సీడ్ కాపిట‌ల్‌కు సింగ‌పూర్ ఇసుక!

ఏపీ సీడ్ కేపిట‌ల్ నిర్మాణానికి సింగ‌పూర్ ఇసుక వాడ‌నున్నారా? భారీ నిర్మాణాల‌కు అత్యంత అనువైన కృష్ణా ప‌రివాహ‌క ప్రాంత ఇసుక రాజ‌ధాని నిర్మాణానికి ఎందుకు ప‌నికిరాదు. అమ‌రావ‌తి చెంత‌నే ఉన్న కృష్ణ‌మ్మ ఇసుకాసురుల‌కు కాసులు పండిస్తున్నఇసుక సీడ్ కేపిట‌ల్ క‌న‌స్ట్రక్ష‌న్‌కు ఎందుకు ఉప‌యోగ‌ప‌డ‌దు? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కృష్ణ‌ప‌ట్నం కంటైన‌ర్ టెర్మిన‌ల్ అధికారుల (కేసీటీ) వ‌ద్ద ఉన్నాయి. సీడ్ కేపిట‌ల్ మ్యాప్ ప్ర‌కారం భారీ భ‌వంతులెన్నో ఉంటాయి, వీటికి తోడు వంతెన‌లు, ఫ్లైఓవ‌ర్లు లెక్క‌కు మించి ఉన్నాయి. వీటి నిర్మాణానికి స‌రిప‌డే ఇసుక కృష్ణా న‌ది రీచ్‌లు అందించ‌లేవు. ఇప్ప‌టికే ఇక్క‌డి ఇసుక చాలావ‌ర‌కూ త‌ర‌లిపోయింది. దీంతోపాటు త‌వ్వి త‌ర‌లించడానికి భారీ వ్య‌యం అవుతుంద‌నే అంచ‌నాలున్నాయి. ఒక రాజ‌ధాని ప్రాంత నిర్మాణాల‌కు స‌రిప‌డా కృష్ణా తీరంలో ఇసుక త‌వ్వేందుకు స‌వాల‌క్ష నిబంధ‌న‌లు అడ్డొస్తాయ‌ని చెబుతున్నారు కేసీటీ అధికారులు. ఈ సమ‌స్య‌ల‌న్నింటికీ ప‌రిష్కార‌మే సింగ‌పూర్ శాండ్ అంటున్నారు. రాజ‌ధాని నిర్మాణాల‌కు స‌రిప‌డే ఇసుక‌..ఇక్క‌డితో పోల్చుకుంటే త‌క్కువ‌కు వ‌స్తుంద‌ని, భారీ ప‌రిమాణంలో ఇసుక ఉంద‌ని, ఈ ఇసుక త‌ర‌లింపు ద్వారా త‌మ వ్యాపారం కూడా ఊపందుకుంటుంద‌ని చెబుతున్నారు కేసీటీ డైరెక్ట‌ర్ శ్రీరామ్ ర‌విచంద‌ర్‌. వియ‌త్నాం, కంబోడియా దేశాల్లో విస్త‌రించి ఉన్న మెకాంగ్ న‌దీప‌రీవాహ‌క ప్రాంతంలో అప‌రిమిత‌మైన ఇసుక నిల్వ ఉంద‌ని, రాజ‌ధానికి నిరంత‌రాయంగా స‌ర‌ఫ‌రా చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మొత్తం ఈ లెక్క‌ల‌న్నీ చూసుకుంటే… అమ‌రావ‌తి నిర్మాణంలో సింగ‌పూర్ ప్ర‌భుత్వ భాగ‌స్వామ్య‌మే కాదు..సింగ‌పూర్ స‌ర‌ఫ‌రా చేసే ఇసుక‌కు కూడా భాగ‌స్వామ్యం ద‌క్కేలా ఉంది.