Telugu Global
Family

రాజకుమారుని కథ (For Children)

బెంగాల్‌లోని సత్‌గ్రాం రాజుకు రూప్‌కుమార్‌ ఒకడే కొడుకు. హిమాలయాలకు ఆనుకుని ఉన్న చిన్నరాజ్యం సత్‌గ్రాం. పర్వతాలనించీ వచ్చే నీటితో సస్యశ్యామలంగా ఉన్న భూముల్తో పచ్చని తివాచీలా ఆ రాజ్యముంటుంది. ఆ నీళ్ళు నదిలో కలుస్తాయి. గలగలా పారే నిర్మలమయిన నదీ ప్రవాహంతో ఆ సుందర రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది. యువరాజు రూప్‌కుమార్‌ ఉత్సాహవంతుడు. దయార్ద్ర హృదయుడు. అతనిలాగా గుర్రపు స్వారీ చేసే రైతు ఆ రాజ్యంలో లేడు. ఎగురుతూ పోయే పక్షిని కూడా అతను బాణంతో కొట్టే […]

బెంగాల్‌లోని సత్‌గ్రాం రాజుకు రూప్‌కుమార్‌ ఒకడే కొడుకు. హిమాలయాలకు ఆనుకుని ఉన్న చిన్నరాజ్యం సత్‌గ్రాం. పర్వతాలనించీ వచ్చే నీటితో సస్యశ్యామలంగా ఉన్న భూముల్తో పచ్చని తివాచీలా ఆ రాజ్యముంటుంది. ఆ నీళ్ళు నదిలో కలుస్తాయి. గలగలా పారే నిర్మలమయిన నదీ ప్రవాహంతో ఆ సుందర రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది.

యువరాజు రూప్‌కుమార్‌ ఉత్సాహవంతుడు. దయార్ద్ర హృదయుడు. అతనిలాగా గుర్రపు స్వారీ చేసే రైతు ఆ రాజ్యంలో లేడు. ఎగురుతూ పోయే పక్షిని కూడా అతను బాణంతో కొట్టే నేర్పరి. అతగాడు పేదవాళ్ళకు సాయం చేసేవాడు. తల్లిదండ్రుల కళ్ళకు చందమామ లాంటివాడు.

వసంతకాలంలో ఒక ఉదయాన్నే నిద్రలేచి తనకు వచ్చిన కల గురించి ఎవరికీ చెప్పకుండా తను ఇతర దేశాల్లో పర్యటించాలన్న తన ఆకాంక్షని తల్లిదండ్రుల్తో చెప్పాడు. తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అతని ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూశారు. కారణం అతను చిన్నవాడు. అతను సత్‌గ్రాం దాటి ఎప్పుడూ వెళ్ళనివాడు. అక్కడ బాగా ఎండలు ఉంటాయి.

రాజు ఎన్నో యుద్ధాల్లో పాల్గొని ఎన్నెన్నో సంపదలతో తిరిగి వచ్చిన అనుభవస్థుడు. ఎన్నెన్నో దేశాల్ని పర్యటించినవాడు. కానీ కొడుకును వదలిపెట్టడానికి ఇష్టపడలేదు. రాణి ఆలోచించి రాజును ఒప్పించి కొడుకు విదేశాలకు వెళ్ళడానికి ఒప్పించింది. తోడుగా మిత్రుల్ని, సేవకుల్ని వెంట తీసుకుపొమ్మని చెప్పింది. కానీ యువరాజు అంగీకరించలేదు. తనకు ఎవరూ తోడు అవసరం లేదని తను ఒంటరిగా వెళతానని అన్నాడు. తన తాతగారి ఖడ్గాన్ని, ఒక తాయెత్తును, తల్లి ఇచ్చిన పద్మరాగమణిని, తనకు నచ్చిన గుర్రాన్ని తీసుకుని బయల్దేరాడు.

కొన్నాళ్ళలో కొత్త సంవత్సరం రాబోతోంది. సత్‌గ్రామం కొత్తగా ముస్తాబయింది. ఎక్కడ చూసినా విస్తరించిన వికసించిన తెల్లనిపూలు. ఆ పూలు మధుర పరిమళాల్తో నిండినవి. ఎన్నో ప్రాంతాల నించి పక్షులు గుంపులు గుంపులుగా అక్కడికి వస్తాయి. వీధుల్లో మేళతాళాల్లో జనం ఉత్సవ వాతావరణం.

మరుసటి రోజు రూప్‌కుమార్‌ బయల్దేరబోతున్నాడు.

అందరూ గుమిగూడి రాజకుమారుడికి వీడ్కోలు చెప్పారు. తల్లిదండ్రుల జాగ్రత్తలు చెప్పారు.

రూప్‌కుమార్‌ ఎన్నో గ్రామాల గుండా ప్రయాణించాడు. ఎన్నో పొలాలగుండా, పర్వతాలగుండా సాగాడు. అతని గుర్రం అతనికి మంచి మిత్రుడు. అది ఎప్పుడూ అలసిపోదు. గంగ, పద్మ, బ్రహ్మపుత్ర నదుల్ని దాటాడు. ఎన్నో సందర్భాల్లో అతనికి తల్లిదండ్రులు, మిత్రులు గుర్తొచ్చేవారు. మళ్ళీవాళ్లని చూస్తామో లేదోనని గుబులు పడేవాడు.

ఎన్నో సందర్భాల్లో నదీతీరంలో కూచుని చేత్తో నదీజలాల్తో ఆడుకునేవాడు. స్వచ్ఛమయిన నీటిలో స్నానం చేసేవాడు. అతనూ గుర్రం చెట్ల కింద విశ్రాంతి తీసుకునే వాళ్ళు. అట్లా ఎన్నో రోజులు గడిచాయి.

ఒకరోజు పెద్దవర్షంలో ఒక అడవిలోకి అడుగుపెట్టాడు. ఎన్నో వందల సంవత్సరాల వయసున్న పెద్దచెట్లు ఆకాశాన్ని అంటుతున్నంత ఎత్తుగా వున్నాయి. మధ్యాహ్న సమయంలోనూ చీకటిని నింపుతున్నాయి. గుర్రం అడుగు ముందుకేయడానికి మొరాయించింది. సకిలించింది. ఏదో వాసన చూస్తున్నట్లు తలవిదిల్చింది. తనకు తెలియని రహస్యాన్ని దేన్నో అది గమనించినట్లు రూప్‌కుమార్‌ భావించాడు.

చిత్రమేమిటంటే ఆ అడవిలో ఆకు కదిలిన శబ్దం కూడా లేదు. పక్షుల జాడలేదు, జంతువుల కలకలం లేదు. రూప్‌కుమార్‌ తన తల్లిని గుర్తు తెచ్చుకుని కత్తిదూశాడు. అట్లా కత్తిపట్టుకునే గుర్రం మీద సాగి అడవి అంచుకు వచ్చి ఎర్రరాయితో కట్టిన ఒక భవనాన్ని సమీపించాడు. ఆ భవనం గేటు రెండు ఏనుగులు పట్టేంత పెద్దదిగా ఉంది. అక్కడ ఎవరూ లేరు. గేటుపైన పెద్ద డ్రమ్ము అమర్చి ఉంది. భవనానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి. వాటిల్లో పెద్దది ఆకాశాన్ని అంటేంత ఎత్తు ఉంది. దానిపై పతాకం గాలికి రెపరెపలాడుతోంది. ఆ కోటతో పోలిస్తే తన తండ్రి భవనం గుడిసెలా అనిపించింది.

ధైర్యంగా రూప్‌కుమార్‌ ఆ గేటును తీసుకుని లోపలికి వచ్చాడు. అక్కడ ఎవరూ కాపలాదారులు లేరు.

ఒక్కడే భవనంలోకి అడుగుపెట్టాడు. ఎక్కడా మనిషి జాడే లేదు. కానీ పరిసరాలన్నీ పరమాద్భుతంగా ఉన్నాయి. అక్కడ అపూర్వ శిల్పసంపదతో చెక్కిన ఒక పాలరాతి సింహాసనాన్ని చూశాడు.

కానీ ఉన్నట్లుండి ఆ భవన ప్రాంగణంపైకి అతనిదృష్టి మళ్లింది. ఆశ్చర్యకరంగా అక్కడ సేవకులు, భటులు, అధికారులు గుంపులు గుంపులుగా కనబడ్డారు.

ఎడమవేపు గుర్రపుశాలలో ఖరీదయిన గుర్రాలు, అలంకరించిన ఏనుగులు ఉన్నాయి. కానీ అవన్నీ శిలలుగా మారిపోయి ఉన్నాయి. దగ్గరలో ఉన్న ఒక గదిలోకి వెళ్ళాడు. ఆ గది నిండుగా కత్తులు, కటార్లు, విల్లంబులు, కుప్పలుగా ఉన్నాయి. వాటికి కాపలా కాసే సైనికులు కూడా శిలలుగా మారిపోయి కనిపించారు. అక్కడి నించి బయల్దేరి రాజదర్బార్‌కు వెళ్ళాడు. సింహాసనం మీద వజ్రాలు మెరిసే వస్త్రాలు ధరించిన రాజు కూర్చుని ఉన్నాడు. సభలో మంత్రి సామంతులందరూ ఆశీనులయి ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అందరూ మంత్రబద్ధులయినట్లు శిలలుగా మారిపోయి ఉన్నారు.

రాజకుమారుడికి ఇదంతా ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉంది. అక్కడి నుండి బయటకు వచ్చాడు. ఎదురుగా పెద్ద సరోవరం. దాని మధ్యలో ఒక అందమైన మేడ. దాని చుట్టూ మల్లెతీగలు. సరోవరంలో దట్టంగా తామరపూలు. నీళ్ళే కనిపించనంతగా విస్తరించాయి. మెల్లగా రాజకుమారుడు ఆ మేడను సమీపించి దంతంతో చేసిన తలుపుల్ని తెరిచాడు.

తలుపుల్ని తెరుస్తూనే విభ్రాంతికి గురయ్యాడు. కాంతులు చిమ్ముతూ ఒక అందమైన అమ్మాయి పడుకుని ఉంది. దేవదూతలు ఆమె ముందు దిగదుడుపే. ఆ గదంతా లిల్లీపూల పరిమళం పొంగిపొర్లుతోంది. అంత చల్లని మనోహర వాతావరణం రాజకుమారుడి అనుభవంలో లేనిది. అంత సౌందర్యరాశిని అప్పటిదాకా చూసి ఎరగడు. స్థాణువై అక్కడే నిలబడిపోయాడు.

చాలాసేపు అక్కడే నిలబడి అలసిపోయి గదిలో అడుగుపెట్టాడు. అటూఇటూ చూశాడు. కిటికీలు మూసి వున్నాయి. పడక దగ్గర పాత్రలో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. అక్కడ రెండు కర్రలున్నాయి. ఒకటి బంగారుతో చేసింది. మరొకటి వెండితో చేసింది. రాజకుమారుడు ఆ రెండూ తీసుకుని నిద్రపోతున్న ఆ అందాలరాసి దగ్గర పెట్టాడు. ఆ దృశ్యం అతన్ని కదిలించింది. ఆమె అందం అతన్ని ఆకట్టుకుంది. ఆ రెండు కర్రల్ని తీసుకుని ఒకదాన్ని ఒకటి తాకించి శబ్దం చేశాడు. అంతలో అతని చేతినించీ జారి బంగారు కర్ర ఆ అందగత్తెపై పడింది. అప్పుడు ఆ అందాలరాశి నిర్మలంగా కళ్ళు తెరిచి కలలో లాగా చుట్టూ చూసింది. పద్మాలలాంటి ఆమె కళ్ళు చూసి రాజకుమారుడు పరవశించాడు. ఆమె రాజకుమారుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. ఆమె మెల్లగా లేచి కూచుని ‘ఎవరు నువ్వు? ఇక్కడికి ఎట్లా వచ్చావు?’ అంది. రాజకుమారుడు తన కథంతా చెప్పి ఆమెను కలిపినందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నాడు. ఎక్కడ చూసినా శిలలుగా మారిన మనషులే కనీసం నువ్వు సజీవంగా కనిపించినందుకు సంతోషంగా ఉందన్నాడు.

ఆమె పేరు రూపమతి. ఆమె రాజకుమారుడితో ”నేనూ ఎప్పటినించో శిలలాగా పడివున్నాను. నిర్జీవంగా పడివున్నాను. నువ్వు బంగారు బెత్తంతో నన్ను తాకి నాకు పునర్జన్మనిచ్చావు. సజీవంగా మార్చావు” అంది. రాజకుమారుడు ఎంతో ఆశ్చర్యానికి లోనయి ‘ఏమిటిదంతా? ఎందుకిలా జరిగింది? ఈ కోటకు సంబంధించిన రహస్యమేమిటి? ఎందుకు అందరూ శిలలుగా మారారు?’ అని అడిగాడు.

రాజకుమారి దిగులు నిండిన స్వరంతో మెల్లగా ఆరంభించింది. ‘చాలా రోజుల క్రితం ఒకమాంత్రికుడు నేను ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే నన్ను చూసి మోహించాడు. నన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. నన్ను సమీపించి తన కోరిక తెలిపాడు. నేను తిరస్కరించాను. వెంటనే నా తండ్రి దగ్గరికి వెళ్ళి తన కోరిక తెలిపాడు. ఆ మాంత్రికుడు వికారంగా ఉంటాడు. మొనగాడు. రాజు సేవకుల్ని పిలిచి అతన్ని బంధించి చెరసాలలో వెయ్యమని ఆజ్ఞాపించాడు. ఆ మాంత్రికుడు ఏదో మంత్రాలు వల్లించి నీటిని ఆ ప్రాంతంలో చల్లాడు. పిల్లలు,పెద్దలు, వృద్ధులు అందరూ నిద్రలోకి జారుకున్నారు. మెల్లగా అందరూ శిలారూపం ధరించారు.

ఎవరయినా బంగారు బెత్తంతో రాజకుమారిని తాకితే ఆమె మామూలు మనిషవుతుంది. వెండి బెత్తంతో నీళ్ళను పరిసరాల్లో చల్లిలతే అందరూ తిరిగి మామూలు మనుషులవుతారు.

ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరూ ఈ మరణనగరంలలోకి అడుగుపెట్టే సాహసం చెయ్యలేకపోయారు. నువ్వొచ్చావు నాకు పునర్జన్మ నిచ్చావు అంటూ కన్నీళ్లతో రాజకుమారి రాజకుమారుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రకటించింది. తన తల్లిదండ్రులకు, ఇతరులకు విముక్తి కలిగించమని అభ్యర్థించింది.

వెండి బెత్తంతో మంత్రజలాన్ని చల్లాడు. అందరూ తిరిగి మామూలు మనుషులయ్యారు. అప్పుడే నిద్ర మేల్కొన్నట్లు ఏమీ జరగనట్లు లేచారు. రాజు రాణి తమ కూతుర్ని చూసి కన్నీళ్ళతో కౌగలించుకున్నారు. తను ముందు నిల్చున్న అపరిచితుడయిన యువకుణ్ణి చూశారు. ఆ యువకుడు చేసిన అద్భుతం వల్లే మనందరం సజీవంగా మారామని రాజకుమారి చెప్పింది.

రాజురాణి రూపకుమార్‌కు కృతజ్ఞత ప్రకటించారు. రాజకుమారుడయిన రూప్‌కుమార్‌కు హఠాత్తుగా తన ఇల్లు గుర్తుకు వచ్చింది. తన విశ్వాసపాత్రమయిన గుర్రం గుర్తుకొచ్చింది.

రాజు సంతోషంతో తన కుమార్తెనుపెళ్ళి చేసుకోమని కోరాడు. నిజానికి తొలిచూపులోనే రూపకుమార్‌ ఆమెను ప్రేమించాడు. సిగ్గుపడ్డాడు. ఆణిముత్యంలాంటి రాజకుమారిని పెళ్ళాడడానికి అతనికి అభ్యంతరమేముంది?

రాజపురోహితులు వెంటనే ఆలస్యం చెయ్యకుండా ముహూర్తం నిర్ణయించారు. వందలమంది రాజభవనాన్ని అలంకరించడంలో మునిగారు. వీధులు శుభ్రపరిచారు. మేళతాళాలతో పరిసరాలు మారుమ్రోగిపోయాయి. నగరమంతా సందడే సందడి.

అంగరంగ వైభవంగా రూప్‌కుమార్‌, రాజకుమారిల పెళ్లి జరిగింది. రూపకుమార్‌ కూడా రాజకుమారుడే అని తెలిసి రాజు మరింత ఆనందించాడు. అందరి దగ్గరా సెలవు తీసుకుని రూపకుమార్‌ తన భార్యతో కలసి తన రాజ్యం బయల్దేరాడు.

– సౌభాగ్య

First Published:  6 Aug 2015 1:02 PM GMT
Next Story