విమర్శలు మూటగట్టుకుని వెళ్ళిన రాహుల్‌గాంధీ!

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనంతపురం పర్యటన సక్సెస్‌ మాటేమోగాని అటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి మాత్రం ఎడాపెడా విమర్శలను మూట గట్టుకుని వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసి కసి తీర్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ నేతకు తమ రాష్ట్రంలో పర్యటించేందుకు సిగ్గుండాలని, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఆయన ప్రవచనాలున్నాయని ఏపీ నాయకులు దుయ్యబట్టారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా తాము భయపడమని, ప్రత్యేక హోదా ఎప్పుడు తెచ్చుకోవాలో తమకు తెలుసునని, రైతులకు భరోసాగా నిలబడేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక్కటేనని సీఎం చంద్రబాబు రాహుల్‌ను పరోక్షంగా దెప్పిపొడిచారు. రాహుల్‌గాంధీ అవసరం ఉంటే ఒకలా… లేకపోతే మరోలా మాట్లాడతారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి విమర్శించారు. అసలు రాహుల్‌ ఏం ముఖం పెట్టుకుని ఏపీకి వచ్చారని తెలుగుదేశం మంత్రి దేవినేని ఉమా దుయ్యబట్టారు. పుండు మీద కారం చల్లేందుకే రాహుల్‌ మళ్ళీ ఏపీలో తిరగడానికి వచ్చారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌, ఏపీలో పర్యటించే అర్హత రాహుల్‌ ఏనాడో కోల్పోయారని అచ్చెనాయుడు, ఏపీలో తిరిగే హక్కు రాహుల్‌కు లేదని కింజరపు రామ్మోహననాయుడు దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఇష్టాపూర్వకంగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీకి నాయకుడైన  రాహుల్‌గాంధీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యనించారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఆర్థికంగా దివాలా దీసినట్టు చేసిన కాంగ్రెస్‌ పార్టీపై ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇలా విమర్శలు ఎక్కుపెట్టారంటే అర్దముంది. కాని ఆంధ్రప్రదేశ్‌ని చీల్చి తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీకి తెలంగాణ కూడా విమర్శల హారతే పట్టింది. మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని టీఆర్‌ఎస్‌ నాయకురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. గతంలో రాహుల్‌ గాంధీ చేసిన పాపాలు పోవాలంటే తెలంగాణ రాష్ట్రంలోగాని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోగాని పుష్కర స్నానం చేస్తే మంచిదని సూచించారు. రాహుల్‌ రైతులను చూసి ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని, ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు కూడా కంటితుడుపు పర్యటన జరిపి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఆయనేం చేశారని కవిత ప్రశ్నించారు.