కార్పొరేట్ శ‌క్తుల గుప్పిట్లో మీడియా

కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లో చిక్కుకున్న మీడియా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను విస్మ‌రిస్తోందంద‌ని  పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు ప్రకాశ్‌కరత్‌ అన్నారు. ఇప్పటికే కార్పొరేట్ సిండికేట్‌, రాజకీయనేతలకు మధ్య అపవిత్ర పొత్తు నెల కొందని, అదే పరిస్థితి మీడియా రంగానికి వ్యాపించిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ప్రజాశక్తి 35వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ‘వర్తమాన పరిస్థితులు-మీడిearsయా’ అనే అంశంపై  ప్రజాశక్తి సంపాదకుడు పాటూరు రామయ్య అధ్యక్షతన శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన సెమినార్‌లో క‌ర‌త్ ప్ర‌సంగించారు.  మంత్రులుగా మారిన వ్యాపారులు సొంత‌ మీడియా సంస్థలనూ ఏర్పాటు చేసుకుని స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం దేశ ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు క‌ర‌త్‌. దేశంలో మోడి భావజాలంతో నడిచే పత్రికలే ఎక్కువగా ఉన్నాయని సాక్షి ఎడిటోరియల్‌ డైరక్టర్‌ కె. రామచంద్రమూర్తి అన్నారు. ఉరితీసిన మెమన్‌ మృతదేహం వద్ద 8 వేలమంది ముస్లింలు నమాజు చేస్తే ఆ ఫొటోను ఏ పత్రిక కూడా ప్రచురించే సాహసం చేయలేకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. శేషాచలం అడవుల్లో 22 మంది కూలీలు చనిపోతే, దానికి సంబంధించిన వార్త చాలా మందికి కనిపించలేదన్నారు. ప్రభుత్వ విధానాలు పరిశీలించి, లోపాలు ఎత్తిచూపే పనిని మీడియా సంస్థలు చేపట్టాలన్నారు. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సింగపూర్‌తో కలుపుకున్న ఎంఒయు కేవలం ఇద్దరి ముగ్గురి మంత్రులకే తెలుసునని అవన్నీ రహస్య ఒప్పందాలన్నారు. దేశంలో పెరిగిపోతున్న మ‌త‌త‌త్వాన్ని సమర్ద వంతంగా ఎదుర్కొనేందుకు వామపక్ష పత్రికలు బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ముద్దాయిలకు అనుకూలమైన కధనాలు ఇవ్వగలిగామని, నేడు  మెమ‌న్‌ విషయంలో వార్తలు ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వామ పక్ష జర్నలిజానికి ప్రతీకగా ప్రజాశక్తి నిలిచిందని విశాలాంధ్ర సంపాదక వర్గ చైర్మన్‌ ఈడ్పుగంటి నాగేశ్వరరావు పేర్కొన్నారు.  భావ ప్రకటనా స్వేచ్చను హరించడం ఎవరి వల్లా కాదని చరిత్ర చెబుతోందని నవ తెలంగాణ ఎడిటర్‌ వీరయ్య పేర్కొన్నారు.  
 కార్పోరేట్‌ల ఆదీనంలో ఉన్న మీడియాలు రహస్య అజెండాలతో ముందుకు కదులుతున్నాయని, నిస్పక్షపాతంగా వార్తలు రాసే పరిస్ధితులు లేవని విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవాచారి అన్నారు. కార్పోరేట్‌ బాహుబలుల చేతిలో మీడియా చిక్కిశల్యమౌతోందని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి అభిప్రాయ‌ప‌డ్డారు. అడుగంటుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనిప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌ వి. కృష్ణయ్య అన్నారు.