‘వరల్డ్‌ స్టూడెంట్స్‌ డే’గా కలాం జన్మదినం: ఐరాస

భారత మాజీ రాష్ట్రపతి, ఇండియన్‌ మిసైల్‌, అంతరిక్ష పరిశోధన రంగంలో నిష్ణాతుడు అయిన ఏపీజే అబ్దుల్‌ కలాంకి ఐక్యరాజ్య సమితి కూడా తనదైన శైలిలో నివాళులర్పించింది. అబ్దుల్‌ కలాం జన్మదినం అక్టోబర్‌ 15ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. 1931 అక్టోబర్‌ 15న ఏపీజె అబ్దుల్‌ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. అంతర్జాతీయంగా అబ్దుల్‌ కలాంకు ఉన్న మంచి పేరుకు ఐక్యరాజ్యసమితి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఓ మచ్చుతునకగా భావించవచ్చు. కలాం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే ఐక్యరాజ్య సమితి ఇలాంటి నిర్ణయం ప్రకటించడం బహుశా ఆ సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని పరిశీలకులు అంటున్నారు. జననం నుంచి మరణం దాకా జయంతులు, వర్ధంతులు అంటూ రకరకాల కార్యక్రమాలకు రూపం ఇస్తున్న వేళ ఇలా ఒక అంతర్జాతీయ సంస్థ… అదీ ప్రపంచానికి దిశానిర్దేశం చేసే సంస్థ ఒక మహోన్నత నాయకుడికి నివాళులర్పించడమే కాకుండా ఆయన స్మృతి చిహ్నంగా వినూత్నమైన ఒక పిలుపు ఇవ్వడం… అతి స్వల్ప కాలంలో ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల ప్రపంచం యావత్తూ హర్షం వ్యక్తం చేస్తోంది.