Telugu Global
Family

మరణం (Devotional)

పూర్వం ఒక  సన్యాసి ఉండేవాడు. ఆయన దగ్గర అరవైమంది శిష్యులు ఉండేవాళ్ళు. తనకు తెలిసిందంతా వాళ్ళకు చెప్పాడు. కొన్నాళ్ళ తరువాత వాళ్ళని ఒక కొత్త అనుభవానికి లోను చెయ్యాలని నిర్ణయించాడు. శిష్యులందర్నీ సమావేశపరిచి “ఇప్పుడు మనమొక సుదీర్ఘ ప్రయాణంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆ మార్గంలో ఏం జరగబోతోందో నాకు కచ్చితంగా మాత్రం తెలీదు. ఏమయినా జరిగే అవకాశం ఉంది. దానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రం నన్ను అనుసరించవచ్చు. మొదట మీరొక సూక్తిని మాత్రం మననం చెసుకోండి. అది “గురువు […]

పూర్వం ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన దగ్గర అరవైమంది శిష్యులు ఉండేవాళ్ళు. తనకు తెలిసిందంతా వాళ్ళకు చెప్పాడు. కొన్నాళ్ళ తరువాత వాళ్ళని ఒక కొత్త అనుభవానికి లోను చెయ్యాలని నిర్ణయించాడు.

శిష్యులందర్నీ సమావేశపరిచి

“ఇప్పుడు మనమొక సుదీర్ఘ ప్రయాణంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆ మార్గంలో ఏం జరగబోతోందో నాకు కచ్చితంగా మాత్రం తెలీదు. ఏమయినా జరిగే అవకాశం ఉంది. దానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రం నన్ను అనుసరించవచ్చు. మొదట మీరొక సూక్తిని మాత్రం మననం చెసుకోండి. అది “గురువు గారి బదులు నేను మరణిస్తాను” అని. నన్నుఅనుసరిస్తే నేను ఎప్పుడు దానికి సిద్ధపడతానో అప్పుడు ముందుకు రాగలిగిన వాళ్ళు మాత్రమే నన్ను అనుసరించండి” అన్నాడు.

శిష్యులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలు పోయారు. సన్యాసి ఉద్దేశాల పట్ల వాళ్ళకు సందేహం కలిగింది. “ఆయన ప్రమాదానికి లోనవుతాడని ఆయనకు తెలుసు. అందుకు మనల్ని బలిపశువుల్ని చేసేటట్లున్నాడు” అనుకున్నారు.

అందుకని “మీరు బహుశా ఏదయినా హత్యకు పూనుకునేట్లున్నారు. తెలిసి తెలిసీ మేము అట్లాంటి ప్రమాదంలో తలదూర్చదలచుకోలేదు. మేము మీతోబాటు రాము” అన్నారు.

కానీ ఒక శిష్యుడు మాత్రం మౌనంగా గురువుగార్ని అనుసరించాడు.

ఇద్దరూ ఒక నిరంకుశుడయిన రాజు పాలించే దేశంలోకి ప్రవేశించారు. వాళ్ళు ప్రవేశించిన వెంటనే సైనికులు వాళ్ళని బంధించారు. తన క్రూర చర్యలద్వారా ఆ రాజు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి తన అధికారాన్ని స్థిరపరచుకోవాలని చూస్తున్నాడు.

“ఎందుకు మమ్మల్ని బంధించారు?” అని సన్యాసి అడిగితే సైనికులు “కొత్తగా ఎవరయినా సన్యాసి కనిపిస్తే అతన్ని బంధించి తీసుకురమ్మని మా రాజుగారి ఆజ్ఞ. బహిరంగంగా కొత్తవ్యక్తిని బహుశా ఉరి తియ్యవచ్చు” అన్నారు.

“అది అన్యాయం కదా” అని సన్యాసి అంటే “న్యాయమో అన్యాయమో రాజుగారి ఆజ్ఞను పాటించడం మా విధి” అన్నారు సైనికులు. సన్యాసి శిష్యుడి వైపు చూశాడు.

సన్యాసి, శిష్యుడు సైనికులతో బాటు రాజుగారి సభకు వెళ్ళాడు. జనమంతా అక్కడ జరగబోయేది చూడ్డానికి గుంపులుగా భయంతో నిలబడ్డారు.

“తిరుగుబోతులకు నా రాజ్యంలో స్థానం లేదు. అటువంటి వాళ్ళని బహిరంగంగా ఉరి తియ్యడం మా ఆచారం” అన్నాడు రాజు.

శిష్యుడు ముందుకు వచ్చి “నన్ను ఉరితీయండి. నేను మరణించడానికి సిద్ధం” అన్నాడు.

వెంటనే సన్యాసి ముందుకు వచ్చి

“రాజుగారూ! నన్ను ఉరితీయండి. ఈ కుర్రవాడిని వదిలి పెట్టండి. నిజానికి నేను తిరుగుబోతును. పాపం పిచ్చివాడు. అతను కేవలం ఆకర్షణకు లోనయి నన్ను అనుసరించాడు.

శిష్యుడు కన్నీళ్ళ పర్యంతమయి “రాజుగారూ! నేను మరణించాలి. దయచేసి సన్యాసి గారిని వదిలి పెట్టండి” అని అరిచాడు.

వీళ్ళ ఇద్దరి తొందర చూసి రాజుగారికి ఆశ్చర్యం వేసింది. తన మంత్రుల్ని చూసి “ఇది స్వర్ణయుగంలా ఉంది. ఒకడి బదులు ఇంకొకడు చావడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి?” అన్నాడు.

మంత్రులు క్షణకాలం ఆలోచించి “ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలు ఏమనుకుంటారో? అసలు తననే ఉరి తియ్యమని సన్యాసి ఎందుకు అంటున్నాడో అతన్నే అడిగి తెలుసుకుందాం” అన్నారు.

రాజు సన్యాసిని “ఎందుకంతగా తొందర పడుతున్నావు? మరణించడానికి ఎందుకంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నావు?” అన్నాడు.

దానికి సన్యాసి “మహారాజా! ఈ సభలో, ఇక్కడ, ఈ క్షణం ఎవరయితే చనిపోతారో వారికి స్వర్గంలో చోటు ఉంటుందని జ్యోతిష్కులు చెప్పారు. వారికి దైవత్వం సంభవిస్తుందన్నారు. అందుకనే సహజంగానే నేను, నా శిష్యుడూ తొందర పడుతున్నాం. దయచేసి నన్ను అందరిముందూ బహిరంగంగా ఉరి తీయండి” అన్నాడు.

రాజుగారు క్షణకాలం ఆలోచించి “తిరుగుబోతులు, సన్యాసులు స్వర్గానికి వెళ్ళగాలేంది నాలాంటి రాజు ఎందుకు వెళ్ళకూడదు?” అనుకుని మంత్రుల్ని ఉద్దేశించి “వీళ్ళిద్దరి బదులు వెంటనే నన్ను ఉరి తీయండి. ముహూర్తం మించకుండా ఆ పని పూర్తిచేయండి” అన్నాడు.

రాజుగారి ఉద్దేశాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు.

వెంటనే బహిరంగంగా రాజుగార్ని ఉరి తీశారు.

పీడ విరగడ అయినందుకు జనం ఊపిరి పీల్చుకున్నారు.

సన్యాసి, శిష్యుడు కలిసి తమదారంట తాము వెళ్ళిపోయారు.

– సౌభాగ్య

First Published:  27 July 2015 1:01 PM GMT
Next Story