Telugu Global
Family

సరే చూద్దాం! (Devotional)

పూర్వం ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని భార్య చనిపోయింది. అతనికి ఒకడే కొడుకు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక కొడుకు, ఒక గుర్రం. కొడుకును, గుర్రాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. ఒకరోజు గుర్రం గడ్డిమేయడానికి వెళ్ళింది. మళ్ళీ తిరిగిరాలేదు. ఇరుగుపొరుగు జనం వృద్ధుని దగ్గరకు వచ్చి తమ సానుభూతిని ప్రకటించి “మీకు ఎంత కష్టమొచ్చింది. ఎంత దురదృష్టం. నిజంగా మాకు ఎంతో బాధగా ఉంది” అని సానుభూతి వాక్యాలు పలికారు. వృద్ధుడు పొగపీలుస్తూ […]

పూర్వం ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని భార్య చనిపోయింది. అతనికి ఒకడే కొడుకు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక కొడుకు, ఒక గుర్రం. కొడుకును, గుర్రాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు.

ఒకరోజు గుర్రం గడ్డిమేయడానికి వెళ్ళింది. మళ్ళీ తిరిగిరాలేదు. ఇరుగుపొరుగు జనం వృద్ధుని దగ్గరకు వచ్చి తమ సానుభూతిని ప్రకటించి “మీకు ఎంత కష్టమొచ్చింది. ఎంత దురదృష్టం. నిజంగా మాకు ఎంతో బాధగా ఉంది” అని సానుభూతి వాక్యాలు పలికారు.

వృద్ధుడు పొగపీలుస్తూ వాళ్ళని చూస్తూ “సరే చూద్దాం!” అన్నాడు.

కొన్నిరోజులు గడిచిపోయాయి. కనిపించకుండాపోయిన గుర్రం ఇంటికి తిరిగి వచ్చింది. దాంతో బాటు అడవినించి ఐదు అడవి గుర్రాల్ని వెంటబెట్టుకుని వచ్చింది. ఆ సంగతి తెలిసి ఇరుగుపొరుగుజనం మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు.

“మొత్తానికి గుర్రం తిరిగివచ్చింది. వస్తూ ఐదు గుర్రాల్ని వెంట తెచ్చింది. అదృష్టమంటే మీదే కదా! ఈ గ్రామంలో మీరే సంపన్నులయిన వాళ్ళు” అని పొగిడారు.

వృద్ధుడు పైపు తాగి పొగవదుల్తూ వాళ్ళు పొగడ్డం ఆపిన తరవాత తాపీగా వాళ్ళ వేపు చూసి “సరే చూద్దాం!” అన్నాడు.

గుర్రం పోయినా, గుర్రాలతో అది తిరిగివచ్చినా చలనం లేకుండా ఈ మనిషి సరే చూద్దాం అంటాడేమిటి? అని వృద్ధుణ్ణి చిత్రంగా చూసి ఇరుగుపొరుగు వెళ్ళిపోయారు.

రెండ్రోజులు గడిచాయి.

వృద్ధుని కొడుకు కొత్తగా వచ్చిన అడవి గుర్రాల్ని మచ్చిక చేసేపనిలో పడ్డాడు. ఒక గుర్రమెక్కి దాన్ని అదుపుచేసే ప్రయత్నంలో ఆ కుర్రాడు కిందపడ్డాడు. కాలు విరిగింది.

ఆ సంగతి తెలిసి చుట్టు పట్ల జనం వురుకులు పరుగుల మీద వృద్ధుని దగ్గరకు వచ్చి “మీకెంత కష్టమొచ్చింది. ఎదిగిన కొడుకు కాలువిరగడం నిజంగా బాధాకరం” అని ఎప్పట్లా సానుభూతి వాక్యాలు పలికారు.

వృద్ధుడు కూడా నిశ్చలంగా ఎప్పట్లా పొగపీలుస్తూ “సరేచూద్దాం” అన్నాడు.

అందరికీ ముసలాడంటే కోపం వచ్చింది. కొడుక్కి కాలువిరిగితే కూడా ఏమాత్రం బాధపడకుండా బండలా ఉన్నాడే ఈ మనిషి. మనం అతని దగ్గరకు వచ్చి సానుభూతి మాటలు చెప్పడం మన బుద్ధి తక్కువ అని వెళ్ళిపోయారు.

వృద్ధుడు వాళ్ళని చూసి నవ్వుకున్నాడు.

మరుసటిరోజు ఆదేశ సైనికాధికారి ఆ గ్రామానికి సైన్యంతో వచ్చాడు. గ్రామమంతా తిరిగి వయసులో వున్న యువకులందర్నీ నిర్బంధంగా సైన్యంలోకి చేర్చుకున్నాడు. దేశం ప్రమాదంలో ఉందని, పొరుగురాజు దండెత్తి వస్తున్నాడని యువకులు తప్పని సరిగా సైన్యంలో చేరాలని ఆదేశించాడు.

వృద్ధుడి కొడుక్కి కాలువిరగడం వల్ల అతన్ని సైన్యంలో చేర్చుకోలేదు!

– సౌభాగ్య

First Published:  23 July 2015 1:01 PM GMT
Next Story