ప్రత్యేక హోదా కోసం 10న ఢిల్లీలో జ‌గ‌న్‌ ధ‌ర్నా 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాల‌ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  నిర్ణ‌యించింది.  10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జ‌రిగే ఈ ధర్నాలో పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఆ తర్వాత ‘మార్చ్ టు పార్లమెంట్’ కార్యక్రమం నిర్వహిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోవైఎస్ జగన్ సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా వారితో చర్చించారు.  అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరువు, రైతుల ఆత్మహత్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఇబ్బందులపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ స‌మావేశంలోనే జ‌గ‌న్ ఢిల్లీ ధ‌ర్నా గురించి నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది. అయితే జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీలు ప్ర‌త్యేక హోదాపై వైఎస్ఆర్‌కాంగ్రెస్ ఎలాంటి ప్ర‌య‌త్నాలూ చేయ‌డం లేద‌ని విమ‌ర్శించిన త‌ర్వాత జ‌గ‌న్ ఇలా ధ‌ర్నా కార్య‌క్ర‌మం నిర్ణ‌యించ‌డం విశేషం. అయితే ప్ర‌త్యేక హోదాపై త‌మ పార్టీ పోరాడ‌డం ఇదేమీ మొద‌టి సారి కాద‌ని, పార్ల‌మెంటులోనూ, వెలుప‌లా అనేక సార్లు తాము ఆందోళ‌న చేశామ‌ని, జ‌గ‌న్ స్వ‌యంగా అనేక ప‌ర్యాయాలు ప్ర‌ధాన‌మంత్రికి, రాష్ట్ర ప‌తికి మెమెరాండాలు స‌మ‌ర్పించి వ‌చ్చార‌ని పార్టీలో సీనియ‌ర్ నాయకుడొక‌రు చెప్పారు. ప్ర‌త్యేక హోదా కోసం తాము గ‌తంలోనూ పోరాడామ‌ని, ఇక ముందు కూడా ఆ పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని ఆ నాయ‌కుడు వెల్ల‌డించారు.