సెన్సార్ ఆఫీస్ లోనే పైరసీ

మలయాళంలో ఈమధ్య విడుదలైన ప్రేమమ్ సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా హక్కుల్ని తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్ భారీ మొత్తానికి దక్కించుకున్న విషయం కూడా చాలామందికి తెలుసు. అయితే విడుదలైన 4 రోజులకే ఈ సినిమా పైరసీ బారినపడింది. అద్భుతమైన హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ మార్కెట్లోకి వచ్చేసింది. సినిమా సూపర్ హిట్టయినప్పటికీ, ఈ పైరసీ ఎఫెక్ట్ వల్ల ప్రేమమ్ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన ఏంటీ-పైరసీ పోలీసులు అసలు పైరసీకి కారణం సెన్సార్ ఆఫీసే అని తెలుసుకున్నారు. పైరసీ అయిన ప్రింట్ లో సెన్సార్ వాటర్ మార్క్ కూడా ఉండడం గమనించిన పోలీసులు, ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసి అసలైన నిందితుల్ని కనిపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు టీనేజర్లను అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మలయాళం సెన్సార్ బోర్డు సభ్యుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఓ సినిమా ఏకంగా సెన్సార్ ఆఫీస్ లోనే పైరసీకి గురవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పైరసీకి పాల్పడిన సదరు ముగ్గురు ఉద్యోగుల్ని సెన్సార్ బోర్డు నుంచి నెలన్నర కిందటే సస్పెండ్ చేశారు.ఇప్పుడు పోలీసులు వాళ్లని అదుపులోకి తీసుకున్నారు.