బాబు సింగ‌పూర్ వ్యాపార మిత్రుల‌కే రాజ‌ధాని ప‌నులు

బొత్స స‌త్య‌నారాయ‌ణ తీవ్ర ఆరోప‌ణ‌లు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగ‌పూర్ వ్యాపార మిత్రుల‌తోనే రాష్ట్ర రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ ప‌నులు చేయిస్తున్నార‌ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. సింగపూర్‌లో చంద్ర‌బాబు ఎవ‌రితో వ్యాపార లావాదేవీలు చేశారో వారే రాజధాని మాస్టార్‌ ప్లాన్‌ రూపొందించారనీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆయన తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో చూపించిన బొమ్మలు జపాన్‌, చైనా, సింగ్‌పూర్‌ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, భవనాల ఫొటోలు కట్‌ అండ్‌ పేస్టు రాష్ట్ర ప్రజలకు చూపించారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేవలం సింగ్‌పూర్‌లో ఉన్న తన వ్యాపార భాగస్వాములతో మాస్టార్‌ ప్లాన్‌ తయారు చేయించి తన వ్యాపారాభివృద్ధికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. మ‌న‌ దేశానికీ, రాష్ట్రానికీ చెందిన ఇంజినీర్లు సింగపూర్‌లో ఎలాంటి ప్రాముఖ్యత వహిస్తున్నారో ఆ దేశంలో చూస్తే బాబుకు తెలుస్తుందన్నారు. 12 రోజుల పాటు గోదావరి పుష్కరాల్లో ఉండి చంద్ర‌బాబు చేసిందేమిటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుకు జిల్లా గురించి ఆలోచించ‌క‌పోవ‌డం వల్లే తోటపల్లి ఆక్విడెక్టు దెబ్బతినడానికి కారణమయ్యింద‌న్నారు. భోగాపురం విమానాశ్రయంపై అధికార పార్టీ నాయకుల‌కు స్ప‌ష్ట‌త లేద‌ని, అధికారుల తీరూ అలానే ఉంద‌ని బొత్స ఎద్దేవా చేశారు.