పుష్కర తొక్కిసలాట దృశ్యాలు మాయం?

రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట దృశ్యాలు మాయమైపోయాయి. ఘాట్‌ వద్ద ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరిగినా పసిగట్టేందుకు రూ. 2 కోట్లు ఖర్చుచేసి ఆర్భాటంగా సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. దీనిపై రెండు రోజుల ముందే ట్రయిల్‌ కూడా వేశారు. అన్నీ సజావుగా పని చేస్తున్నాయని నిర్ధారించారు. ఇంత పక్కా ఏర్పాట్లు చేసినా జరిగిన ఘోరాన్ని చిత్రీకరించిన దృశ్యాలు మాయమై పోయాయంటున్నారు. తొక్కిసలాట దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని… దీనిపై న్యాయ విచారణకు ఆదేశించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా పోలీసులు చేపట్టిన రహస్య విచారణ తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. పుష్కర ప్రారంభం రోజున జరిగిన ఈ దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని డిమాండు చేస్తున్న నేపథ్యంలో ఈ దృశ్యాలు మాయమవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ సంఘటనపై ప్రభుత్వమే ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం రహస్య విచారణ జరిపిస్తోంది. సంఘటన సమయంలో సిసి కెమెరాలు పనిచేయలేదని… పోలీసులు కొత్త పల్లవి అందుకుంటున్నారు. పోలీసుల మాటలు వింటుంటే పుటేజ్‌లను పథకం ప్రకారమే మాయం చేశారన్న అనుమానాలు కలుగు తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగానే కెమెరాలు పని చేయలేదా? లేకుంటే సిసి కెమెరాల పుటేజ్‌ను కావాలనే ప్రభుత్వం గోప్యంగా దాచిపెట్టిందా? అనే ప్రశ్నలు ఉత్పన్న మవు తున్నాయి.
తొలి రోజున ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు ఘాట్‌లో స్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు. ఆ సమయంలో సుమారు రెండు గంటల పాటు యాత్రికులను ఘాట్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో బయట యాత్రికుల రద్దీ పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్నాన సన్నివేశాలను చిత్రీకరించడానికి నేషనల్‌ జియోగ్రఫీ చానల్‌కు ప్రభుత్వం అనుమతించింది. రూ.60 లక్షల ఒప్పందంతో ఓ లఘు చిత్రం షూటింగ్‌కు ఒప్పందం కుదిరిందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేశారు కూడా. చంద్రబాబు సీఎంగా పుణ్య స్నానం చేసే సన్నివేశాలను చిత్రీకరించడం… ఆసమయంలో దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన లేదా నిలిపేసిన జనాన్ని చిత్రీకరించేందుకు ఉపయోగపడిన దృశ్యాలు విచారణకు మాత్రం ఉపయోగపడడం లేదు. నిజానికి ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో లేకపోయినా నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌ దగ్గర ఉంటాయి. కాని ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనమీద ఏమీ లోపం లేకుండా చేసుకునేందుకు… దీన్ని ఎవరో ఒకరిపై నెట్టి వారిని బాధ్యుల్ని చేసే ప్రక్రియలో భాగంగానే దృశ్యాలు మాయమయినట్టు ప్రచారం జరుగుతుందన్న ఆరోపణలున్నాయి.