఆర్‌ మెడలు వంచి కార్మికుల న్యాయమైన డిమాండ్లను సాధిస్తామని వామపక్షాలు ప్రతిన బూనాయి. సమ్మె బాటలో మునిసిపల్‌ కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఉపాధి హామీ సిబ్బందికి మద్దతుగా సోమవారం నల్లగొండలో ప్రాంరభమైన 10 వామపక్షాల బస్‌ జాతా సాయంత్రానికి ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డిలు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలకు వెన్నుదన్నుగా ఉంటామని పేర్కొన్నారు. మునిసిపాలిటీ, పంచాయతీ శాఖలను నిర్వహిస్తున్న కేసీఆర్‌, ఆయన కొడుకు కేటీఆర్‌ కార్మికుల సమస్యలపై మాట్లాడటానికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వక పోవటం దారుణమన్నారు. తమ న్యాయమైన సమస్యల సాధన కోసం రోజుల తరబడి కార్మికులు సమ్మెలో ఉంటే కేవలం హైదరాబాద్‌లోని కార్మికుల సమస్యలను కొన్నింటిని మాత్రమే పరిష్కరించారన్నారు. హైదరా బాద్‌లో స్వచ్ఛభారత్‌ నిర్వహించే సమయంలో దేవుళ్ళులా కనిపించిన పారిశుద్ధ్య కార్మికులు నేడు దయ్యాలుగా కనిపిస్తున్నారని వారు ఆరోపించారు. ఫార్మా కంపెనీలకు కోట్లాది రూపాయల విలువైన 11 వేల ఎకరాల భూమిని ఫలహారంగా ఇస్తున్న కేసీఆర్‌కు పారిశుధ్య కార్మికులకు వేతనాలు రూ.11 వేలు పెంచమంటే మనసొప్పటం లేదన్నారు. జిల్లాల్లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల సీఎం కేసీఆర్‌ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దొరల వైఖరిని అవలంభిస్తున్నారని, రాష్ట్రం తన సొంత జాగీరుగా భావిస్తున్నారని… ఇకనైనా సీఎం కళ్లు తెరవకుంటే మునిసిపల్‌, పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) కేంద్ర కమిటీ సభ్యుడు సాదినేని వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి బండా సురేందర్‌రెడ్డి, ఎస్‌యూ సీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మురహరి, సీపీఐ(ఎంఎల్‌) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భూతం వీరన్న, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి ఎండి గౌస్‌, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర నాయకుడు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

First Published:  21 July 2015 11:00 AM GMT
Next Story