Telugu Global
Family

దేవకి (For Children)

కృష్ణుణ్ణి కీర్తించేటప్పుడు “దేవకీసుతుడు”గా పిలుస్తారు! దేవకీ దేవి కొడుకుగా కొలుస్తారు! దేవకి అందరిలా కృష్ణుణ్ణి కనలేదా? అష్టమ సంతానమైన కృష్ణుణ్ణి కనడానికి అష్టకష్టాలూ పడింది! శ్రీకృష్ణుని జన్మస్థానము అంటే తెలుసుకదా? చెరసాల! కంసుని చెరన చెరసాలన ఉండి కన్నది! మధురకు రాజైన ఉగ్రసేనుడి తమ్ముడే దేవకుడు. దేవకునికి ఏడుగురు కూతుర్లు. పెద్దకూతురు దేవకి. అలాగే ఉగ్రసేనునికి ఉన్న తొమ్మిది మంది కొడుకుల్లో పెద్దకొడుకే కంసుడు. దేవకీ కంసుడూ పినతండ్రి పిల్లలన్న మాట. యాదవ రాజులందరికీ రాజధాని మధురా […]

కృష్ణుణ్ణి కీర్తించేటప్పుడు “దేవకీసుతుడు”గా పిలుస్తారు! దేవకీ దేవి కొడుకుగా కొలుస్తారు! దేవకి అందరిలా కృష్ణుణ్ణి కనలేదా? అష్టమ సంతానమైన కృష్ణుణ్ణి కనడానికి అష్టకష్టాలూ పడింది! శ్రీకృష్ణుని జన్మస్థానము అంటే తెలుసుకదా? చెరసాల! కంసుని చెరన చెరసాలన ఉండి కన్నది!

మధురకు రాజైన ఉగ్రసేనుడి తమ్ముడే దేవకుడు. దేవకునికి ఏడుగురు కూతుర్లు. పెద్దకూతురు దేవకి. అలాగే ఉగ్రసేనునికి ఉన్న తొమ్మిది మంది కొడుకుల్లో పెద్దకొడుకే కంసుడు. దేవకీ కంసుడూ పినతండ్రి పిల్లలన్న మాట. యాదవ రాజులందరికీ రాజధాని మధురా నగరమే!

ఒకే తల్లీపిల్లలుగా మెలిగారు కాబట్టే దేవకి పెళ్ళికి కంసునిదే వేడుక. వసుదేవునితో పెళ్ళి జరిగాక స్వయంగా కంసుడే బండికట్టాడు. కట్నకానుకలతో చెల్లి దేవకిని అత్తారింటికి తీసుకువెళుతున్నాడు. అప్పుడు ఆకాశవాణి – దేవకిని ప్రాణానికి ప్రాణంగా చూస్తున్నావే, ఆమె అష్టమ (ఎనిమిదవ) సంతానమే నీ ప్రాణాలు తీస్తుంది – అని చెప్పిందట. కంసుని ఆనందం ఆవిరైంది. దుఃఖమూ దుఃఖం స్థానంలో క్రోధమూపెరిగి చెల్లెలని చూడకుండా కత్తితో కంఠం నరకబోయాడు. వసుదేవుడు వద్దని వేడుకున్నాడు. పుట్టిన బిడ్డల్ని నీకు అప్పగిస్తామన్నాడు. చంపుకో అన్నాడు. దేవకిని విడిచి పెట్టమన్నాడు. కంసుడు మెత్తబడ్డాడు. ప్రాణాలు తియ్యకుండా దేవకీ దంపతులని చెరసాలలోవేసాడు. అలా దేవకి కాపురం కన్నీళ్ళతో చెరసాలలోనే గడిచింది. దేవకి గర్భం ధరించిందేగాని అది సంతోషంకన్నా దిగులునీ దుఃఖాన్నీ పెంచింది. నేలనపడీపడకుండా కత్తికో వేటుగా ఆరుదఫాలు పసికందుల్ని చంపేసాడు కంసుడు. దేవకి తల్లడిల్లిపోతూనే ఉంది. ఏడవ సంతానం గర్భసంరక్షణ యోగం చేత దేవకి నుండి రోహిణి గర్భానికి చేరింది. ఆ బిడ్డే బలరాముడు. అష్టమ సంతానం సమీపించింది. కంసుని కట్టడీ పెరిగింది. తనని కట్టుకోబట్టే ఇన్ని కష్టాలని భర్త వసుదేవుణ్ణి పట్టుకు బోరుమంది. ప్రతి గడియా గండంలానే గడిపింది. అష్టమ సంతానంగా పుట్టిన కృష్ణుడిని యశోద ఇంట చేర్చి, యోగ మాయని తెచ్చి దేవకి పక్కన ఉంచాడు వసుదేవుడు. దేవకి కన్నీళ్ళకు కరగని కంసుడు తన మృత్యువుని మృత్యువు ముంగిట నిలబెట్టేందుకు పాపని గాల్లోకి విసిరి కత్తి దూయబోతే – గాల్లోనే నిలిచిన పాప “నిన్ను చంపేవాడు భూమ్మీదే ఉన్నాడు. నీ ప్రాణాలు తీస్తాడు” అని పలికింది.

దేవకి తన బిడ్డకోసం పరితపించింది. కంసుని వల్ల ఏ ఆపదా కలగకూడదని ఆ తల్లి మనసు భగవంతుణ్ణి ప్రార్థించింది. పెరిగి పెద్దైన కృష్ణుడు కంసుణ్ణి చంపి చెరసాలనుండి దేవకీ వసుదేవులను విడిపించాడు. పెరిగి పెద్దవాడైన కృష్ణుడు దేవకితోడనే ఉన్నాడు. వసుదేవుడు ప్రాణాలు వీడితే అతనితో చితిని చేరింది.

అయితే దేవకి ప్రాణాలు యెప్పుడూ ప్రాణాలు కోల్పోయిన బిడ్డలమీదే ఉండేది. అందుకనే కంసుని మరణం తర్వాత మరణించిన తన బిడ్డల్ని చూడాలనుకుంది. ఆమె కోరికను బలరామకృష్ణులు తీర్చారు. పాతాళలోకానికి తీసుకువెళ్ళారు. మొదటి ఆరుగురు ముందు జన్మల మారీచపుత్రులు. పుట్టగానే సంహరించేలా శాపం పొందారు. అయితే ఆ చనిపోయిన వాళ్ళని తెచ్చి దేవకి ముందు ఉంచారు. వారు దేవకి కళ్ళకి పనిబిడ్డలుగానే కనిపించారు. దేవకి మాతృహృదయం ఉప్పొంగింది. ఆ బిడ్డల్ని ముద్దాడింది. పాలు తాపింది. శ్రీకృష్ణుని వల్ల వారి శాపం తొలగడం వేరే కథ. దేవకీసుతులు దేవకికీ కృష్ణునికీ నమస్కరించి ప్రయాణించి అదృశ్యమయ్యారు!

సహజమైన మాతృత్వం కూడా మరణయాతన కావడం దేవకి కథలో విషాదం!

కృష్ణుని వంటి వానికి జన్మనివ్వడం ఆనందం!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  25 July 2015 1:02 PM GMT
Next Story