తెలంగాణలో ఉద్యోగాలకు విధివిధానాల ఖరారు

తెలంగాణలో ఉద్యోగ నియామకాల పరీక్షకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. గ్రూప్‌-1లో  6వ పేపర్‌, గ్రూప్‌-2లో 4వ పేపర్‌‌ అదనంగా చేర్చారు. ఈ పేపర్లలో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలను టీఎస్‌పీఎస్సీ చేర్చింది. కొత్తగా గ్రూప్‌-2బి స్థానంలో గ్రూప్‌-3ను రూపొందించారు. పోస్టుల విభజన గ్రూపుల వారీగా కూడా చేశారు. గ్రూప్‌-1 పరీక్షలోని వెయ్యి మార్కులకు గాను, రాత పరీక్షకు 900 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. గ్రూప్‌-2 పరీక్షలోని 675 మార్కులకు గాను రాత పరీక్షకు 600 మార్కులు, ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1లో డిప్యూటీ కలెక్టర్‌, ఆర్డీవో, ఎంపీడీవో సహా 20 రకాల పోస్టులను, గ్రూప్‌ 2లో మున్సిపల్‌ కమిషనర్‌, డిప్యూటీ తహసిల్దార్‌ సహా 12 రకాల పోస్టులను, గ్రూప్‌ 3లో 17 రకాల పోస్టులను ప్రభుత్వం నిర్దేశించింది.