నిధులు స్వాహా జరుగుతోంది: రంగంలో స్వర్ణలత

తెలంగాణ రాష్ట్రంలో ఎవరికివారే దోచుకుంటున్నారని, ఆలయానికి కేటాయించిన నిధులు కూడా మింగేస్తున్నారని రంగం కార్యక్రమంలో స్వర్ణలత పలికారు. సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా ఈరోజు రంగం కార్యక్రమం జరిగింది. దుష్టులు తమ ప్రవర్తనను మార్చుకోవాలని స్వర్ణలత చెప్పారు. బోణాల వేడుకలో అమ్మవారు వినిపించే భవిష్యవాణిగా చెప్పుకునే రంగం కార్యక్రమంలో స్వర్ణలత మాట్లాడుతూ నాయకులు స్వార్థపరులుగా మారితే మంచి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పాపాలు పెరుగుతుంటే వర్షాలు ఎలా కురుస్తాయి? అని ఆమె పలికారు. నాయకుల్లో సేవాభావం పెరగాలని ఆమె సూచించారు. మోసాలు చేస్తున్నా, అవినీతికి పాల్పడుతున్నా తాను కాపాడుతున్నానని, కాని ఇవన్నీ మానుకుని మంచిగా మసలు కోవాలని ఆమె హితవు చెప్పారు. తనను నమ్మిన భక్తులకు అండగా ఉంటానని ఆమె తెలిపారు. నా భక్తులంతా సుఖసంతోషాలతో ఉంటారని స్వర్ణలత చెప్పారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.