Telugu Global
Family

మాధవి (For Children)

తండ్రిమాటకు తలవొంచి అడవుల పాలైన రాముని కథ మనకు తెలుసు! తండ్రి మాటకు తలవొంచి జీవితమే అడవిని చేసుకున్న అతివ మాధవి కథ మనకు తెలీదు! మరుగున పడిన మాధవి కథ మనసుకు నొప్పి పుట్టించే కథ! మగువల కథ! మరిచిపోలేని కథ! కథ కాదిది తరతరాల వ్యధ! ప్రతిష్ఠాన పురానికి రాజు యయాతి. యయాతి కూతురు మాధవి. తండ్రంటే సహజమైన ప్రేమ ఆ కూతురుకి. చెప్పినట్లు నడుచుకొనేది. తండ్రికోసం తలవొంపులు పడడానికైనా సిద్ధపడేది. తండ్రి తలెత్తుకు […]

తండ్రిమాటకు తలవొంచి అడవుల పాలైన రాముని కథ మనకు తెలుసు! తండ్రి మాటకు తలవొంచి జీవితమే అడవిని చేసుకున్న అతివ మాధవి కథ మనకు తెలీదు! మరుగున పడిన మాధవి కథ మనసుకు నొప్పి పుట్టించే కథ! మగువల కథ! మరిచిపోలేని కథ! కథ కాదిది తరతరాల వ్యధ!

ప్రతిష్ఠాన పురానికి రాజు యయాతి. యయాతి కూతురు మాధవి. తండ్రంటే సహజమైన ప్రేమ ఆ కూతురుకి. చెప్పినట్లు నడుచుకొనేది. తండ్రికోసం తలవొంపులు పడడానికైనా సిద్ధపడేది. తండ్రి తలెత్తుకు ఉండడమే కూతురుగా మాధవికి కావలసింది!

ఒకరోజు విశ్వామిత్రుని శిష్యుడైన గాలవుడు గరుడుడితో కలసి ప్రతిష్ఠానపురం వచ్చాడు. ఎందుకంటే అతనికి వెయ్యి గుర్రాలు కావాలి. అందుకే అడగవచ్చాడు. గురు దక్షిణగా విశ్వామిత్రునికి వెయ్యి గుర్రాలు ఇవ్వవలసి ఉంది. గాలవుడు విశ్వామిత్రుని దగ్గర విద్యనేర్చుకున్నాడు. గురుదక్షిణగా నీకు తెలిసిన విద్య కోరినవారికి ఇవ్వు… నేర్పు అని విశ్వామిత్రుడు చెపితే, వేరు కోరిక కోరమంటూ విసిగించాడు. కోపిష్టియైన విశ్వామిత్రుడు వేయి గుర్రాలు కావాలన్నాడు. యయాతి దగ్గర వెయ్యి గుర్రాలు లేవు. అందుకనే ఉన్న రెండు వందల గుర్రాలు ఇచ్చాడు. చాలక తన కూతురు మాధవిని ఇచ్చి – ఆమెను ఏరాజుకన్నా ఇచ్చి వెయ్యి గుర్రాలు పుచ్చుకోమన్నాడు. తండ్రి మాటకు తలవంచి గాలవుని వెంట నడిచింది మాధవి!

మొదట మాధవిని ఇక్ష్వాకుడనే రాజు దగ్గరకు గాలవుడు తీసుకువెళ్ళాడు. మాధవిని తీసుకొని బదులుగా గుర్రాలను ఇమ్మన్నాడు. ఉన్న రెండొందల గుర్రాలను ఇచ్చి మాధవితో వసుమనస్సుడనే కొడుకునుకన్న ఇక్ష్వాకుడు తిరిగి గాలవునికి మాధవిని అప్పగించాడు. తర్వాత కూడా అలాగే దివోదాసుకు మాధవిని ఇచ్చి బదులుగా గుర్రాలను ఇమ్మన్నాడు. ఉన్న రెండొందల గుర్రాలను ఇచ్చి – మాధవితో ప్రవర్ధనుడనే కొడుకునుకన్న దివోదాసు తిరిగి గాలవునికి మాధవిని అప్పగించాడు. తర్వాత కూడా అలాగే ఉశీనరునికి మాధవిని ఇచ్చి బదులుగా గుర్రాలను ఇమ్మన్నాడు. ఉన్న రెండొందల గుర్రాలను ఇచ్చి – మాధవితో “శిబి” అనే కొడుకును కన్న ఉశీనరుడు తిరిగి గాలవునికి మాధవిని అప్పగించాడు.

యయాతి వల్ల రెండొందల గుర్రాలు, మాధవి వల్ల మరి ముగ్గురు రాజుల ద్వారా ఆరొందల గుర్రాలు – మొత్తం రెండువందలు తగ్గాయి వెయ్యిగుర్రాలకి! ఇంక గుర్రాలు ఎవరి దగ్గరా లేవు! అదే మాట విశ్వామిత్రునికి చెప్పి గుర్రాలతో పాటు మాధవిని ఇచ్చాడు! మాధవితో అష్టకుడనే కొడుకుని కన్నాడు విశ్వామిత్రుడు. వెయ్యి గుర్రాలను చెల్లించుకున్నట్టయిన విశ్వామిత్రుడు మాధవిని తిరిగి గాలవునికి అప్పగించాడు. గాలవుడు మాధవిని తిరిగి ఆమె తండ్రిగారైన యయాతికి అప్పగించాడు.

కన్యత్వము చెడకుండా సంతానం కలిగేలా ఒక ఋషి వల్ల మాధవి వరం పొందిందని చెపుతారు. యయాతి మాధవికి పెళ్ళిచెయ్యాలనుకున్నాడు. మాధవికి ఆసక్తి లేకపోయింది. తండ్రి అనుమతితో అడవులకు వెళ్ళింది. తపస్సు చేసింది. మోక్షం పొందింది. మాధవి నలుగురు కొడుకులు నక్షత్రాలై నింగిలో నిలిచారు. పుణ్యం చాలక స్వర్గ ద్వారం దగ్గర నిలబడిపోయిన యయాతికి నలుగురు మనవలు నాలుగువంతుల పుణ్యం ఇచ్చి ప్రవేశం సులువు చేసారు!

కృతయుగంలో మాధవి కథ జరిగినట్టుగా ఉంది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  27 July 2015 1:02 PM GMT
Next Story