పుష్క(రా)ల రోగాలు

పుష్కరాలకు వెళ్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ రోగాలు మాత్రం వస్తున్నాయి. దీనికి సాక్ష్యం కరీంనగర్‌ జిల్లా పుష్కరవైద్యశిబిరాలే. జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలలో ఇప్పటివరకూ 48 వేల మంది చికిత్స తీసుకున్నారు. ఈ రోగుల సంఖ్య కరీంనగర్‌ జిల్లాకు వచ్చిన పుష్కర యాత్రికులు, అక్కడ ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో చికిత్స పొందిన వారిది మాత్రమే. ఈ లెక్కన తెలుగు రాష్ర్టాల్లో ఎన్ని లక్షల మంది రోగాల బారిన పడి ఉంటారో అంచనా వేసుకోవచ్చు.
రోగాలు.. కారణాలు
స్నానం చేసిన తరువాత దద్దుర్లు, చర్మ సంబంధిత వ్యాధులు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్న యాత్రికులు వైద్యశిబిరాలకు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఎగువప్రాంతంలో వర్షాల్లేక గోదావరిలో నీటి ప్రవాహం లేదు. ఉన్న అరకొర నీటిలో రోజుకు లక్షల మంది స్నానాలు ఆచరించడం, నది ఒడ్డునే మలమూత్రవిసర్జన చేయడం, పిండప్రదానాల తరువాత వాటిని గంగలో కలపడం, ప్లాస్టిక్‌ వేయడం, యాత్రికుల వాడిపారేసిన వ్యర్థాలతో నీరు మురికికూపంగా తయారైంది. ఇదే నీటిలో పుష్కర స్నానం చేయడంతో జనాలు రోగాల బారినపడుతున్నారు. మరికొంతమంది తీర్థవిధులు నిర్వహించిన తరువాత తీర్థంగా ఈ నీటిని తాగడం కూడా వ్యాధులు ప్రబలడానికి, రోగాలు విజృంభిచడానికి కారణమవుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
మునక ముప్పు
కరీంనగర్‌ జిల్లాలో పుష్కరాల కోసం 39 ఘాట్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ కోటి యాభై లక్షలమందికి పైగా పుష్కర స్నానాలు చేశారని అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు 10 నుంచి 20 లక్షల మంది పుష్కర స్నానాలకు వస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఘాట్‌ల వద్ద 44 వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటివరకూ రోగాల బారిన పడిన 48 వేల మందికి పైగా చికిత్స తీసుకున్నారని ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.