Telugu Global
Others

ఖాకీల ఓవ‌రాక్ష‌న్‌!

మైల‌వ‌రం భూపోరాటంలో మ‌ధుకు గాయాలు పోలీసులు తాము ప్ర‌జా ర‌క్ష‌కుల‌మ‌న్న విష‌యాన్ని మ‌ర‌చిపోతుంటారు. అధికారంలో ఉన్న పార్టీకి బంటుల‌మ‌ని భావిస్తుంటారు. అందుకే స‌మ‌స్య‌ల‌పై పోరాడుతుండే ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతుంటారు. అటవీ భూములను వెనక్కు తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని కోరుతూ భూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కృష్ణాజిల్లా మైలవరంలో రాస్తారోకోకు దిగిన వారిపై పోలీసులు విరుచుకుప‌డ్డారు. సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు ను పోలీసులు అరెస్టు చేశారు. మాట్లాడనివ్వకుండానే మైకులాక్కున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏడుగురు ఎస్‌ఐలు ఒకేసారి […]

ఖాకీల ఓవ‌రాక్ష‌న్‌!
X
మైల‌వ‌రం భూపోరాటంలో మ‌ధుకు గాయాలు
పోలీసులు తాము ప్ర‌జా ర‌క్ష‌కుల‌మ‌న్న విష‌యాన్ని మ‌ర‌చిపోతుంటారు. అధికారంలో ఉన్న పార్టీకి బంటుల‌మ‌ని భావిస్తుంటారు. అందుకే స‌మ‌స్య‌ల‌పై పోరాడుతుండే ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతుంటారు. అటవీ భూములను వెనక్కు తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని కోరుతూ భూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కృష్ణాజిల్లా మైలవరంలో రాస్తారోకోకు దిగిన వారిపై పోలీసులు విరుచుకుప‌డ్డారు. సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు ను పోలీసులు అరెస్టు చేశారు. మాట్లాడనివ్వకుండానే మైకులాక్కున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏడుగురు ఎస్‌ఐలు ఒకేసారి మధును చుట్టుముట్టి ఆయన్ను జీపులో ఎక్కించే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. మధుకు డోర్‌ తగిలి స్వల్ప గాయమైంది. అడ్డుకోబోయిన సిపిఎం జిల్లాకార్యదర్శి ఆర్‌.రఘు, నాయకులు పి.వి. ఆంజనేయులును పోలీసులు ఈడ్చిపడేశారు. ఈ క్రమంలో పేదలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు దుర్భాష లాడుతూ పేదలను పక్కకు నెట్టేశారు. చాట్రాయి ఎస్‌ఐ పరమేశ్వరరావు మహిళలను రాయడానికి వీల్లేని భాషలో నిందించారు. మరోవైపు మధును తీసుకెళుతున్న జీపును పేదలు అడ్డగించారు. కదలనీయకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. వారిని కూడా పక్కకు లాగేశారు. అరెస్టు చేసిన వారిని మైలవరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనంగా వందలాదిమంది ప్రజలు ప్రదర్శనగా పోలీసుస్టేషన్‌కు బయలుదేరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంంతో నాయకులను వెంటనే విడుదల చేశారు. పోలీసుస్టేషన్‌ నుండి ప్రదర్శనగా సిపిఎం కార్యాలయానికి చేరుకున్నారు. అరెస్టయిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కె.కళ్యాణ్‌, రైతుసంఘం నాయకులు జె.ప్రభాకర్‌, సిపిఎం డివిజన్‌ కార్యదర్శి తమ్మా రాంబాబు ఉన్నారు. నాయకులను దుర్భాషలాడుతున్న క్రమంలో చాట్రాయి ఎస్‌ఐ పరమేశ్వరరావును తోటి ఎస్‌ఐలే వారించాల్సి వచ్చిందంటే అతని పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అటవీభూములు పెద్ద‌ల‌కు క‌ట్ట‌బెట్టే ప్ర‌య‌త్నం ?
కృష్ణా జిల్లాలో రెండులక్షల ఎకరాల్లో అటవీ భూములున్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని పెద్ద‌ల‌కు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. 1956లోనే మైలవరం ప్రాంతంలో సొసైటీలకు అటవీ భూములను కేటాయించారు. 28 వేలమంది వాటిని సాగుచేసుకుంటున్నారు. పరిహారం లేకుండా తీసుకోవచ్చనే ఉద్దేశంతోనే మైలవరం ప్రాంతంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ భూములను ధనవంతులు, కోటీశ్వరులు, పెద్దపెద్ద వ్యాపారులకు కట్టబెట్టాలనే ప్రయత్నాలు చేస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అట‌వీ భూముల‌ను డీనోటిఫై చేసి వాటిపై ఆధార‌ప‌డి జీవిస్తున్న పేదలకు అన్యాయం చేస్తోంది. విఎస్‌ఎస్‌, ఫారెస్టు పట్టాభూముల్లో వేలాదిమంది జీవనోపాధి పొందుతున్నారు. వారిని తరిమేసి కొద్దిమంది తెలుగుదేశం నాయకులకు వాటిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అధికారంలోకి రాకముందు అటవీభూములను పేదలకే చెందేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వానికి లేఖ రాశారు. అధికారంలోకొచ్చిన తరువాత ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే భూములు లాక్కునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.
First Published:  28 July 2015 10:33 PM GMT
Next Story