Telugu Global
Family

నాలుగు దారులు (Devotional)

ఒక జ్ఞానాన్వేషి మోక్షం కోసం బయల్దేరాడు. పెద్దల ద్వారా విని ఎన్నెన్నో ఆటంకాల్ని అధిగమించి అనంత ప్రయాణం చేసి మోక్ష ద్వారాన్ని చేరాడు. అక్కడ నాలుగు రోడ్ల కూడలి ఉంది. ఒక్కొ రోడ్డు ఒకో వైపు వెళుతోంది. అతను ఆశ్చర్యంగా ఆగి నాలుగు వేపులా చూశాడు. ఆయోమయంగా ఎటువైపు వెళ్ళాలో తెలీక తటపటాయించాడు. మొదటిదారి దగ్గర ఒక అపూర్వ సౌందర్యరాశి కూచుని ఉంది. ఆమె ఆకర్షణీయంగా చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా ఉంది. ఆమె అతన్ని చూసి ఎక్కడికి […]

ఒక జ్ఞానాన్వేషి మోక్షం కోసం బయల్దేరాడు. పెద్దల ద్వారా విని ఎన్నెన్నో ఆటంకాల్ని అధిగమించి అనంత ప్రయాణం చేసి మోక్ష ద్వారాన్ని చేరాడు. అక్కడ నాలుగు రోడ్ల కూడలి ఉంది. ఒక్కొ రోడ్డు ఒకో వైపు వెళుతోంది. అతను ఆశ్చర్యంగా ఆగి నాలుగు వేపులా చూశాడు. ఆయోమయంగా ఎటువైపు వెళ్ళాలో తెలీక తటపటాయించాడు.

మొదటిదారి దగ్గర ఒక అపూర్వ సౌందర్యరాశి కూచుని ఉంది. ఆమె ఆకర్షణీయంగా చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా ఉంది. ఆమె అతన్ని చూసి ఎక్కడికి వెళ్ళాలి? అంది. అతను “నేను మోక్షానికి వెళ్ళాలి” అన్నాడు. ఆమె “మంచిది. ఈరోజు నాతో గడుపు. స్వర్గ సుఖాలు అనుభవించు, అప్పుడు నిన్ను ఈ మార్గం నించీ వెళ్ళడానికి అనుమతిస్తాను” అంది.

దానికతను “ఆ పని ధర్మం కాదు, నేను అట్లాంటి పనికి అంగీకరించను, నేను ఇంకో మార్గం గుండా వెళతాను” అని రెండో దారికి వెళ్ళాడు.

ఆ రెండో దారిలో ఒకతను మేకను పట్టుకుని కనిపించాడు. ఇతన్ని చూసి “ఎక్కడికి వెళుతున్నావు?” అన్నాడు. “నేను మోక్షానికి వెళుతున్నాను” అన్నాడు. అతను “మంచిది. అయితే ఈ మేకను చంపి వండుకుని తృప్తిగా తిను. అప్పుడే ఈ మార్గం గుండా వెళ్ళే అవకాశం దొరుకుతుంది” అన్నాడు. ఆ వ్యక్తి “మేకను చంపడమంటే జీవ హింస చెయ్యడం కదా! నేను అటువంటి పని చెయ్యడానికి ఒప్పుకోను” అన్నాడు. అతను “అయితే నువ్వు ఈ దారి గుండా వెళ్ళడానికి వీల్లేదు” అన్నాడు.

ఇతను మూడో మార్గానికి తిరిగాడు. మూడోదారి మొదట్లో ఒక వ్యక్తి పాచికలు పట్టుకుని కూచున్నాడు. ఇతన్ని చూసి “ఎక్కడికి వెళుతున్నావు?” అన్నాడు.

ఇతను “నేను మోక్షానికి వెళుతున్నాను” అన్నాడు. అతను “మంచిది. కాసేపు నాతో జూదమాడు” అన్నాడు. ఇతను “జూదం చెడ్డ వ్యసనం. అందువల్ల నేను జూదమాడడానికి ఒప్పుకోను”అన్నాడు.

అతను “ఆడడం, ఆడకపోవడం నీ ఇష్టం నువ్వు జూదం ఆడని పక్షంలో ఈ దారి వెంట వెళ్ళడానికి లేదు” అన్నాడు.

తను నాలుగో దారి వైపు మళ్ళాడు. మిగిలింది ఒకే దారి. అటు వైపు ఎలాంటి ఉపద్రవం వస్తుందో అనుకుంటూ వెళ్ళాడు.

నాలుగో దారి మొదట్లో ఒక వ్యక్తి కుండలో సారా నింపుకుని కూచుని ఉన్నాడు. “ఎక్కడికి వెళుతున్నావు?” అని అడిగాడు.

“మోక్షం కోసం వెళుతున్నాను” అన్నాడు.

అతను “వెళుదువుగానీ దార్లో అలిసిపోయినట్లున్నావు. కొంత మద్యం సేవించి విశ్రాంతి తీసుకుని వెళ్ళు” అన్నాడు.

ఇతను “మద్య సేవనం మహాపాపం. అటువంటి దుర్మార్గపు పనికి నేను అంగీకరించను” అన్నాడు.

అతను “అట్లాంటి పక్షంలో ఈ మార్గంలో వెళ్ళడం నిషేధం” అన్నాడు.

అట్లా ఇతనికి నాలుగుదారుల్లో అడ్డం ఎదురయింది. ఎటూ వెళ్ళలేని పరిస్థితి దాపురించింది. నాలుగు దార్ల కూడలిలో కూచుని ఎంత ఆలోచించినా మార్గం దొరకలేదు. నాలుగు పాపకార్యాల గురించి ఆలోచించాడు. అన్నిట్లోకి ఇతర్లకు అపకారం కలిగించంది మద్యపానం ఒక్కటే అనిపించింది. మద్యం సేవిస్తే కనీసం ఆ మార్గం గుండా మోక్షానికి వెళ్ళడానికి అనుమతి దొరుకుతుంది కదా అనుకున్నాడు.

వెళ్ళి మద్యం సేవించాడు. మత్తెక్కింది. మనసులో వున్న విచక్షణ, విజ్ఞానం మాయమయి పోయాయి. పక్కనే మేక కనిపించింది. దాన్ని చంపి వండి కడుపు నిండుగా తిన్నాడు. అప్పుడు కన్య కనిపించింది. ఆ అందాల రాశిని అనుభవించాడు. చివరికి ఆమెతో కలిసి జూదమాడాడు. ఆ రకంగా మనిషి ప్రపంచంలోనే ఉండిపోయాడు.

– సౌభాగ్య

First Published:  4 Aug 2015 1:01 PM GMT
Next Story