Telugu Global
Family

కాళింది (For Children)

కాళింది మడుగున కాళీయుని పడగన ఆపాల గోపాలుని… ఔను కాళింది ఒక మడుగు! కాని కాళింది అంటే శ్రీకృష్ణుని నాలుగో భార్య! శ్రీకృష్ణునికి అష్టభార్యలు! రుక్మిణీ, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగజిత్తి, భద్ర, లక్ష్మణ వరుసగా ఎనిమిది మందన్నమాట. అయితే భాగవతంలో రుక్మిణీ సత్యభామలకున్నంత కథా ప్రాధాన్యత మిగతా వారికి లేదు! సూర్యుని కూతురు కాళింది. తండ్రి తేజస్సే కూతురిదీనూ. “తండ్రీ సూర్యుడా!… నువ్వు ఉదయిస్తావా? నేను ఉదయించనా?” అన్నంత అందం ఆమెది! నారాయణుని పెండ్లాడాలన్న […]

కాళింది మడుగున కాళీయుని పడగన ఆపాల గోపాలుని… ఔను కాళింది ఒక మడుగు!

కాని కాళింది అంటే శ్రీకృష్ణుని నాలుగో భార్య! శ్రీకృష్ణునికి అష్టభార్యలు! రుక్మిణీ, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగజిత్తి, భద్ర, లక్ష్మణ వరుసగా ఎనిమిది మందన్నమాట. అయితే భాగవతంలో రుక్మిణీ సత్యభామలకున్నంత కథా ప్రాధాన్యత మిగతా వారికి లేదు!

సూర్యుని కూతురు కాళింది. తండ్రి తేజస్సే కూతురిదీనూ. “తండ్రీ సూర్యుడా!… నువ్వు ఉదయిస్తావా? నేను ఉదయించనా?” అన్నంత అందం ఆమెది! నారాయణుని పెండ్లాడాలన్న తలంపు ఆమెది. కాని కోరికది… తీరని నెరవేరని కోరికది తండ్రి దృష్టిలో. అందుకే వేరెవరినైనా వరించమని నచ్చజెప్పాడు. కాళింది కాదంది. ఆ హరితో తప్ప జీవితం లేదంది. పెళ్ళంటూ జరిగితే అతడితోనేనంది. తండ్రినే తోవ చూపమంది. తండ్రి సూచన మేరకు తపస్సు చేయడానికి అడవికి చేరింది. పర్ణశాలను కట్టుకుంది. భక్తే తోడుగా శ్రద్దగా తపస్సుకు పూనుకుంది. శ్రీహరి శ్రీకృష్ణునిగా పుట్టాడని, ద్వారకలో ఉన్నాడని చెప్పిన తండ్రి మాటల మీద నమ్మకముంచింది. కాలం గడిచింది.

ఒకరోజు ఇంద్ర ప్రస్తం నుండి వనవిహారానికి వచ్చారు కృష్ణార్జునులు. అడవంతా తిరిగి అలసిపోయారు. నదిలోకి దిగి స్నానంచేసి ఒడ్డుకు వచ్చి సేదతీరారు. అదే సమయంలో కాళింది నదికి నీటికోసం వచ్చింది. చూసిన కృష్ణుని చూపులు నిలబడిపోయాయి. అర్జునునికి అర్ధమైంది. కృష్ణణ్ణి అర్థం చేసుకొని ఆ అతివ వెంట వెళ్ళాడు అర్జునుడు. కాళింది అక్కడ ఉంటున్న కారణం తెలుసుకున్నాడు! చెట్టుకింద కూర్చున్నది కృష్ణుడేనని చెప్పాడు! కృష్ణుడు చెపితేనే వచ్చానన్నాడు! కాళిందికి కన్నుల పండుగయింది!

అర్జునుడు ఆగలేదు, కృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు. కాళింది గురించి కబురు చెప్పాడు.

కృష్ణుడు కాళింది యెదుట నిలబడ్డాడు. కాళింది నమ్మలేకపోయింది. ఆనందంతో ఆమెను అక్కున చేర్చుకున్నాడు కృష్ణుడు. రథం మీద తీసుకువెళ్ళి కుంతి దగ్గర ఉంచాడు. తర్వాత ద్వారకకు వెళ్ళినపుడు కాళిందిని తనతో తీసుకు వెళ్ళి పెద్దల అనుమతిని, ఆశీర్వాదాన్ని అందుకొని మరీ పెళ్ళి చేసుకున్నాడు.

కాళింది కల అలా నెరవేరింది. కోరుకున్న కృష్ణుడు కొంగు పట్టుకున్నాడు! అదీ కాళింది కథ!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  29 July 2015 1:02 PM GMT
Next Story