పాక్‌ది అదే కుటిలత్వం… అదే అబద్దం!

జమ్మూకశ్మీర్‌లో పట్టుబడిన ఉగ్రవాది నవీద్‌ ఉస్మాన్‌ తమ దేశస్థుడు కాదని పాకిస్థాన్‌ ప్రకటించింది. ఉధంపూర్ ఘటనలో సజీవంగా చిక్కిన మహ్మద్ నవీద్ యాకూబ్ అలియాస్ ఉస్మాన్ తాను పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ నుంచి వచ్చినట్టు స్వయంగా ఒప్పుకున్నాడు. 12 రోజుల క్రితం తాను భారత్‌లోకి ప్రవేశించి తిరుగుతున్నానని బుధవారం అతనే మీడియాకు చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌సభలో ప్రకటించిన కొద్దిసేపటికే పాకిస్థాన్ తన నైజాన్ని బయటపెట్టింది. అసలు నవీద్ ఉస్మాన్‌ తమ దేశస్థుడే కాదని బుకాయించింది. భారత్ తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడింది. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉధంపూర్ వద్ద బుధవారం బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై జరిపిన ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మరణించిన సంగతి తెలిసింది. ఈ ఇద్దరిని కాల్చి చంపిన సంఘటనలో ఉస్మాన్‌ ఒకడు. ఎదురు కాల్పుల్లో మహ్మద్ నోమెన్ అనే ఉగ్రవాది మృతి చెందగా మరో ఉగ్రవాది ఉస్మాన్ సజీవంగా పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. అంతకుముందు తనది పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ అని మహ్మద్ నోమెన్‌తో కలిసి భారత్‌లో ఉగ్రదాడి జరిపేందుకు వచ్చానని ఉస్మాన్ స్వయంగా ఒప్పుకున్నాడు. తనకు 22 సంవత్సరాలని ఓసారి.. కాదు 16 ఏళ్లని మరోసారి చెప్పాడు. అయితే పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి బయటపెడుతూ భారత్‌కు చిక్కిన నవీద్ ఉస్మాన్‌ ఎవరో పాకిస్థాన్ దేశస్తుడే కాదని ప్రకటించి తన కుటిలత్వాన్ని మరోసారి బయటపెట్టింది.