Telugu Global
Family

శ్రీమంత కథ (For Children)

పూర్వం శ్రీపూర్‌లో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి మొదటి భార్య ఐనలహోనా వల్ల పిల్లలు కలగలేదు. అందుకని అతను మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు. రెండో భార్యపేరు ఖుల్లానా. ఆశ్చర్యమెక్కడంటే వాళ్ళు ఎప్పుడూ సవతుల్లా అనుకోలేదు. ఎప్పుడూ గొడవపడలేదు. పైగా వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ. ఇద్దరూ అక్కాచెల్లెళ్లూ ఆట్లాడేవాళ్ళు. లహోనా ఖుల్లానాను చెల్లెల్లా భావించేది. అంతేకాదు మంగల్‌ చాందీ దేవతకు పూజలు చేసి తన చెల్లికి పండంటి కొడుకు పుట్టాలని కోరుకునేది. మొత్తానికి ఆమె పూజలు ఫలించి […]

పూర్వం శ్రీపూర్‌లో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి మొదటి భార్య ఐనలహోనా వల్ల పిల్లలు కలగలేదు. అందుకని అతను మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు.

రెండో భార్యపేరు ఖుల్లానా.

ఆశ్చర్యమెక్కడంటే వాళ్ళు ఎప్పుడూ సవతుల్లా అనుకోలేదు. ఎప్పుడూ గొడవపడలేదు. పైగా వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ. ఇద్దరూ అక్కాచెల్లెళ్లూ ఆట్లాడేవాళ్ళు. లహోనా ఖుల్లానాను చెల్లెల్లా భావించేది. అంతేకాదు మంగల్‌ చాందీ దేవతకు పూజలు చేసి తన చెల్లికి పండంటి కొడుకు పుట్టాలని కోరుకునేది.

మొత్తానికి ఆమె పూజలు ఫలించి ఖుల్లానా గర్భవతి ఐంది. లహోనా తన చెల్లెల్ని కంటికి రెప్పలా కాచుకుంది.

ఒకరోజు వ్యాపారి లహోనాతో “దూరదేశాల ప్రయాణానికి పడవలు సిద్ధమయ్యాయి. వ్యాపార నిమిత్తం వెళ్ళక తప్పనిసరి. రేపు ఉదయాన్నే బయలుదేరుతాం” అన్నాడు. ఆమె “కనీసం కొన్నాళ్ళు ఆగవచ్చు కదా! నీ బిడ్డను చూసుకుని వెళ్ళవచ్చు కదా!” అంది.

అతను ‘చూడు నేను ఒక్కణ్ణే ఆగడానికి వీలుపడదు. అందరితో కలిసి చేసే ప్రయాణం. పైగా నువ్వు ఉన్నావు. మీ చెల్లెల్ని కంటికి రెప్పలా కాచుకుంటావు. నాకు దిగులేముంది చెప్పు. వాయిదా వేస్తే వ్యాపారం దెబ్బతింటుంది గనక తప్పక వెళ్ళాలి’ అన్నాడు.

మరుసటి రోజు ఏడుపడవల్లో వ్యాపార బృందం సింహళం వెళ్ళింది. కొన్నాళ్ళకు ఖుల్లానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడ అందరిలో అంతులేని ఆనందం పొందిన వ్యక్తి లహోనా ఆమె బిడ్డకు ‘శ్రీమంతు’డని పేరుపెట్టింది.

భార్యలిద్దరూ ఆత్రుతగా భర్తకోసం ఎదురుచూశారు. ఎంతకాలమయినా వ్యాపారస్థుడి గురించి ఎట్లాంటి కబురూ లేదు. జనం అతని గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొందరు పడవలు సముద్రంలో మునిగిపోయాయని గుసగుసలు పోయారు. మరికొంతమంది వ్యాపారి దొంగల చేతిలో చనిపోయాడన్నారు.

భార్యలు తల్లడిల్లారు. ఏం చెయ్యడానికీ తోచలేదు. నిస్సందేహంగా దేవుణ్ని ప్రార్థించారు. చివరికి ఒక వార్త అందింది. అదేమిటంటే శ్రీలంకరాజు వ్యాపారిని ఖైదులో బంధించాడని.

శ్రీమంతుడికి ఐదేళ్లు వచ్చాయి. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం, నూతన వస్త్రాల్ని ధరింపజెయ్యడం, సరస్వతీ, లక్ష్మీదేవిల పూజ జరిగింది. శ్రీమంతుణ్ణి స్కూల్లో చేర్చారు. ఉదయం పంపి సాయంత్రం కొడుకు ఎప్పుడు వస్తాడా? అని తల్లులు ఎదురుచూసేవాళ్ళు.

ఒకరోజు శ్రీమంతుడు కన్నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చాడు. బిడ్డను దగ్గరకు తీసుకుని బుజ్జగించి లహోనా ఏమైంది నాయనా? అని అడిగింది. శ్రీమంతుడు ‘అమ్మా! మా నాన్న పేరేమి? ఆయన ఎక్కడికి వెళ్లాడు. ఆయనకేమయింది. నాతోటివాళ్ళు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అన్నాడు.

లహోనా భర్త కథంతా వివరించి అతన్ని శ్రీలంక ప్రభువు చెరసాలలో బంధించిన విషయం చెప్పింది.

శ్రీమంతుడు అంతా విని తల్లులతో ‘మీరు నాకు అనుమతినివ్వండి. నేను వెళ్ళి నాన్నను విడిపించుకుని వస్తాను. మీరు ఇవ్వని పక్షంలో నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను’ అన్నాడు.

కొడుకు నిర్ణయానికి తల్లులు ఆందోళనపడ్డారు. ఏంచెయ్యాలో వాళ్ళకు తోచలేదు. కళ్ళముందు పెరిగిన పసివాణ్ణి అట్లాంటి కష్టమయిన ప్రయాణానికి ఎట్లా అనుమతించడం? ఎంత సర్దిచెప్పినా శ్రీమంతుడు తన నిర్ణయం వదులుకోలేదు.

చివరికి నమ్మకస్థులయిన నావికుల్ని కుదిర్చి వ్యాపార నిమిత్తమే వెళుతున్నట్లు ఏడుపడవలు సిద్ధం చేశారు.

శ్రీమంతుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తల్లులు అతనికి గంథం తిలకం దిద్దారు. తల్లులు కన్నీళ్ళతో వీడ్కోలు చెప్పారు. లహోనా,’నాయనా! మంగల్‌ చాందీ దేవతను రోజూ ప్రార్థించడం మరిచిపోవద్దు’ అని చెప్పింది. ‘నీకు ప్రమాద పరిస్థితులు ఎదురయితే ఆ తల్లిని ప్రార్థిస్తే ఆమె నిన్ను కష్టాల నుంచి బయటపడేస్తుంది’ అంది.

శ్రీమంతుడు సరేనని సెలవు తీసుకున్నాడు. తల్లులు కన్నీళ్లతో వెనుదిరిగారు. ఆరాత్రి తల్లులిద్దరికీ కలలో మంగల్‌చాందీ దేవత కనిపించి ‘మీరు శ్రీమంతుని గురించి దిగులు పడకండి. అతనికి ఎట్లాంటి ప్రమాదమూ జరగదు. క్షేమంగా తిరిగి వస్తాడు’ అని చెప్పింది.

శ్రీమంతుని ప్రయాణం నిరాటంకంగా, నిర్మలంగా సాగింది. ఒకరోజు శ్రీమంతుడు దేవతను ప్రార్థించడం మరచిపోయాడు. ఒక పడవ మునిగిపోయింది.

ఇంకొక రోజు ఆకాశం గాఢాంధకారమైంది. భయంకరమయిన తుఫాను మొదలయింది. అందరూ మునిగిపోతామని భయపడిపోయారు. అప్పుడు శ్రీమంతుడు దేవతను ప్రార్థించాడు. నెమ్మదిగా అల్లకల్లోలం సద్దుమణిగింది.

పడవలు శ్రీలంక తీరానికి చేరినపుడు శ్రీమంతుడు అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. ఒక అందమైన అమ్మాయి నీటిపైన తేలేపద్మంలో కూచుని ఉంది. ఆమె రెండు చేతుల్లో రెండు ఏనుగులు ఉన్నాయి. వాటిని మింగుతోంది, వెంటనే మళ్ళీ బయటకి తీసుకొస్తోంది.

ఆమె తను ఆరాధించే మంగల్‌చాందీ దేవతకు ప్రతిరూపమని భావించి శ్రీమంతుడు ఆమెకు నమస్కరించాడు.

శ్రీమంతుడు సరాసరి రాజసభకు వెళ్ళాడు. రాజు అతణ్ని కూర్చోమన్నాడు. రాజు అతనితో ‘నీకు వింతగా ఏదయినా అనుభవం సముద్రంలో జరిగిందా?’ అని అడిగాడు. పద్మంలో కూచున్న స్త్రీ గురించిన అనుభవం చెప్పాడు.

రాజు వెంటనే ఆగ్రహంతో ‘ఈ కుర్రాడు కూడా నన్ను తెలివి తక్కువ వాడిని చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. ఇతన్ని బంధించి చెరసాలలో వెయ్యండి’ అని భటులకు ఆజ్ఞాపించాడు.

శ్రీమంతుడు విషాదంతో మంగల్‌చాందీ దేవతను ప్రార్థించాడు.

ఈలోగా సైనికులు అతన్ని బంధించారు. దేవత ప్రత్యక్షమైంది. ఒక వృద్ధురాలి వేషంలో ప్రత్యక్షమై ఏడుస్తున్న శ్రీమంతుణ్ణి ఎందుకు నాయనా! ఏడుస్తున్నావని దగ్గరికి పిలిచింది. గొడ్డలిని పైకెత్తి నరకబోయిన సైనికుడి చేతిలోని గొడ్డలి దానంతట అదే విరిగిపోయింది. ఈ వార్త రాజుకు చేరిసైన్యంతో బయల్దేరాడు.

అక్కడికి చేరేసరికి వృద్ధురాలయిన స్త్రీ వాళ్ళని చూసి ఆగ్రహించి అరిచింది. అప్పుడు కొన్ని దయ్యాలు పుట్టుకొచ్చాయి. అవి రాజు సైనికుల్ని చంపడం మొదలుపెట్టాయి.

దాంతో రాజు భయపడి ఆమె పాదాలపై పడ్డాడు. ఆ వృద్ధురాలు ‘నువ్వు ఇట్లాగే అనవసరంగా బంధించిన ఇతని తండ్రిని వదలిపెట్టు’ అంది. రాజు సరేనని బంధించిన వ్యాపారిని సగౌరవంగా వదిలిపెట్టాడు. తండ్రి కొడుకును చూసి ఆనందభాష్పాలతో కౌగిలించుకున్నాడు.

అందరూ కలిసి వృద్ధురాలికి ప్రణమిల్లి సంతోసంగా సముద్రయానం చేసి తిరిగి తమ ఇంటికి చేరారు. క్షేమంగా వచ్చిన భర్తను, బిడ్డను చూసి లహోనా, ఖుల్లానా సంతోషించారు.

– సౌభాగ్య

First Published:  7 Aug 2015 1:02 PM GMT
Next Story