దేశం హయాంలో మహిళలకు రక్షణ కరవు: విజయసాయిరెడ్డి

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి విమర్శించారు. రితేశ్వరి ఆత్మహత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి రక్షణ లేకుండా పోవడానికి కారణం ప్రభుత్వ ఉదాసీన వైఖరేనని ఆయన ఆరోపించారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ రితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, ఎంతటి వారైనా వదలకూడదని ఆయన అన్నారు. ఆ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండు చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి కేసుల్లో నిందితులు శిక్షల నుంచి తప్పించుకున్నా కేసుల్ని బయటికి తీసి శిక్షలు పడేలా చేస్తామని విజయసాయి రెడ్డి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు దోచుకోవడానికి అవకాశం లభించిందని, పనులేమీ జరగడం లేదని ఆయన ఆరోపించారు.