Telugu Global
Family

రురుప్రమద్వరలు (For Children)

చ్యవన పుత్రుడైన ప్రమతి పుత్రుడే రురుడు. తల్లి ఘృతాచి. ముని కుమారుడైన రురుడు అల్లరి ఆటపాటలతో ఆనందోత్సవాలతో నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని వెళ్ళదీసేవాడు. విశ్వావసుడనే గంధర్వ రాజుకూ మేనకకూ పుట్టిన పుత్రికే ప్రమద్వర. అయితే ప్రమద్వర పసిగుడ్డుగా ఉన్నప్పుడే అడవిలో సర్ధాలకేశునికి దొరికింది. అతని ఆశ్రమంలోనే పెరిగి పెద్దదయింది. యవ్వనవనంలోవున్న ప్రమద్వరని రురుడు చూసాడు. చెలికత్తెలతో ఆడుకుంటూ ఉన్న ఆ అతివని చూసి ఆమె నా అర్ధాంగి అనుకున్నాడు. ఆమెను తప్ప వేరెవ్వరినీ ఊహించలేనంతగా ప్రేమించాడు. అనుమతించమని […]

చ్యవన పుత్రుడైన ప్రమతి పుత్రుడే రురుడు. తల్లి ఘృతాచి. ముని కుమారుడైన రురుడు అల్లరి ఆటపాటలతో ఆనందోత్సవాలతో నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని వెళ్ళదీసేవాడు.

విశ్వావసుడనే గంధర్వ రాజుకూ మేనకకూ పుట్టిన పుత్రికే ప్రమద్వర. అయితే ప్రమద్వర పసిగుడ్డుగా ఉన్నప్పుడే అడవిలో సర్ధాలకేశునికి దొరికింది. అతని ఆశ్రమంలోనే పెరిగి పెద్దదయింది.

యవ్వనవనంలోవున్న ప్రమద్వరని రురుడు చూసాడు. చెలికత్తెలతో ఆడుకుంటూ ఉన్న ఆ అతివని చూసి ఆమె నా అర్ధాంగి అనుకున్నాడు. ఆమెను తప్ప వేరెవ్వరినీ ఊహించలేనంతగా ప్రేమించాడు. అనుమతించమని అమ్మానాన్నలను అడిగాడు. ప్రమతిముని స్థూలకేశుని అదే విషయమై అడిగాడు. స్థూలకేశుడూ దాయలేదు. ప్రమద్వర దొరికిన బిడ్డగా జరిగిన కథ చెప్పాడు. భృగ మహర్షి వంశానికి చెందిన ప్రమతి తన వంశం కలుషితమవుతుందని బాధపడ్డాడు. రురుడికివేమీ పట్టలేదు. పగలూ రాత్రీ ప్రమద్వర ద్యాసే. ప్రమద్వరే లోకంగా ఉండడంతో కాదనలేకపోయాడు. పెళ్ళి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాడు.

రురునికి పెళ్ళి వేడుకగా గాక వేదనగా మిగిలింది. ప్రమద్వరను పాము కాటేసింది. గడ్డి మీద ప్రమద్వర కాలు వేసినపుడు గడ్డిలో ఉన్నపాము విషం చిమ్ముతూ కోరలు దించింది. మృత్యుముఖానవున్న ప్రమద్వర ముఖం చూసాడు రురుడు. చూస్తుండగానే ప్రాణాలొదిలింది ప్రమద్వర!

రురుడు దుఃఖం పట్టలేకపోయాడు. అడవులు పట్టాడు. ఏడ్చాడు. ఎంత రమ్మన్నా ఇంటికి తిరిగి పోలేదు. అడవిలో తిరుగుతూ ఆవేదనతో ఆక్రోషంతో కనిపించిన పామునల్లా చంపుకుంటూ వచ్చాడు. అతనికున్న ప్రేమ పగగా మారింది. సర్పజాతి సమస్తాన్నీ నాశనం చేయడమే లక్ష్యంగా మారింది.

పాములకు ప్రాణ భయం పట్టుకుంది. అడవి అల్లకల్లోలంగా మారింది. అడుగుల చప్పుడుకే పాములు ప్రాణాలొదిలేవి.

ఒకరోజు ఒక పామును చంపబోతుంటే అది మనిషిలా మాట్లాడింది. నేను విష సర్పాన్ని కాదంది. ఎవ్వరికీ ఏహానీ చెయ్యలేదంది. తనని విడిచిపెట్టమంది. తన కథ చెప్పుకుంది. తనపేరు దుందుభుడని, తాను గడ్డిపాముని చేసి ఒక ఋషిని భయపెట్టాలని సరదాగా చేసిన పని శాపానికి కారణమయ్యిందని, యిప్పడిలా శాప విమోచనమయ్యిందని మనిషి రూపంలోకి మారాడతడు. మహర్షి అయ్యాడతడు.

రురుడు తన దుఃఖానికీ పగకీ ప్రతీకారాలకీ బానిసగా మారిన విషయం గుర్తు చేసాడా దుందుభుడు. ప్రకృతిలోని అసమానతలు సమానతనూ సమతుల్యాన్నీ కోరే వున్నాయని – అందుకే ఒకజీవిని మరోజీవి ఆహారంగా స్వీకరిస్తున్నదని సృష్టిలోనే ఉన్న విన్యాసంగా చెప్పాడు. అర్థం చేయించాడు. రురునిలో మార్పు వచ్చింది. పాము కళ్ళ బడ్డా వదిలేసాడు. దాని నాట్యాన్ని ఆస్వాదించాడు. కాని అతని దుఃఖం పోలేదు. ప్రమద్వర గుర్తుకొస్తూనే ఉంది. క్రోథం నుండి విముక్తమయి నా కోరుకున్నది పొందలేని రురుని చూసి దుందుభుడు “ప్రమద్వర కోసం ఏమయినా ఇస్తావా? అని అడిగి నీ అర్ధాంగికి నీ అర్థ ఆయస్సు నివ్వగలవా?” అడిగాడు. సిద్ధపడ్డాడు రురుడు. “తథాస్తు!” దీవించాడు.

రురుడు కళ్ళు తెరిచేసరికి దుందుభ ఋషి లేడు. ప్రమద్వర మృత్యు ముఖంలోంచి బయటపడినట్టు పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు కబురు తీసుకొచ్చారు స్నేహితులు. రురుడుకి ప్రాణం లేచొచ్చింది.

ప్రాణానికి ప్రాణమైన ప్రమద్వరను పెళ్ళాడిన రురుడు సుఖసంతోషాలతో జీవించాడు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  21 July 2015 1:02 PM GMT
Next Story