ఇక విజ‌య‌వాడ నుంచే పాల‌న‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ నుంచి ప‌రిపాల‌న సాగించాల‌ని త‌ల‌పోస్తున్నారు. రాజ‌ధాని నిర్మాణం పూర్త‌య్యే వ‌ర‌కు విజ‌య‌వాడే పాల‌నా కేంద్రంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రెండు నెల‌ల్లోగా ముఖ్య‌మైన శాఖ‌ల‌న్నీ విజ‌య‌వాడ‌కు త‌ర‌లి వెళ్లాల్సిందేన‌ని చంద్ర‌బాబు తాజాగా ఆదేశించ‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా భావించ‌వ‌చ్చు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య‌, విద్య‌, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్‌, హోం, వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌ల‌న్నీ త‌క్ష‌ణం విజ‌య‌వాడ‌కు త‌ర‌లించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌న్నీ చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలోనే చంద్ర‌బాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ శాఖ‌లే కాకుండా అన్ని శాఖ‌ల‌లోని ముఖ్య‌మైన అధికారులు వారంలో మూడు రోజుల‌పాటు విజ‌య‌వాడ‌లోనే ఉండాల్సిందిగా కూడా ముఖ్య‌మంత్రి కోరుతున్నారు. ఇక నుంచి మంత్రివ‌ర్గ స‌మావేశాలు విజ‌య‌వాడ‌లోనే నిర్వ‌హించాల‌ని కూడా చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు. రెండు నెల‌ల‌కోసారి మాత్ర‌మే కేబినెట్ స‌మావేశాలు హైద‌రాబాద్‌లో జ‌రుగుతాయ‌ట‌. మంత్రులు, ఉన్న‌తాధికారులంతా విజ‌య‌వాడ‌, గుంటూరుల‌లో అద్దె ఇళ్ల‌ను తీసుకోవాల‌ని, మంత్రుల ఇళ్ల అద్దె ప‌రిమితుల‌కు మిన‌హాయింపు నిస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు. ప‌రిపాల‌న విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తే స‌రిపోద‌ని… త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి అధికారులు అందుబాటులోకి వ‌స్తే అదే ప‌దివేల‌ని సామాన్య ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.