Telugu Global
Others

యాకుబ్‌ మెమన్‌కు ఉరి శిక్ష అమలు

1993 బొంబాయి పేలుళ్ళ నిందితుడు యాకుబ్‌ మెమన్‌కు ఉరి శిక్ష అమలు చేశారు. ఉదయం ఆరున్నర గంటలకు నాగపూర్‌ సెంట్రల్‌ జైలోలో ఆయనకు ఉరి శిక్ష అమలు చేశారు. శిక్ష అమలు సమయంలో ఆయన వద్ద ఐదుగురు ఉన్నారు. తలారి కాకుండా మహారాష్ట్ర డిఐజి,  జైలు సూపరింటెండెంట్‌, న్యాయమూర్తి, ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆయనకు శిక్ష అమలు చేసే సమయంలో అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున ఆయనను నిద్ర లేపిన జైలు అధికారులు ఆయనకు తల స్నానం చేయించారు. చివరి […]

యాకుబ్‌ మెమన్‌కు ఉరి శిక్ష అమలు
X

1993 బొంబాయి పేలుళ్ళ నిందితుడు యాకుబ్‌ మెమన్‌కు ఉరి శిక్ష అమలు చేశారు. ఉదయం ఆరున్నర గంటలకు నాగపూర్‌ సెంట్రల్‌ జైలోలో ఆయనకు ఉరి శిక్ష అమలు చేశారు. శిక్ష అమలు సమయంలో ఆయన వద్ద ఐదుగురు ఉన్నారు. తలారి కాకుండా మహారాష్ట్ర డిఐజి, జైలు సూపరింటెండెంట్‌, న్యాయమూర్తి, ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆయనకు శిక్ష అమలు చేసే సమయంలో అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున ఆయనను నిద్ర లేపిన జైలు అధికారులు ఆయనకు తల స్నానం చేయించారు. చివరి కోరిక అడిగారు. ఆయన తుది కోరిక మేరకు కుటుంబ సభ్యులను కలిసే ఏర్పాటు చేశారు. సరిగ్గా గురువారం ఉదయం 6.35 నిమషాలకు ఉరి శిక్ష అమలు చేశారు. నిబంధనల ప్రకారం ఈ తెల్లవారుజామున ఒంటిగంటకు యాకుబ్‌ను నిద్రలేపిన అధికారులు ఫార్మాలటీస్‌ను పూర్తి చేశారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు విచారించిన సుప్రీంకోర్టు చివరి పిటీషన్‌ను కూడా కొట్టివేయడంతో ఇక యాకుబ్ ఉరి ఖరారైపోయింది. కాగా ముందు నుంచీ సిద్ధంగా ఉన్న నాగపూర్ కేంద్ర కారగారం అధికారులు సుప్రీంకోర్టు తీర్పును సజావుగా అమలు చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తన అన్న, భార్య, కుమార్తె తదితరులను యాకుబ్ కలుసుకున్నారు.

యాకుబ్‌ మెమన్‌ తనకు క్షమాబిక్ష పెట్టమని ఆఖరిసారిగా చేసిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించడంతో అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో ముంబై పేలుళ్ళ నిందితుడు యాకుబ్‌ మెమన్‌కు ఉరి శిక్షను అమలుకు మార్గం సుగమమైంది. రాష్ట్రపతి తనకు వచ్చిన అభ్యర్థనను హోంశాఖ అభిప్రాయం కోసం పంపించడంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాత్రి బాగా పొద్దుపోయాక పది గంటల సమయంలో ప్రణబ్‌ముఖర్జీని కలిసి మెమన్‌ ఉరిపై దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఈలోగా రాష్ట్రపతి ప్రణబ్‌ సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కూడా కోరారు. ఈ ఇద్దరి నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మెమన్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు. దాంతో ఉరి శిక్ష అమలు ఖరారైంది. దీంతో నాగపూర్‌ సెంట్రల్‌ జైలు చుట్టూ కిలోమీటర్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

యాకూబ్ మెమన్‌కు ఉరి శిక్షను ఆపాలని ఆయన తరఫు న్యాయవాదులు చివరి నిమిషం దాకా చేసిన పోరాటం ఫలించలేదు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ ఒక్కరోజులో తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవంటూ మెమన్‌ తరఫు న్యాయవాదులు ఉరి అమలును మరో 14 రోజులు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద పిటిషన్‌ వేశారు. దీంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా అత్యున్నత న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు స్పందించారు. అప్పటికప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ప్రఫుల్‌ చంద్రపంత్‌, అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం అసాధారణ రీతిలో… గురువారం తెల్లవారుజామున విచారణ చేపట్టింది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన విచారణ తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు జరిగింది. అంతకుముందు ఇదే బెంచ్‌… యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్షను సమర్థించింది. అయితే, జైలు మాన్యువల్‌ ప్రకారం క్షమాభిక్ష తిరస్కరణకు, ఉరిశిక్ష అమలుకు మధ్య 7 రోజుల అంతరం ఉండాలంటూ ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. యాకూబ్‌ తరఫు న్యాయవాదులూ ఇదే వాదనలు వినిపించారు. ఇలా వాదోపవాదనలతో తెల్లవారుజామున నాలుగున్నర దాకా వాదోపవాదాలు కొనసాగాయి. డిఫెన్స్ వాదనలను ఏజీ ముకుల్ రోహత్గీ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. పదేపదే పిటిషన్లు వేస్తూ డిఫెన్స్‌ ఆట ఆడుతోందని అభివర్ణించారు. ఈ కేసులో న్యాయ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని గుర్తు చేశారు. తాజా పిటిషన్ యాకూబ్ మెమన్‌ను కాపాడేందుకు రచించిన గేమ్ ప్లాన్ అని వాదించారు. ఈ తీరు న్యాయ ప్రక్రియకు అవరోధం కలిగించడమేనని పేర్కొన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. యాకూబ్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. దీంతో మెమన్‌కు ఉరి ఖాయమైంది.

గత పదేళ్ళలో వివిధ కేసుల్లో 1303 ఉరిశిక్షలు పడితే అమలయినవి మూడు మాత్రమే. ఇప్పుడు జరిగిన దానితో కలిపితే నాలుగు మాత్రమే. భారత దేశంలో ఇప్పటివరకు మొత్తం అమలు చేసిన ఉరి శిక్షలు 58 అని అధికారులు తెలిపారు. ఈరోజు మెమన్‌ బర్త్‌ డే… ఈ రోజే ఆయన డెత్‌ డే… కావడం యాదృచ్ఛికమేనా!

First Published:  30 July 2015 12:53 AM GMT
Next Story