మరో అరుదైన రికార్డు సాధించిన బాహుబలి

రాజమౌళి సృష్టించిన బాహుబలి సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు చెరిపేసింది. మరెన్నో రికార్డులు సృష్టించింది. సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పుడు తాజాగా మరో తిరుగులేని రికార్డును తన సొంతం చేసుకుంది బాహుబలి సినిమా. టోటల్ సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే నంబర్ వన్ మూవీగా నిలిచింది. మొన్నటికి మొన్న తెలుగులో వందకోట్ల సినిమా సాధించిన మొట్టమొదటి మూవీగా అవతరించిన బాహుబలి, ఇప్పుడు టోటల్ కలెక్షన్లలో సౌత్ లోనే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. తాజాగా ఈ మూవీ ఓవరాల్ వసూళ్లు 5వందల కోట్ల రూపాయలకు చేరాయి. ఓ దక్షిణాది సినిమా ఇన్ని వసూళ్లు సాధించడం చరిత్రలో ఇదే ప్రథమం. బాలీవుడ్ సినిమాలు ఇప్పటికే ఈ మార్కు దాటేసినప్పటికీ, దక్షిణాది సినిమాకు మాత్రం ఇది కొత్త. ఇలాంటి అరుదైన రికార్డును బాహుబలి సొంతం చేసుకుంది. మొన్నటివరకు దక్షిణాది మార్కెట్ కు సంబంధించి ఈ జాబితాలో రోబో సినిమా నంబర్ వన్ గా కొనసాగింది. రజనీకాంత్ నటించిన రోబో ఓవరాల్ వసూళ్లు దాదాపు 283 కోట్ల రూపాయలు. ఆ మార్కును దాటేయడమే కాకుండా.. ఏకంగా 5వందల కోట్ల మార్క్ ను అందుకుంది మన బాహుబలి.