విపత్తులొస్తే తొలి స్పందన నాదే: జగన్‌

రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా మొదట స్సందించేది తానేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో అన్నదాతకు శోకం తప్ప ఏమీ మిగలదలని ఆయన అన్నారు. రైతు భోరోసా యాత్రలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లాలోని రొళ్ల మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు మాటలతో కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెక్షన్‌-8 అంటూ కొంతకాలం, పుష్కరాలు అంటూ మరికొంత కాలం గడిపేసి ప్రజల్ని అభివృద్ధి నుంచి పక్కదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మంత్రి పదవులు పంచుకుని ధిలాసాగా కాలక్షేపం చేస్తున్నారని, తమకు రావాల్సిన కనీస అవసరాలపై కూడా కేంద్రాన్ని నిలదీసే సత్తా చంద్రబాబుకు లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం వంటి ముఖ్యమైన అంశాలను పక్కన పడేసి ప్రభుత్వం నిద్ర పోతుందని, చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడి ప్రజల్ని మోసం చేస్తున్నారని జగన్‌ విమర్శించారు. ప్రత్యేకహోదాపై కేంద్రం స్పందించకపోతే 67 మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలతో కలిసి ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.