Telugu Global
Family

ఏడుగురు అన్నలు-ఒక చెల్లెలు (For Children)

ఒక రాజుకు ఏడుగురు భార్యలు. అందరూ అందగత్తెలే. వాళ్లలో చిన్నరాణి మరీ అందగత్తె. అంతేకాదు. ఆమె చాలా మంచిది. దయార్ద్ర హృదయం కలది. ఆమె కలలో కూడా ఎవరికీ అపకారం తలపెట్టనిది. కాబట్టి అందరికీ ఆమె అంటే ఇష్టం. కానీ తక్కిన ఆరుమందిరాణులకు ఆమె అంటే అంతులేని అసూయ. కారణం రాణులందర్లో చిన్నరాణి అంటేనే రాజుగారికి ఎంతో ప్రేమ. ఆమెను రాజుగారు ఇష్టపడే కొద్దీ ఈ ఆరుమందికీ ఆమెమీద ద్వేషమూ పెరుగుతూ వచ్చింది. కానీ చిన్నరాణి తన […]

ఒక రాజుకు ఏడుగురు భార్యలు. అందరూ అందగత్తెలే. వాళ్లలో చిన్నరాణి మరీ అందగత్తె. అంతేకాదు. ఆమె చాలా మంచిది. దయార్ద్ర హృదయం కలది. ఆమె కలలో కూడా ఎవరికీ అపకారం తలపెట్టనిది. కాబట్టి అందరికీ ఆమె అంటే ఇష్టం. కానీ తక్కిన ఆరుమందిరాణులకు ఆమె అంటే అంతులేని అసూయ.

కారణం రాణులందర్లో చిన్నరాణి అంటేనే రాజుగారికి ఎంతో ప్రేమ. ఆమెను రాజుగారు ఇష్టపడే కొద్దీ ఈ ఆరుమందికీ ఆమెమీద ద్వేషమూ పెరుగుతూ వచ్చింది. కానీ చిన్నరాణి తన సవతుల సూటిపోటీ మాటల్ని ఎప్పుడూ పట్టించుకునేది కాదు. వాళ్ళతో స్నేహంగానేమెలిగేది.

రాజుగారికి సంతానం కలగలేదు. ఈ విషయం గురించి రాణులందరికీ దిగులుగానే ఉండేది. సంతానం కోసం వాళ్ళు చేయని వ్రతాలు లేవు. నోచని నోములు లేవు.

చిన్నరాణి పేరు సులత. దేవుడు కరుణించి ఆమె గర్భవతి అయింది. ఆ వార్తతో రాజు ఆనందానికి అంతులేదు. సులత మీద ఆయన అనురాగం పదింతలు పెరిగింది. ఆయన తన సమయాన్ని ఆమె కోసమే ఎక్కువగా కేటాయించేవారు.

ఆరుమంది సవతుల పరిస్థితి మనం ఊహించవచ్చు. వాళ్ళు ఆమె గర్భవతి కావడంతో కుళ్ళిపోయారు. వాళ్ళ ద్వేషం పదింతలయింది. ఆమె తల్లి అయి బిడ్డను కంటే ఆమెను రాజు నెత్తికెక్కించుకుంటే తమ పరిస్థితి ఎంత హీనంగా దిగజారుతుందో ఊహించుంటూ వాళ్ళు తట్టుకోలేకపోయారు.

ఈ విషయంలో చిన్నరాణి మీద ఎట్లాగయినా ప్రతీకారం తీర్చుకోవాలని కంకణం కట్టుకున్నారు. సమయం కోసం వాళ్ళు కలిసి ఉన్నారు.

ప్రసవ సమయం సమీపించింది. రాజు మంచి మంత్రసానుల్ని నియమించాడు. ఆ సంగతి తెలిసి రాణుల్లో పెద్దదయిన ప్రేమలత రాజు దగ్గరికి వెళ్ళి ‘రాజా! మేము ఆరుమంది వున్నాం. ఆమె మా సోదరి. మేము కంటికి రెప్పలా కాచుకుని అన్నీ చూసుకుంటాం. ప్రత్యేకించి మంత్రసానుల్ని పెట్టాల్సిన అవసరం లేదు’అని వారించారు. రాజుగారు సరేనన్నారు. రాణులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు.

రాజుగారు పెద్దరాణి మాటలు విశ్వసించి, సంతోషించి ‘మంచిది చిన్నరాణి ప్రసవించిన వెంటనే నాకు సమాచారాన్ని అందించండి’ అన్నాడు. పెద్దరాణి సరేనంది. సులత కూడా తన అక్కల ఔదార్యానికి ఎంతో ఆనందించింది.

సమయం వచ్చింది. సులత పండంటి ఎనిమిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. మొదట ఏడుగురు అబ్బాయిలు. ఎనిమిదవ బిడ్డ అమ్మాయి. ఆ పిల్లల్ని చూసి తక్కిన ఆరుగురు రాణులు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు.

పెద్దరాణి పిల్లలు పుట్టగానే ఆ ఎనిమిది మందిని ఒక గోనెసంచిలో వేసి ఇంటి వెనక పెరడులోకి తీసుకెళ్లి పెద్ద గొయ్యి తవ్వి పిల్లల్ని సజీవంగా పాతిపెట్టింది. అక్కడి నించీ కొన్ని ఎలుక పిల్లల్ని , ఒక పిల్లి పిల్లను, ఒక కుక్క పిల్లను తీసుకుని పురుటిగదిలోకి వచ్చింది.

వాటిని సులత పక్కన పెట్టి రాజుగారికి కబురు పంపింది.

రాజుగారు తన చిన్న భార్య పండంటి కొడుక్కి జన్మనిచ్చి ఉంటుందని, లేదా ముచ్చటయిన కూతుర్ని కని వుంటుందని ఆనందంతో పురుటి గదికి వచ్చాడు.

ప్రేమలత పురుటి గది తలుపు దగ్గరే విషాదం నటిస్తూ నిల్చుంది. ఒక బుట్టలో ఎలుక పిల్లల్ని, పిల్లి పిల్లను, కుక్కపిల్లను పెట్టి రాజుగారికి చూపింది. ఊహించని ఆ పరిణామానికి రాజు హతాశుడయ్యాడు. ‘ఏమిటిదంతా?’అన్నాడు. ప్రేమలత వీటన్నిటినీ సులత కన్నది అంది. ‘ఇంకా వీటిని ఏం చెయ్యమంటారు’ అని అమాయకత్వం నటిస్తూ అడిగింది. రాజు ఆగ్రహంతో ‘వీటన్నిటినీ తీసుకెళ్ళి పాతిపెట్టండి’ అని కనీసం సులత ముఖం కూడా చూడడానికి ఇష్టపడకుండా అక్కణ్ణించీ వెళ్లిపోయారు.

ప్రేమలత మనసులో చెప్పలేనంత ఆనందం కలిగింది. సులత కళ్లు తెరిచి ‘అక్కా! నా పిల్లలేరీ!’ అంది. ప్రేమలత జాలి నటిస్తూ నువ్వు కన్నది మనుషుల్ని కాదు, జంతువుల్ని. రాజుగారు ఆగ్రహంతో వాటిని తీసుకెళ్ళి పాతిపెట్టమన్నారు’ అంది.

సులత ఆ మాటల్తో స్పృహ తప్పి పడిపోయింది. ప్రేమలత, తక్కిన ఐదుమంది రాణులు విజయం సాధించినందుకు ఆనందంతో పొంగిపోయారు.

రాజుగారి ఆగ్రహం చల్లారలేదు. ఆయన బహిరంగంగా సభలో ‘అట్లా జంతువుల్ని కన్న స్త్రీ అంతఃపురంలో ఉండడానికి అర్హత కోల్పోయింది. కనక ఆమెను వెంటనే అక్కడి నించీ పంపెయ్యాలని, సాధారణ జనం లాగా ఆమె జీవించాలని శాసనం చేశాడు.

పెద్దరాణి ప్రేమలత ఆ వార్తతో పొంగిపోయింది. పరుగు పరుగున వెళ్ళి ఆ విషయం సులతతో చెప్పింది. అప్పుడు సులత అనారోగ్యంతో బలహీనంగా ఉంది. ఆ వార్తను నమ్మలేక పోయింది. ”తన పట్ల రాజు హఠాత్తుగా ఎందుకంత నిర్దయగా మారిపోయాడో ఆమెకు అంతుపట్టలేదు. తన దురదృష్టానికి కుంగి పోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది.

ప్రేమలత ఆ అవకాశాన్ని వినియోగించుకుంది. సులతను ”చివరిసారిగా కూడా రాజుగార్ని కలుసుకునే వీలు కల్పించలేదు. సులతను చూస్తే రాజు మనసు మార్చుకుంటాడేమోనని సందేహించింది.

సులత పాతబట్టలతో, చెదిరిపోయిన జుట్టుతో పుట్టెడు దుఃఖంతో రాజగృహం నించీ ఒంటరిగా బయల్దేరింది.

ఏం జరిగినా దేనికోసమూ రోజులు ఆగవు కదా! అంతఃపురంలో ఆనందం అదృశ్యమయింది. రాజు నిశ్శబ్దంగా, మౌనంగా ఉండిపోయాడు. రాజు తక్కిన రాణుల్ని కలవడం మానేశాడు. నగరమంతా కళా విహీనమయిపోయింది. చెట్లు కూడా పూలు పూయడం మానేశాయి.

హఠాత్తుగా ఒకరోజు ఉదయాన్నే రాజుగారి తోటమాలి ఒక చంపకవృక్షం పూలతో కళకళలాడడం చూశాడు. వాటిని చూసి ఎంతో ఆనందించాడు. ఆ పూలను తెంపుకెళ్ళి రాజుగారికి ఇవ్వాలని ఉబలాటపడ్డాడు. ఆ పూలను చూస్తూనే రాజుగారు ఆనందిస్తాడని ఆశపడ్డాడు.

తోటమాలి పూలబుట్టను తీసుకుని ఆ చెంపక వృక్షం క్రిందకి వెళ్లాడు. ఆ చెట్టు చాలా పెద్దది. ఒక కొమ్మను వంచి పూలు తెంపుదామనుకున్నాడు. ఆ కొమ్మ అతని చేతికి అందేంత దగ్గరగా ఉంది. అతను తన చేతిని చాచి కొమ్మను అందుకోడానికి ప్రయత్నించాడు. కొమ్మ అందలేదు. అందకపోగా అతనికి ప్రయత్నించే కొద్దీ కొమ్మ మరింతపైకి వెళ్ళింది. తోటమాలి కొమ్మని అందుకోలేకపోయాడు. అంతేకాదు. ‘కొమ్మ అట్లా ఎలా పైకి వెళ్ళిందో అర్థం కాక ఆశ్చర్యపోయాడు. బహుశా ఏదైనా దుష్టశక్తి ఆ చర్యకు పాల్పడిందేమోఅని అనుకున్నాడు. ఈ జరిగిన సంగతి రాజుగారికి విన్నవించాలని నిర్ణయించుకున్నాడు.

అప్పుడు అన్నిటికన్నా పైన వున్న పువ్వు మానవస్వరంతో పాడడం మొదలుపెట్టింది.

”మేము ఇవ్వం ఎట్లాంటి పువ్వునూ అందివ్వం

మేమింకా పైపైకి వెళతాము

మొదట యిక్కడికి రాజుగారు రానీ

అప్పుడు మేమే పూలను ఇస్తాం”.

జరిగిన సంఘటనకు తోటమాలికి దిమ్మ దిరిగిపోయింది. పూలు పాట పాడడం అతనికి వింత అనుభవం. వెంటనే పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి, నమస్కరించి రాజా! మీరు వెంటనే రావాలి. వచ్చి చెంపక వృక్షంలో జరుగుతున్న అద్భుతాన్నీ చూడాలి. అని విషయం వివరించాడు. రాజు అయిష్టంగానే బయల్దేరాడు. రాజుగారు తోటకు వచ్చి చూస్తూనే చెంపక వృక్షానికి ఒక్క కొమ్మకు ఒక్కో పువ్వు చొప్పున ఎనిమిది కొమ్మలకు ఎనిమిది పూలు ఎంతో నిండుగా, అందంగా, ముచ్చటగా కనిపించాయి. రాజుగారు చేతిని చాచి కొమ్మలో పువ్వుని కోయబోయాడు. కొమ్మ మెల్లగా పైకి లేచింది. రాజుగారి చేతికి అందనంతపైకి లేచింది. మళ్ళీ కొమ్మనించీ మధురగానం వినిపించింది.

”మేము ఇవ్వం, మేము పువ్వుల్ని ఇవ్వం

మేము పైపైకి వెళతాం, అంతనంత ఎత్తుకి వెళతాం.

రాజుగారి పెద్ద భార్య రానీ

అప్పుడు మాత్రమే మేము పూలు అందిస్తాం”

ఆ పాట రాజుగారికి చిత్రంగా అనిపించింది. వినిపించింది. వెంటనే పెద్ద రాణిని పిలిపించారు. రాజుగారి పిలుపుతో ప్రేమలత గుండె కొట్టుకుంది. ఏదో ఉపద్రవం జరగబోతోందని భయపడింది. ఆమె పెరడులోని తోట దగ్గరకు వచ్చింది. సులత పిల్లల్ని పాతిపెట్టిన చోటే చంపకవృక్షం పూలతో కళకళ లాడడం చూసి కలవరపడింది.

పూలకొమ్మ తోటమాలితో, రాజుతో ఎట్లా చెప్పిందో అట్లాగే పెద్దరాణితో చెప్పి రెండో రాణిని రమ్మంది. అట్లా ఒకరి తర్వాత ఒకరుగా ఆరుగురు రాణుల్ని రంగంలోకి దింపింది.

అప్పుడు మళ్ళీ

”మేము ఇవ్వం, మేము పువ్వుల్ని యివ్వం

మేము పైపైకి వెళతాం, అందనంత పైకి వెళతాం

చిన్నరాణి వస్తే కానీ

పూలని మేము అందివ్వం” అన్నపాట వినిపించింది.

ఆ మాటల్తో రాజుగారు దిగ్భ్రమ చెందాడు. ఎందుకంటే చిన్నరాణి ఎక్కడికి వెళ్లిందో ఎక్కడుందో ఎవరికీ తెలీదు.

రాజుగారు సేవకుల్ని పంపి ఆమెను అన్వేషించమని చెప్పాడు. రాజు సైనికులు మూలమూలలా వెతికారు. ఇల్లిల్లూ గాలించారు.

చివరికి ఒక గుడిసెలో ఆమె కనిపించింది. పేడను పిడకలు చేసి అమ్మి జీవనం చేస్తూ ఉంది. అట్లాంటి దుర్భర పరిస్థితిలో ఆమెను చూశారు. ఆమెను రాజుగారి దగ్గరకు తీసుకొచ్చారు. రాజు ఆమెను గుర్తుపట్టలేదు. ఎంతో సుకుమారంగా, అందంగా ఉండే ఆమె చింపిరి దుస్తుల్తో చెదిరిన జుత్తుతో దరిద్రం నిండి ఉంది. ఆమె దయనీయ స్థితిని చూసి రాజు చలించిపోయాడు. గద్గద స్వరంతో ఆమెని కొమ్మలోని పూలను కొయ్య మన్నాడు. తనని శిక్షించడానికి పిలిపించాడనుకున్న ఆమెకు ఇదంతా అయోమయంగా అనిపించింది.

సులత పూలను కొయ్యడానికి చేయి చాచింది. ఇప్పుడు కొమ్మ పైకి వెళ్లలేదు, పాటా వినిపించలేదు. అంతేకాదు. ఏడు మొగ్గలు విచ్చుకుని అందమైన ఏడుమంది అబ్బాయిలు ఆమె ముందు నిలిచారు. ఒక మొగ్గవిచ్చుకుని ఒక అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది. వాళ్ళందరూ సులతను చుట్టుముట్టి ”అమ్మా! అమాయకురాలయిన మా తల్లీ! నీకెన్ని కష్టాలు వచ్చాయి”అని ఆమెను కౌగిలించుకున్నారు. ”మా వల్ల నీకు ఎన్ని బాధలు”అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ సంఘటనకు సులతతోబాటు రాజుగారు కూడా ఆశ్చర్యపడ్డాడు. అసలు విషయమేమిటో ఎవరికీ అంతుపట్టలేదు. అప్పుడు అందమైన ఆ అమ్మాయి తాము పుట్టింది మొదలు ప్రేమలత చేసిన నిర్వాకమంతా తల్లికి, తండ్రికి వివరించింది. తమ తల్లి చెంపక సుమాల్నితాకడం వల్ల తిరిగి తాము మనిషి రూపాల్ని ధరించినట్లు చెప్పింది.

బిడ్డల్ని చూసి తల్లి గుండె తల్లడిల్లింది. రాజుగారు బిడ్డల్ని చూసి ఆనందోత్సాహాలతో తబ్బిబ్బుఅయ్యాడు.

రాజుగారు తన పెద్దరాణి తక్కిన ఐదుమంది చేసిన కుట్రకు ఆగ్రహించి అక్కడే పెద్ద గొయ్యి తవ్వించి అందరి ముందు వాళ్ళని సజీవ సమాధి చేశాడు.ఎవరి పాపానికి వాళ్ళే పోతారంటారే అలా జరిగింది.

రాజుగారు తన చిన్నరాణితో ఎనిమిది మంది పిల్లల్తో తన అంతఃపురానికి వెళ్లి నగరమంతా ఉత్సవం జరిపించాడు.

– సౌభాగ్య

First Published:  4 Aug 2015 1:02 PM GMT
Next Story