న‌న్ను మీ జ్ఞాప‌కాల్లో కాదు,  జ్ఞానంలో మిగ‌ల‌నివ్వండి

క‌లాం లాంటి జీవ‌న‌యోధుడి మ‌ర‌ణంతో ఇండియా జ‌వ‌స‌త్వాలకు గ‌ణ‌నీయంగా న‌ష్టం వాటిల్లింది. అది ఎవ‌రూ త‌ప్పించ‌లేనిది. దేశమే దిగులు ముఖం వేసుకుని ఆయ‌న క్షిప‌ణిని పంపిన‌ నింగివైపు బెంగ‌గా చూసిన క్ష‌ణాలు, గంట‌లు…రోజులుగా గ‌డిచిపోతున్నాయి. ఆ దిగులుకాలం గ‌డిచాక‌, ఆ త‌రువాత క‌లాం ఎక్క‌డుంటారు?  ఆయ‌న అందించిన టెక్నాల‌జీలో, శాస్త్రీయ‌ రంగంలో ఉన్న,  అడుగుపెట్ట‌బోతున్న‌వారి జ్ఞాప‌కాల్లో, విద్యార్థుల్లో ఆయ‌న‌ ర‌గిలించిన స్ఫూర్తిలో,  ప‌ద‌వీ డాంబికాల‌ను ప‌క్క‌కు నెట్టి ఆయ‌న న‌డిచిన మాన‌వ‌తా దారుల్లో….ఇంకా చాలాచోట్ల‌, చాలామందిలో, చాలాకాలం ఆయ‌న నిలిచే ఉంటారు. జీవించి ఉన్న‌పుడు అనుక్ష‌ణం మ‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కుడిగా న‌డిచిన క‌లాం, మ‌ర‌ణించాక  త‌న కోసం క‌న్నీరు పెడుతున్న అశేష భార‌తావ‌నిని చూసి ఏమ‌నుకుంటారు?….ఇప్పుడు మ‌న‌తో మాట్లాడే అవ‌కాశం ఉంటే ఆయ‌న ఏం చెప్పేవారు….అంద‌రివాడిగా మిగిలిన అబ్దుల్ క‌లాంకి అంతిమ నివాళిగా, ఆయ‌న ఆత్మ భాష్యానికి రూప‌మిస్తూ ఈ అక్ష‌ర పుష్ప‌గుచ్ఛం…..

పుట్టుక మ‌న‌చేతిలో లేదు, చావూ మ‌న‌చేతిలో లేదు…కానీ జీవితం మ‌న చేతుల్లోనే ఉంది….ఇది నిత్య‌ స‌త్యం. ప్ర‌యాణం ఎక్క‌డ మొద‌లుపెట్టాం అన్న‌ది ముఖ్యం కాదు, ఎక్క‌డికి చేరాం అన్న‌దే ముఖ్యం. నాకోసం క‌న్నీరు పెడుతున్న భార‌తాన్ని చూస్తున్నా….కానీ నేను కోరుకున్న‌ది క‌న్నీళ్ల భార‌తాన్ని కాదు, క‌ల‌లు క‌నే భార‌తాన్ని. నేను మీ మ‌న‌సుల్లో నిలిచేలా, ఇలా మిగ‌ల‌డానికి ఉప‌యోగించుకున్న ప‌రిక‌రాల‌న్నీ భూమ్మీదే, మీతోనే ఉన్నాయి.  వాట‌న్నింటినీ మీరూ ఉప‌యోగించుకున్న‌పుడే, స‌ద్వినియోగం చేసుకున్న‌పుడే అది నాకు ఘ‌న నివాళి.

మిమ్మ‌ల్ని అతి పెద్ద క‌ల‌లు క‌న‌మ‌న్నా.  నేనూ ఈ శాశ్వ‌త నిద్ర‌లోనూ కంటున్నా ఒక సుంద‌ర‌ స్వ‌ప్నాన్ని. నా దేశంలో ఒక్కో విద్యార్థి ఒక విజ్ఞాన జ్యోతిగా వెలుగుతాడ‌ని,  భావిత‌రాలు  మ‌న‌దేశాన్ని అన్ని విష‌యాల్లో  స్వావ‌లంభ‌న దిశ‌గా ఇంకా ఇంకా ప‌రుగులు పెట్టిస్తాయ‌ని.  భ‌యాలు, సందేహాలు, సందిగ్దాలు, పిరికిత‌నం, భావ‌దారిద్ర్యం అన్నీ వ‌దిలేసి ఉన్న‌త హిమాల‌యాలంత క‌ల‌ల‌ను ధీరులై స్వ‌ప్నిస్తార‌ని, ఆ స్వ‌ప్నాల‌ను నిజం చేసుకుంటార‌ని. నేను ఎదిగేందుకు వాడుకున్న ఆ పెద్ద క‌ల‌లు మీకూ ఉన్నాయి, మీ ద‌గ్గ‌రే ఉన్నాయి, మీరూ వాటిని వాడండి.

నాకు మంచి ప‌నులు చేయ‌డానికి స‌హ‌క‌రించిన కాలం…ఇక నాకు లేదు…కానీ మీకెంతో ఉంది. ప్ర‌పంచాన్ని కాదు, కాలాన్ని మేల్కొలిపే శ‌క్తి తెచ్చుకోండి. బ‌ద్ద‌కాన్ని నిర్దాక్షిణ్యంగా ఉరితీయండి…ఉప్పు పాత‌ర‌వేయండి. కాలానికే వేగం నేర్పండి…గ‌డియారాలను ప‌క్క‌న ప‌డేసి మీరు చేస్తున్న ప‌నితో కాలాన్ని కొల‌వండి. నేను మ‌ర‌ణించినపుడు ఒక్క‌రోజు కూడా సెల‌వు ఇవ్వ‌వ‌ద్దు అని చెప్పిన నాకు మీరిచ్చే నివాళి…మ‌న‌స్ఫూర్తిగా మీ విధిని మీరు నిర్వర్తించ‌డ‌మే.

మ‌నం పీల్చే ప్ర‌తి ఊపిరిలో ఉత్సాహం ఉర‌క‌లు వేయాలి.  జిజ్ఞాస జ్వ‌లించాలి. నేను వినియోగించుకున్నఆ ల‌క్ష‌ణాలు మీలోనూ ఉన్నాయి. వాటిని వాడండి. పేద‌రికం, ఆత్మ‌న్యూన‌త‌, ప‌ర‌దాస్యాల‌ను వ‌దిలేయండి. మ‌న ప‌నిలో మ‌నం ఉత్కృష్టంగా ఉన్న‌పుడు మ‌న‌కేమీ అడ్డుకావు. మ‌న‌కు మ‌న‌మే బాస్‌. మ‌న జీవితానికి మ‌నమే లీడ‌ర్‌.

డ‌బ్బు, ఆడంబ‌రాలు, వ‌స్తువులు…వీట‌న్నింటినీ వ‌దిలేసి చేతుల‌ను ఖాళీగా ఉంచుకోండి…ఎందుకంటే ఆ చేతులు ఎన్నో గొప్ప చేత‌లు చేయాలి క‌దా. మీరు సంపాదించిందంతా మెద‌డులోనే భ‌ద్ర ప‌ర‌చుకోండి…మెద‌డుని జ్ఞాన భాండాగారంగా వినియోగించుకోండి.

ఈ రోజు దేశాధినేతల నుండి చిన్నారి విద్యార్థుల వ‌ర‌కు అంతా నాకు ప్ర‌ణ‌మిల్లి క‌న్నీటి వీడ్కోలు ఇస్తున్నారంటే…గౌర‌వ వంద‌నం చేస్తున్నారంటే అదంతా చెందుతున్న‌ది నా ఈ పార్దీవ దేహానికి కాదు…మ‌నిషిత‌నాన్ని విశాలం చేయాల‌న్న నాలోని త‌ప‌న‌కు. మావ‌న బుద్దికి ముగ్దుడినై నేను వినియోగించుకున్ననాలోని సృజ‌నాత్మ‌క‌త‌కు,  విద్యార్థుల‌ను ప్రేమించ‌కుండా ఉండ‌లేని నా హృద‌యానికి…నా ఉనికిని  లిఖించుకున్న నా మాతృదేశానికి. ఇవ‌న్నీ మీలోనూ, మీతోనూ ఉన్నాయి…అనుక్ష‌ణం ఆ గుణాలు, ప‌నులు ఎక్క‌డ వెల్లివిరిసినా అక్క‌డ నేను మ‌ళ్లీ పుడుతుంటాను.

ప్ర‌కృతి మ‌నిషికి ఇచ్చిన స‌హ‌జ ల‌క్ష‌ణాలు ఈ గుణాలు.  మ‌నం ఎద‌గ‌డానికి వ‌రాలు, ప‌రిక‌రాలు అన్నీ ఇవే. ఎందరో మ‌హానుభావులు…ప్ర‌పంచానికి వీటితోనే ఎంతో చేశారు. త‌రువాత త‌రాలు ఇంకెంతో చేయాల‌ని ఆశించారు. నేనూ ఆశిస్తున్నాను…అందుకే…న‌న్ను కాదు…నేను వాడుకున్న ప‌రిక‌రాల‌ను గుర్తుంచుకోమంటున్నాను. మ‌రోసారి చెబుతున్నా….న‌న్ను మీ జ్ఞాప‌కాల్లో కాదు,  జ్ఞానంలో మిగ‌ల‌నివ్వండి.

-వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌