పేద‌ల పొట్ట‌గొడితే చూస్తూ ఊరుకోం

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధు హెచ్చ‌రిక‌
సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి.మ‌ధు మ‌రోమారు రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు సంధించారు. పేదల పొట్టగొట్టే విధంగా చంద్ర‌బాబు  ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో జరిగిన కోడూరు, నాగాయలంక మండలాల మత్స్యకారుల సదస్సులో మ‌ధు మాట్లాడారు. దశాబ్దాల తరబడి పేదలు సాగుచేసుకుంటున్న భూములను విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు నిమగ్న‌మయ్యారని విమర్శించారు. లక్షలాది ఎకరాల భూమిని పేదల నుండి బలవంతంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని మ‌ధు హెచ్చరించారు. దివిసీమలోని 15 వేల మత్స్యకార కుటుంబాలకు చెందిన దాదాపు 20 వేల ఎకరాల భూమిని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీచేయడం ఎంతవరకు సమంజసమని ఆయ‌న‌ ప్రశ్నించారు. ఓవైపు పేదల భూములను లాక్కుంటూ మరోవైపు విదేశీ సంస్థలతో ఫ్యాక్టరీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తూ జల కాలుష్యానికి ప్రభుత్వం కారణమవుతోందన్నారు. దీనివల్ల మత్స్య సంపద నాశ‌న‌మై మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందన్నారు. అభివృద్ధి పేరిట వ్యాపారం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తొత్తులాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.