Telugu Global
Others

లవ్లో ఫెయిలయితే....అయితే ఏంటి అన‌గ‌ల‌రా?

ఇప్పుడు మన సమాజంలో ఇదొక పెద్ద సునామీ. పరీక్ష ఫెయిలయితే పదిసార్లు తిరిగి రాసి పాసయ్యే అవకాశం ఉంటుంది కానీ, లవ్లో ఫెయిలయితే మాత్రం చాలామంది ఇక జీవితమే అయిపోయినట్టుగా ఫీలయిపోతున్నారు. ప్రేమించమంటూ అమ్మాయిలను ఒత్తిడిపెట్టే వారిని, ప్రేమించకపోతే దాడులు చేసేవారిని, హత్యలు సైతం చేసేవారిని చూస్తున్నాం. నిజానికి ఇప్పుడు మనకు పోలీస్ స్టేష‌న్ల కంటే మానసిక చికిత్సాలయాల అవసరం ఎక్కువ ఉంది. ఒక వ్యక్తి పేదరికంలో పుట్టి పెరిగి ఐయ్యేఎస్ ఆఫీసరయితే అతని పట్టుదల, కృషి, మనోభావాలు […]

లవ్లో ఫెయిలయితే....అయితే ఏంటి అన‌గ‌ల‌రా?
X

ఇప్పుడు మన సమాజంలో ఇదొక పెద్ద సునామీ. పరీక్ష ఫెయిలయితే పదిసార్లు తిరిగి రాసి పాసయ్యే అవకాశం ఉంటుంది కానీ, లవ్లో ఫెయిలయితే మాత్రం చాలామంది ఇక జీవితమే అయిపోయినట్టుగా ఫీలయిపోతున్నారు. ప్రేమించమంటూ అమ్మాయిలను ఒత్తిడిపెట్టే వారిని, ప్రేమించకపోతే దాడులు చేసేవారిని, హత్యలు సైతం చేసేవారిని చూస్తున్నాం. నిజానికి ఇప్పుడు మనకు పోలీస్ స్టేష‌న్ల కంటే మానసిక చికిత్సాలయాల అవసరం ఎక్కువ ఉంది. ఒక వ్యక్తి పేదరికంలో పుట్టి పెరిగి ఐయ్యేఎస్ ఆఫీసరయితే అతని పట్టుదల, కృషి, మనోభావాలు వంటివి ఇతరులకు సైతం మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యంతో పదేపదే పేపర్లలో టివిల్లో అతని ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. యువ‌తరం ఎలా ఉండాలో అలాంటివారు చెబుతున్నారని పొగిడేస్తారు.

అదే విధంగా ఒక యువకుడు తనను ప్రేమించలేదనే కారణంతో అమ్మాయిని చంపితే అతని గురించి వివ‌రాలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావు. ఏ గుణాలు మంచి జీవితానికి పునాది వేశాయో చెప్పడం మంచిదే….అదే విధంగా ఏ లక్షణాలు, పరిస్థితులు అంతటి రాక్షసత్వాన్ని మనిషిలో నిద్రలేపుతున్నాయి… అనే వివ‌రాల‌నూ ప్రపంచానికి తెలియజేస్తే అంతకంటే ఎక్కువ మేలు క‌లుగుతుంది. ఫలానా లక్షణాలు, ఆలోచనలు మనిషిలో హింసని ప్రేరేపిస్తాయి అని ముందుగానే చెబితే అలాంటి ఆలోచనలకు గురవుతున్నవారు, వారికి దగ్గరగా ఉన్నవారు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అలాగే లవ్లో ఫెయిలయి ఆ బాధనుండి బయటపడలేని వారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి

-ప్రేమలో ఉన్నపుడు నువ్వులేక నేను లేను, నేను లేక నువ్వు లేవు- అనుకోవడం బాగానే ఉంటుంది కానీ ఇక్కడే మన ఉనికి దెబ్బతినడం మొదలవుతుంది. తమలోని శక్తినంతటినీ వినియోగించి ఒక ఒలింపిక్ పతకాన్ని పొందాలనో, ఒక నోబెల్ బహుమతికోసమో కృషి చేసేవారిలో ఉన్నంత తీవ్రత ప్రేమికుల్లో ఉంటుంది. ప్రేమ‌ను త‌ప్ప తమ జీవితంలోని మిగిలిన విష‌యాల‌ను చూడ‌గ‌లిగే శ‌క్తిని వీరు కోల్పోతారు. అలాంటివారికే ప్రేమలో ఫెయిలయితే జీవితం శూన్యంగా కనబడుతుంది. క‌ష్ట‌ప‌డి ఒక కోటి రూపాయ‌లు కూడ‌బెట్టుకున్న‌వాడికి ఆ మొత్తం ఒకేసారి పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది. ఇక జీవించేందుకు ఒక్క‌దారి కూడా ఉన్న‌ట్టు అనిపించ‌దు. అలాగే ప్రేమించిన వ్య‌క్తి ఒక అబ్సెష‌న్‌గా మారిన‌పుడు, ప్రేమ‌ని, త‌న‌నుండి ప‌క్క‌కు తీసి, దాన్ని విడిగా చూడ‌లేన‌పుడు, ల‌వ్ ఫెయిల్యూర్ అత్యంత పెద్ద‌విషాదంగా క‌న‌బ‌డుతుంది.

-జీవితానికి ఒక‌ ల‌క్ష్యం అంటూ లేన‌పుడు ల‌వ్ ఫెయిల్యూర్ మ‌రింత బాధిస్తుంది. మ‌నం ఏం చేయాలో స‌రిగ్గా చెప్ప‌క‌పోతే మ‌న మ‌న‌సు దానికి న‌చ్చిన ప‌ని చేస్తుంది. అప్పుడే మ‌న చుట్టూ జ‌రుగుతున్న వాటికి బాగా ఆక‌ర్షితుల‌మ‌వుతాం. ఇలా ల‌క్ష్యమంటూ లేని మ‌న‌సులున్న మ‌నుషుల కోస‌మే ఇప్పుడు పుట్ట‌గొడుగుల్లా ప్రేమ సినిమాలు పుట్టుకొస్తున్నాయి. మ‌నం ఎప్ప‌టిక‌ప్ప‌డు మంచీ చెడూ మ‌న‌తో మ‌నం డిస్క‌స్‌ చేసుకోక‌పోతే సినిమాల్లో క‌నిపించే ప్రేమ క‌థ‌లు, స‌న్నివేశాలే నిజ‌మ‌ని మ‌న మ‌న‌సు భ్ర‌మ‌ప‌డుతుంది. జీవితంలో అంద‌రికీ ల‌క్ష్యం ఉండాల‌ని లేదు క‌దా…అంటారా, అలాంట‌పుడు మ‌న‌కు మాత్ర‌మే చెందిన మ‌న విలువ అంటూ ఒక‌టి ఉంటుంది. దాన్నే సెల్ఫ్ వ‌ర్త్ అంటారు. దాన్ని ఫీల్ అయిన‌పుడు మ‌రొక‌రికోసం జీవితాన్ని కోల్పోవ‌డం అనేది అర్థ ర‌హిత‌మ‌ని, ధైర్యంగా బ‌త‌క‌డ‌మే జీవిత‌మ‌ని అర్థం చేసుకుంటారు. ఇక్క‌డ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విష‌యం…మ‌నం మ‌న‌కంటే మ‌రొక‌ వ్య‌క్తికి ఎక్కువ విలువ ఇచ్చిన‌ప్పుడే ప్రేమ వైఫ‌ల్యం మ‌రింత‌గా బాధ‌పెడుతుంది.

-ప్రేమకంటే, నేను ప్రేమిస్తున్నాను… అనే ఫీలింగ్ ఇంకా తీవ్రమైనది. దాన్నే ప్రేమనుకునే వారే మరింతగా ఇతరులను ఇబ్బందుల పాలు చేస్తారు. తామూ కష్టాల పాలవుతుంటారు. వీరు పూర్తిగా ప‌రిస‌రాల‌కు ప్ర‌భావితం అయ్యే మ‌నుషులు.

-ఆరోగ్యకరమైన (అంటే ఏ పరిస్థితుల్లోనూ తమని తాము హింసించుకోకుండా, ఇతరులని హింసించ‌ని) ప్రేమలను పక్కనుంచితే, ప్రేమ కారణంగా కష్టాలు పడేవారిలో, పెట్టేవారిలో ఆత్మవిశ్వాస లోపం ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి త‌మ‌ని ఇష్ట‌ప‌డ‌డం, త‌మని గొప్ప‌గా చూడ‌డం, త‌మ‌కోసం ప‌డిచచ్చిపోవ‌డం…ఇవ‌న్నీ వారికి పెద్ద బూస్ట‌ప్‌గా మార‌తాయి. అంత‌కుముందున్న నెగెటివ్ ఆలోచ‌న‌ల తీవ్ర‌త త‌గ్గి, పాజిటివ్ గా ఆలోచించ‌డం మొద‌లుపెడ‌తారు. త‌మ ప‌ట్ల త‌మ‌కు కాసిని మంచి ఫీలింగ్స్ క‌లుగుతుంటాయి. ఒక్క‌సారిగా లవ్ లో ఫెయిల‌తే ఇవ‌న్నీ కోల్పోయి జీవితంలో నిరాశానిస్పృహ‌లు మాత్ర‌మే మిగిలిన‌ట్టుగా అనిపిస్తుంది. వీరు ల‌వ్ పార్ట‌న‌ర్ తిర‌స్క‌ర‌ణ‌ను అస‌లు త‌ట్టుకోలేరు. ఇలాంటివారే ఉన్మాదులుగా ప్ర‌వ‌ర్తిస్తారు.

-ల‌వ్‌ఫెయిల్యూర్ పెద్ద‌దిగా క‌న‌బ‌డ‌టానికి కార‌ణం మ‌న‌లోని ఆత్మ న్యూన‌తే. త‌మ‌ని తాము ఖాళీ డ‌బ్బాగా భావించిన‌వారికి ప్రేమ వ‌చ్చి దాన్ని నింపిన‌ ఫీలింగ్ క‌లుగుతుంది. తిరిగి ప్రేమ‌ని కోల్పోతే మ‌ళ్లీ ఒక ఖాళీ డ‌బ్బాగా మిగిలిన అనుభూతి క‌లుగుతుంది. అందుకే చిన్న‌త‌నం నుండీ సెల్ఫ్ వ‌ర్త్ ని ఫీల‌వుతున్న వారిని ఇత‌రులు పెద్ద‌గా బాధ‌పెట్ట‌లేరు. ప్రేమ‌లో ప‌డేనాటికే జీవితం ప‌ట్ల విశ్వాసం, న‌మ్మ‌కం ఉన్న‌పుడు ల‌వ్ ఫెయిల్యూర్ అంత‌గా బాధ‌పెట్ట‌దు. ముఖ్యంగా ప్రేమ వైఫ‌ల్యంతో ఈ జ‌న్మ ఇక వృథా అనే ఫీలింగ్ మాత్రం క‌ల‌గ‌దు….అంటే అప్ప‌టికే త‌న ఆనందాన్ని తానే సృష్టించుకోగ‌ల స్థాయి, న‌మ్మ‌కం…. అదే సెల్ఫ్ వ‌ర్త్ ఉండాల‌న్న‌మాట‌.

-జీవితంలో ప్ర‌యారిటీల‌ను ఎంపిక చేసుకోలేని వారిని సైతం ప్రేమ బాధిస్తుంది. అలాంట‌పుడే ల‌వ్ ఫెయిల‌యిన‌పుడు మిగిలిన ముఖ్య‌మైన అంశాలు మ‌నిషికి గుర్తు రావు. ఈ ప్ర‌యారిటీల‌కు (కుటుంబం ప‌ట్ల బాధ్య‌త లాంటివి) క‌ట్టుబ‌డి ఉండ‌డం అనే గుణం చిన్న‌త‌నం నుండీ పాటించిన క్ర‌మ‌శిక్ష‌ణ‌తో అల‌వ‌డుతుంది.

-ఇవ‌న్నీ జ‌న‌ర‌ల్‌గా చెప్పుకున్న అంశాలు. మ‌ళ్లీ మ‌నిషి మ‌నిషికీ ఈ ఫీలింగ్స్ మారిపోతుంటాయి. ఆ వ్య‌క్తి పెరిగిన వాతావ‌ర‌ణం, చిన్న‌త‌నం నుండీ అత‌ను జీవితాన్ని చూసిన విధానం, అత‌నిలోని స‌హ‌జ గుణ‌గ‌ణాలు, అంటే కోపిష్టా, స్వార్థ‌ప‌రుడా, ద‌య గ‌ల మ‌నిషా, క‌క్ష‌సాధించే స్వ‌భావ‌మా, పిరికివాడా, ధైర్య‌వంతుడా…. ఇలా ప్ర‌తి మ‌నిషిలో ఉండే సెంట‌ర్ పాయింట్స్ భిన్నంగా ఉండి, వారు ల‌వ్ ఫెయిల్యూర్‌ని ఎలా చూస్తున్నారు అనే విష‌యాన్ని ప్ర‌భావి తం చేస్తాయి. జీవితాన్ని ఎంజాయి చేయాలి అనుకున్న‌వార‌యితే మ‌రొక ఆనందాన్ని వెతుక్కుంటారు, చిన్న‌త‌నం నుండీ ఆశావ‌హ దృక్ప‌థంతో ఉంటే ఆ ఎపిసోడ్ ని వ‌దిలేసి ముందుకుపోదాం అనుకుంటారు…చిన్న‌ప్ప‌టి నుండీ… ఇంతే నాకేమీ ద‌క్క‌వు, అంద‌రూ న‌న్ను మోసం చేస్తున్నారు… అనే విక్టిమైజ్‌డ్ మెంటాలిటీ ఉండీ, అందులో మ‌ళ్లీ కాస్త మంచిత‌నం తాలూకూ భావాలు ఉంటే త‌మ‌ని తాము హింసించుకుంటారు, అదే క‌క్ష సాధించే స్వ‌భావం ఉంటే ఆ విధంగానే ప్ర‌వ‌ర్తిస్తారు.

-ముఖ్యంగా ప్రేమ వైఫ‌ల్యాన్ని త‌ట్టుకోలేని వారిలో తీవ్రంగా గాయ‌ప‌డే స్వ‌భావం ఉంటుంది. అది ఎందుకు పెరుగుతుంది… అంటే దానికి లెక్క‌లేన‌న్ని కార‌ణాలు ఉంటాయి.

-వీట‌న్నింటితో పాటు మ‌నిషి ఎప్ప‌టిక‌ప్పుడు సామాజిక‌, లౌకిక‌, మ‌న‌స్త‌త్వ‌, ఆర్థిక‌, రాజ‌కీయ, ఆధ్యాత్మిక జ్ఞానాల ప‌ట్ల ఎంతో కొంత అవ‌గాహ‌న పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు మెద‌డు త‌న ప‌రిధి దాటి ఆలోచించ‌డం మొద‌లుపెడుతుంది. అప్ప‌టివ‌ర‌కు ఉన్న గుడ్డి న‌మ్మ‌కాలు వ‌దిలి మ‌రో విశాల‌మైన న‌మ్మ‌కాల వైపు అడుగులు వేయ‌డం మొద‌లుపెడుతుంది.

-ఒక ప్ర‌దేశానికి వెళ్లిన మార్గ‌మంటూ ఉంటే తిరిగి వ‌చ్చే మార్గ‌మూ త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని భావించే శ‌క్తి మ‌న‌సుకి ఉంటే….మెద‌డు ల‌వ్ ఫెయిల్యూర్‌ని త‌ట్టుకుని, బ‌య‌ట‌ప‌డే మార్గాలు ఆలోచిస్తుంది. అయితే ఏ ఇద్ద‌రి వేలిముద్ర‌లూ ఒక‌లా ఉండ‌న‌ట్టే…ఏ ఇద్ద‌రి ల‌వ్ ఫెయిల్యూర్ ఫీలింగ్స్ ఒక‌లా ఉండ‌వు. అందుకే అవ‌గాహ‌న పెంచుకునే స‌మాచారం తీసుకుని, ఎవ‌రిని వారు స‌ముదాయించుకోవాల్సిందే…. త‌మ‌కు మాత్ర‌మే సూటయ్యే టైల‌ర్ మేడ్ ప‌రిష్కారం వెతుక్కోవాల్సిందే!!!!!

-వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌

First Published:  6 Aug 2015 4:33 AM GMT
Next Story