ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మౌతున్న గీత కార్మికులు

గీత వృత్తిని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకోవ‌డం కోసం క‌ల్లుగీత కార్మికులు ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మౌతున్నారు.  త‌మ‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స‌మ‌ర‌శంఖం పూరించ‌బోతున్నారు. ‘కల్లుగీత వృత్తిని దెబ్బతీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. అందుకే గీత వృత్తి రక్షణ, సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1నుంచి 14వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నాం’ అని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్ర దేముడు, కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలి ఎన్జీవో కళ్యాణ మండపంలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. గ్రామాల్లో మద్యం విక్రయాల కారణంగా కల్లు విక్రయాలు క్షీణించాయనీ, గీత కార్మికులు తమ వృత్తిని స్వచ్ఛందంగా వదిలేసేలా ప్రభుత్వ విధానాలున్నాయనీ న‌ర‌సింహ‌మూర్తి విమర్శించారు. 
        కల్లుగీత సొసైటీలకు తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో ఐదెకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను అమలు చేయాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 50ఏళ్లు పైబడిన గీత కార్మికులకు పింఛను ఇవ్వాలనీ, కల్లుగీత కార్మికుల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలనీ వారు కోరుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.767ను రద్దు చేసి నూతన తాటి పాలసీని ప్రకటించాలని కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో హుదూద్‌ తుపాను వల్ల నష్టపోయిన కల్లుగీత కార్మికులకు రూ.10వేలు నష్టపరిహారం ఇస్తానన్న ప్రభుత్వం ఆ సంగతే ఎత్తడం లేద‌ని వారు వాపోతున్నారు. తెలంగాణలో పెండింగ్‌ సొసైటీలను పునరుద్ధరించారనీ, ఆంధ్రప్రదేశ్‌లోనూ పున:ప్రారంభిం చాలని గీత‌కార్మికులు కోరుతున్నారు. గీత కార్మికుల సమస్యలపై వచ్చేనెల 1నుంచి 14వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్త్రృత ప్రచారం నిర్వహించి అదే రోజు రాష్ట్రంలోని అన్ని తహశీల్దారు కార్యాలయాలను ముట్టడిస్తామని నాయ‌కులు వెల్ల‌డించారు. గీత కార్మికుల పోరాటానికి ఇప్ప‌టికే సిపిఎం సంపూర్ణ మద్దతు తెలిపింది.