మోడీకి షాట్‌గన్‌ శతృఘ్నసిన్హా ఝలక్?!

ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పటి నుంచి నరేంద్రమోడీ తీరు మారిపోయింది. అంతా తానే అయ్యి వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. ఎన్నికల ముందే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం… తనకు ప్రజలు భారీ ఎత్తున మద్దతు ఇచ్చి అధికారపీఠంపై కూర్చోబెట్టడంతో ఆయనకు కాన్పిడెన్స్‌ విపరీతంగా పెరిగి పోయింది. దీంతో ఎవరినీ లెక్క చేయనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో తాము పార్టీలో కరివేపాకు మాదిరిగా తయారయ్యామనే భావన అందరిలోనూ నాటుకుపోతోంది. తమకు ప్రాధాన్యత దక్కడం లేదని అనేక మంది నెత్తీనోరు మోదుకొంటున్నా ఫలితం ఉండడం లేదు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది తమ అసంతృఫ్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు కూడా! ఇలాంటి వారిలో ఒకరు శతృఘ్నసిన్హా. భారతీయ జనతా పార్టీలో ఒకానొక సీనియర్ నేతగా ఎంపీగా ఉన్నారు శత్రుఘ్న. బాలీవుడ్‌లో ఒక సమయంలో స్టార్‌డమ్‌ ఉన్న హీరోగా వెలుగొందారు. ఆ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. అయితే మోడీ హయాంలో మాత్రం శతృఘ్నకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. అనువుగా లేని పరిస్థితుల్లో ఆయన కొన్ని రోజులుగా చాలా సైలెంట్‌గా గడుపుతున్నారు. ఈ హీరో తాజాగా ఉన్నట్టుండి బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలిశారు. బిహార్‌కే చెందిన శతృఘ్నసిన్హా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెళ్లి మీట్ కావడం ఆసక్తి కరంగా మారి చర్చనీయాంశమయ్యింది. ఈ మీటింగ్‌తో ఇప్పుడు ఆయన కదలికలపై కొత్త అనుమానాలు చెలరేగుతున్నాయి. ఈయన భారతీయ జనతా పార్టీని వీడతాడా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదని బాధతో ఉన్న ఈ మాజీ హీరో… ఇప్పుడు భారతీయ జనతాపార్టీని  వీడినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రచారం జరుగుతోంది. మరి అదే జరిగితే.. మోడీ వైఖరితో బీజేపీకి నష్టం జరగడం మొదలయినట్టేనేమో!