స‌మానాభివృద్ధిపై సీపీఎం ప్ర‌చారోద్య‌మం

ప్ర‌జాస‌మ‌స్య‌లపై వివిధ ర‌కాల ఆందోళ‌న‌లు చేయ‌డంలో వామ‌ప‌క్ష పార్టీలు ముఖ్యంగా సీపీఎం ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ప్రాంతాల స‌మానాభివృద్ధి డిమాండ్‌తో అది ఓ ప్ర‌చారోద్య‌మాన్ని ప్రారంభించింది. స్థానికంగా ఉన్న స‌మస్య‌లేమిట‌నేదానిపై ఆ పార్టీ నాయ‌కులు, శ్రేణులు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి చ‌ర్చిస్తున్నారు. వివిద ప్రాంతాల‌లో ప్ర‌జాచైత‌న్య స‌ద‌స్సులు, ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిపై ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గాంధీనగర్‌ సెంటర్‌లో ప్రచార కార్యక్రమాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అద్దంకిలో సిపిఎం చేపట్టిన ప్రచారోద్యమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో సిపిఎం ఆధ్వర్యాన ప్రచార భేరి ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి గంట్యాడ మండలం డికె పర్తి, అడ్డతీగల గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఆయన వద్ద ఏకరువు పెట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ గజపతినగరంలో పర్యటించారు. సిపిఎం ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా విశాఖ నగరంలో ర్యాలీలు, కరపత్రాల పంపిణీ నిర్వహించారు. మూడోవార్డు పరిధి ఇందిరానగర్‌లో సిపిఎం ఆరిలోవ జోన్‌ ఆధ్వర్యాన నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని, ప్రయివేటు రంగంలో దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు అమలుచేయాలని నినాదాలు చేశారు. పలువార్డుల్లో పాదయాత్ర చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు. విశాఖ గ్రామీణ ప్రాంతంలోని హుకుంపేట మండలంలో ర్యాలీ, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, నర్సీపట్నం మండలాల్లో సదస్సులు, అరకువేలీ, చోడవరం, అచ్యుతాపురం మండలాల్లో కరపత్ర ప్రచారం తదితర కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరు జిల్లా కోవూరులో షుగర్‌ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కొడవలూరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం, విడవలూరులో జీపుయాత్ర నిర్వహించారు. ఈ ప్ర‌చారోద్య‌మం ఒక్క‌రోజులో పూర్తయ్యేది కాద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి గాను త‌మ పార్టీ నిరంత‌రం ప్ర‌జాందోళ‌న‌ల‌ను కొన‌సాగిస్తుంద‌ని సీపీఎం నాయ‌కులు చెబుతున్నారు.