Telugu Global
Family

విక్రమార్కుడు (For Children)

పట్టువదలని విక్రమార్కుడు యెప్పటిలాగే శ్మశానంలోని చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకు నడవసాగాడు! అప్పుడు శవంలోని బేతాళుడు “రాజా…” అంటూ కథ చెపుతాడు. చెప్పి ప్రశ్న వేస్తాడు. సరైన సమాధానం తెలిసి చెప్పకపోతే తల వేయి వక్కలవుతుంది అంటాడు. చెప్తే మాయమైన బేతాళుడు తిరిగి చెట్టెక్కేస్తాడు. పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే. రోజుకో కథ విన్నాం కదా, మరి విక్రమార్కుడి కథ తెలుసుకుందాం! విక్రమార్కుడు ఉజ్జయినీ దేశానికి రాజు. సోదరుడు భర్తృహరి. ఇతడు […]

పట్టువదలని విక్రమార్కుడు యెప్పటిలాగే శ్మశానంలోని చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకు నడవసాగాడు! అప్పుడు శవంలోని బేతాళుడు “రాజా…” అంటూ కథ చెపుతాడు. చెప్పి ప్రశ్న వేస్తాడు. సరైన సమాధానం తెలిసి చెప్పకపోతే తల వేయి వక్కలవుతుంది అంటాడు. చెప్తే మాయమైన బేతాళుడు తిరిగి చెట్టెక్కేస్తాడు. పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే.

రోజుకో కథ విన్నాం కదా, మరి విక్రమార్కుడి కథ తెలుసుకుందాం! విక్రమార్కుడు ఉజ్జయినీ దేశానికి రాజు. సోదరుడు భర్తృహరి. ఇతడు రాజ్యాన్ని పాలించి విరక్తి చెంది తపోవనాలకు వెళ్తూ విక్రమార్కునికి రాజ్యం అప్పగించాడు. జరా మరణాలు అంటే ముసలితనమూ మృత్యువూ భర్తృహరి విరక్తికి కారణం కాగా – అవి లేకుండా వుండే ఫలాన్ని సయితం భర్తృహరి విక్రమార్కునికిచ్చాడు!

ఆఫలం వెనుక ఓ కథ ఉంది. బీద బ్రాహ్మణుడు యెప్పుడూ దేవిని నిష్ఠతో కొలిచేవాడట. మెచ్చి దేవి ఆ బ్రాహ్మణుడికి ఓ ఫలము (పండు) ఇచ్చిందట. దీన్ని తింటే ముసలి తనమూ మృత్యువూ రాదని చెప్పిందట. మాయమయిందట. ఆ ఫలము తిన్నా – చిరకాలం బతికి ఉన్నా భిక్షాటనేకదా చేసేది, అదేం గొప్పపని కాదనుకున్నాడట. పరులకు ఉపయోగపడే రాజు చిరకాలంవుంటే ఉపయోగమని అనుకున్నాడట. అందుకే భర్తృహరికి ఆ ఫలాన్ని ఇచ్చాడట. తను ఆ ఫలాన్ని తిని చిరాయువవుతాడు నిజమే కాని తన భార్య మరణిస్తుందే? అందుకని భర్తృహరి ఆ ఫలాన్ని తన భార్యకు చిరకాలం ఉంటుందని ఇచ్చాడట. రాజు ఇచ్చిన ఫలాన్ని అతని భార్య యేం చేసిందీ… తన ప్రియుడైన గుర్రాలు తోలేవాడికిచ్చిందట. వాడేం చేసాడు తనకెంతో ఇష్టమైన దాసీకిచ్చాడట. ఆదాసీ యేం చేసిందీ ఆ ఫలాన్ని తనకిష్టమైన గోవుల కాపరికిచ్చిందట. గోవులకాపరి ఆ ఫలాన్ని తీసుకెళ్ళి పేడలెత్తే ఆమెకి ప్రేమగా ఇచ్చాడట. ఆ పేడలెత్తే ఆమె పేడలో ఫలాన్ని ఉంచి తీసుకెళ్ళడం రాజు భర్తృహరి చూసాడట. అప్పుడు ఈ జరిగిన కథంతా తెలిసిందట. ఆ ఫలాన్ని తీసుకొని విరక్తితో విక్రమార్కునికి ఇచ్చాడట!

అయితే విక్రమార్కుడు పరిపాలిస్తూవుండగా ఒకడొచ్చి నేను యాగం చేయబోతున్నాను, సాయం చేయమన్నాడట. వాడి వెంట శ్మశానంలోకి అడుగుపెట్టిన విక్రమార్కుని ఆ దిగంబరుడే చంపబోయాడట. అది గ్రహించి విక్రమార్కుడే అతన్ని చంపేసాడట. అది చూసిన బేతాళుడు విక్రమార్కునికి మంచి మిత్రుడయ్యాడట!

ఒకసారి రంభ ఊర్వశిల నృత్యనైపుణ్యాల మీద వివాదమొస్తే – దేవతలు కూడా తేల్చలేకపోయారట. ఇంద్రుడు తన రథాన్ని పంపి – విక్రమార్కుని తెచ్చి – తగువు తేల్చమన్నాడట. విక్రమార్కుని ముందు రంభా ఊర్వశిలు నాట్యం చేసారట. చూసాడట. ఊర్వశియే ఉత్తమమైనదని అన్నాడట.అప్పుడు ఇంద్రుడు విక్రమార్కుని మెచ్చుకొని మణిమయ సింహాసనాన్ని ఇచ్చాడట. ఆ సింహాసనాన్ని అధిష్టించి విక్రమార్కుడు చాలాకాలం పరిపాలించాడట!

అలా ఆ సింహాసనానికి అటూఇటూ ముప్పై రెండు సాలభంజికలు వుండేవని – విక్రమార్కుని తదనంతరం భోజరాజు అధిష్టించబోతే – నీకు విక్రమార్కుని అంతటి అర్హత వున్నదా అని ఒక్కో సాలభంజిక విక్రమార్కుని గురించి ఒక్కో కథ చెప్పేదట!

విక్రమార్కుని తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడట. అమరత్వం కంటే వేరే వరాన్ని కోరుకొమ్మన్నాడట. రెండున్నరేళ్ళ బాలిక గర్భవతి అయినపుడు తనకి మరణం వచ్చేలా వరమీయమని కోరుకున్నాడట. కుంభాకారుని ఇంట రెండున్నరేళ్ళ బాలికకు శాలివాహనుడు పుట్టాడట. భూకంపం వచ్చిందట. విక్రమార్కుడు బేతాళుణ్ణి పంపి ఆ పిల్లాణ్ణి చూసి రమ్మని చెప్పి తన ఖడ్గంతో తాను హతుడిగా మిగిలాడట!

విక్రమార్కుని సింహాసనాన్ని అధిష్టించే అర్హత కలిగిన వాళ్ళు లేరని ఆకాశవాణి పలికిందట!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  3 Aug 2015 1:02 PM GMT
Next Story