Telugu Global
Cinema & Entertainment

జేమ్స్ బాండ్ మూవీ రివ్యూ

రేటింగ్‌: 2.25/5 మనం తీసే సినిమాల్లో నూటికి తొంబైతొమ్మిది అనువాదాలే. కాదూ అంటే అనుకురణలే. లేదూ అంటే అనుసరణలే. ఇందుకు పెద్దాచిన్నా తేడా లేదు. అందరు దర్శకులది అదే తీరు. కాకపోతే తెలుగైజ్‌ చేయడంలోనే తెలివితేటలూ దానికి తగ్గ ఫలితాలూ ఉంటాయి. ఆ ఫలితాల్ని ప్రేక్షకులు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు జేమ్స్‌బాండ్‌ చిత్రం నేను కాదు నా పెళ్ళాం అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలించుకు మరి మనముందుకు వచ్చింది. “మై వైఫ్‌ ఈజ్‌ గ్యాంగ్‌స్టర్‌” కొరియన్‌ సీరీస్‌కి ఎప్పటిలాగే […]

జేమ్స్ బాండ్ మూవీ రివ్యూ
X

రేటింగ్‌: 2.25/5

మనం తీసే సినిమాల్లో నూటికి తొంబైతొమ్మిది అనువాదాలే. కాదూ అంటే అనుకురణలే. లేదూ అంటే అనుసరణలే. ఇందుకు పెద్దాచిన్నా తేడా లేదు. అందరు దర్శకులది అదే తీరు. కాకపోతే తెలుగైజ్‌ చేయడంలోనే తెలివితేటలూ దానికి తగ్గ ఫలితాలూ ఉంటాయి. ఆ ఫలితాల్ని ప్రేక్షకులు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు జేమ్స్‌బాండ్‌ చిత్రం నేను కాదు నా పెళ్ళాం అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలించుకు మరి మనముందుకు వచ్చింది. “మై వైఫ్‌ ఈజ్‌ గ్యాంగ్‌స్టర్‌” కొరియన్‌ సీరీస్‌కి ఎప్పటిలాగే ఇది కాపీ. ఆ కాపీ కొట్టడం కూడా సమర్ధవంతంగా సగం చేసి చేయకుండా మనముందుకు తెచ్చిపెట్టారు.

వరుస అపజయాలతో నెట్టుకొస్తున్న అల్లరినరేష్‌ ఆశలు పెట్టుకున్న చిత్రం జేమ్స్‌బాండ్‌. ఆ ఆశ ఫలించిందా అంటే అరసగమే ఫలించిందని చెప్పుకోవాలి. “మై వైఫ్‌ ఈజ్‌ గ్యాంగ్‌స్టర్‌” ని యధాతదంగా తీసివున్నా బాగుండేది. కనీసం ఇక్కడి నేటివిటీకి అనుకూలంగా మార్చుకుని తీసివున్నా బాగుండేది. అలాగని పాత్రల్ని మార్చిందిలేదు. గ్యాంగ్‌స్టర్‌ మొదలుకుని ఆమె హస్‌బెండ్‌ నుండి అమాయక అసిస్టెంట్‌ వరకు అవే పాత్రలు.

కథ విషయానికొస్తే… పూజా (సాక్షీ చౌదరి) దుబాయి కేంద్రంగా మాఫియాని నడిపే గ్యాంగ్‌స్టర్‌. పూజ తండ్రి కూడా గ్యాంగ్‌స్టర్‌గా ఉండి పూజ తల్లి (ప్రభ) ఒత్తిడితో మాఫియాని అర్ధాంతరంగా ఆపేయలేక కూతురుని దుబాయి తీసుకొచ్చి బుల్లెట్‌లా తర్పీదిస్తాడు. తండ్రి మరణానంతరం ఇండియాలో ఉన్న తల్లి అనారోగ్యం వల్ల పూజా హైదరాబాద్‌కి తన పరివారంతో షిప్ట్‌ కావాల్సివస్తుంది. చావుకి దగ్గరైన తల్లికోరిక మేరకు పెళ్ళికి తలొంచాల్సి వస్తుంది. టెంపరరీగా పెళ్ళాడడానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి. ఈ దశలో మ్యాంగో సొల్యూషన్స్‌లో పనిచేసే లక్ష్మీప్రసాద్‌ అలియాస్‌ నానీ (అల్లరి నరేష్‌) పూజను చూసి ఇష్టపడతాడు. ముందు వెనుక చూడకుండా పెళ్ళాడతాడు. కాని అతడు పిరికివాడు. అప్పటికే నిశ్చితార్ధం అయిన రాయలసీమ అమ్మాయి జోగులాంబ అసలు రూపం చూసి తప్పించుకువచ్చి దొరకకుండా తిరుగుతుంటాడు. పెళ్ళిళ్ళ బ్రోకర్‌వల్ల కండీషన్స్‌ చూడకుండానే పూజకు కమిటయి పెళ్ళాడతాడు నానీ. ఇంతలో దుబాయిలోని మాఫియా ప్రత్యర్ధి బడా (ఆశిశ్‌ విద్యార్థి) పూజను అంతం చేయాలని హైదరాబాద్‌కి వస్తాడు. అంతపెద్ద డానూ అమాయకంగా లోకల్‌ నాయకుడు (పృథ్వీ)మీద ఆధారపడతాడు. ఇంటర్‌వెల్‌ వచ్చేసరికి తను పెళ్ళాడింది జానూని కాదని డానూనని నానీకి అర్థమౌతుంది. నానీ తన కుటుంబంతో సహా పూజనుండి తప్పించుకొని మరోవైపు జోగులాంబ ఫ్యాక్షన్‌ బ్యాచ్‌నుండి తప్పించుకొని ఇంకోవైపునుండి బడా మాఫియాడాన్‌ నుండి తప్పించుకొని హీరోతోపాటు ప్రేక్షకులు ఎలా బయటపడ్డారన్నదే మిగితా కథ!

సినిమా మొదటిభాగం బాగానే నడిపినా రెండోభాగం హాస్యంకోసం ఎటుపడితే అటుపోయి కథా లక్ష్యాల్ని అదిగమించి కిచిడీగా తయారయింది. సగటు మనిషి అయిన నానీని కరడుగట్టిన డాన్‌ పూజ ఎందుకు ఇష్టపడింది, వద్దనుకుంటూనే ఎందుకు ప్రేమించింది అనేది కథలో కన్విన్సింగా లేదు. ఒకవైపు డాన్‌ల్నిడాన్‌లుగా చూపిస్తూ మరోవైపు బఫూన్లుగా చూపించడంతో కథ బిగువుని కోల్పోయి అటూ ఇటూ కాకుండా అయింది. కథ బాగున్నా కథనం బాగోలేదు. పాటలు గుర్తుపెట్టుకోదగ్గవిగా లేవు. మాటలు ఎంత బాగున్నాయో సెంటిమెంట్‌ పండించడంలో అంత బాలేవు. నరేష్ తనదైన శైలిలో నటించాడు. డాన్‌గా సాక్షీ చౌదరి అమిరింది. సప్తగిరి, పోసాని తమ పాత్రలను పండించారు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని కథను నడిపి ఉంటే దర్శకుడు కొంచెంలోవిజయాన్ని మిస్‌ అయ్యేవాడు కాదు.

First Published:  24 July 2015 2:51 AM GMT
Next Story