Telugu Global
Family

వసంతుడు-హేమంతుడు (For Children)

పూర్వం బెంగాల్‌లో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు దువోరాణి, సువోరాణి అని ఇద్దరు భార్యలు. సువోరాణి అంటే రాజుకు ఇష్టం. దువోరాణి అంటే అంత ఇష్టం లేదు. అందుకని ఇంట్లో పెత్తనమంతా సువోరాణిదే! దువోరాణికి వసంతుడు, హేమంతుడు అని ఇద్దరు ముద్దులకొడుకులు. సువోరాణికి పిల్లలు లేరు. సువోరాణి ఇంటి పెత్తనం వల్ల దువోరాణికి, ఆమె కొడుకులకు సరైన బట్టలు, తిండి ఉండేవి కావు. ఆ విషయం గురించి దువోరాణి ఎప్పుడు రాజుకు ఫిర్యాదు చెయ్యలేదు. భగవంతునిపై భారం […]

పూర్వం బెంగాల్‌లో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు దువోరాణి, సువోరాణి అని ఇద్దరు భార్యలు. సువోరాణి అంటే రాజుకు ఇష్టం. దువోరాణి అంటే అంత ఇష్టం లేదు. అందుకని ఇంట్లో పెత్తనమంతా సువోరాణిదే! దువోరాణికి వసంతుడు, హేమంతుడు అని ఇద్దరు ముద్దులకొడుకులు. సువోరాణికి పిల్లలు లేరు.

సువోరాణి ఇంటి పెత్తనం వల్ల దువోరాణికి, ఆమె కొడుకులకు సరైన బట్టలు, తిండి ఉండేవి కావు. ఆ విషయం గురించి దువోరాణి ఎప్పుడు రాజుకు ఫిర్యాదు చెయ్యలేదు. భగవంతునిపై భారం వేసేది.

ఒకరోజు రాణులిద్దరూ నదికి స్నానానికి వెళ్ళారు. సువోరాణి మంచితనం నటించి తను స్నానానికి ముందు తలకు తైలం పెట్టుకున్నట్లే దువోరాణికి కూడా రాస్తానన్నది. దువోరాణి సరే అన్నది. తలపై తైలం రాస్తూనే చిత్రంగా దువోరాణి చిలుకగా మారి ఎగిరిపోయింది. సువోరాణి ఇంటికి తిరిగి వచ్చి దువోరాణి స్నానం చేస్తూ నదిలో మునిగిపోయిందని చెప్పింది.

వసంతుడు, హేమంతుడు భోరున విలపించారు. తమకింక తల్లి లేదని తీర్మానించుకున్నారు. ఒకర్నొకరు ఓదార్చుకున్నారు.

దువోరాణి రామచిలుకగా మారి ఆ రాజ్యం వదిలి ఇంకో రాజ్యానికి వెళ్లింది. రాజభవనం కిటికీ మీద వాలి ఉంటే ఆ దేశం రాజు తన కూతురయిన చిన్నపిల్ల వసంతలతకు ఆ రామచిలును చూపాడు. వసంతలత చిలుకను పట్టి బంగారు పంజరంలో పెట్టింది.

కొంతకాలానికి సువోరాణికి పిల్లలుపుట్టారు. ముగ్గురు కొడుకులు కలిగారు. కానీ ముగ్గురూ బలహీనంగా, ఎముకల గూడులా కనిపించేవాళ్ళు. గాలి వీచితే పడిపోయే వాళ్ళు. తన కొడుకుల పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. ఆమె వాళ్ళకు ఎంతమంచి ఆహారం పెట్టినా వాళ్ళ పరిస్థితిలో మార్పులేదు. అదే సగం ఆకలితో ఉన్నా హేమంతుడు, వసంతుడు ఆరోగ్యంతో నిగనిగలాడేవాళ్ళు. కానీ ఎంతోకాలం సువోరాణి ఓపిక పట్టలేకపోయింది. సవతి పిల్లల మీద పగబట్టింది. ఒకరోజు వాళ్ళు చదువుకుని తిరిగి రాగానో కోపంతో నిలువెత్తు ఎగిసిపడింది. ఆమె పిల్లలు గ్లాసులు పగలగొడితే, పుస్తకాలు చింపితే ఆ పనిచేసింది సవతి పిల్లలేనని రాజుతో ఫిర్యాదు చేసింది.

రాజు ఎప్పుడో ఆమెకు లొంగిపోయాడు. ఆమె ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడు. రాణి ‘వాళ్ళిద్దరూ అదుపూ ఆజ్ఞా లేకుండా పోయారు. నాకు వాళ్ళంటే ఎంత ఆగ్రహంగా ఉందంటే నేను వాళ్ళ రక్తంతో స్నానం చెయ్యాలనుకుంటున్నాను’ అంది. రాజు సైనికుల్ని పిల్చి వీళ్ళను తీసుకెళ్ళి చంపి వీళ్ళ రక్తం పట్టుకు రండి అని ఆజ్ఞాపించాడు. అన్నదమ్ములు ఆక్రోశించారు. కానీ వాళ్ళని పట్టించుకునేదెవరు? సైనికులు ఇద్దర్నీ కట్టేసి తీసుకెళ్ళారు.

వాళ్ళిద్దర్నీ అడవిలోకి తీసుకెళ్ళారు. చంపే అతను వాళ్ళిద్దరి రాజకుమారులు ధరించే వస్త్రాల్ని ఇప్పి ఇవ్వమన్నాడు. ఇచ్చారు. వాళ్ళకు ఉరికంబ మెక్కే వస్త్రాలిచ్చాడు. ఆ నిష్కల్మషులయిన పిల్లల్ని చూసి ‘కన్నీళ్ళతో’ రాజకుమారులారా! నేను ఏం చేసేది! నేను నిస్సహాయుణ్ణి. నేను రాజాజ్ఞకే తలఒగ్గాలి. అందుకనే మిమ్మల్ని బంధించి ఇక్కడకు తీసుకొచ్చాను. మీరు నా ఒళ్లో పెరిగారు. మిమ్మల్ని చంపడానికి నాకు మనస్కరించడం లేదు. మిమ్మల్ని ఎవరూ రాజకుమారులుగా గుర్తుపట్టలేరు. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నేను తిరిగి మీ రాచవస్త్రాలు తీసుకుని రాజు దగ్గరకు వెళతాను. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు’ అని చెప్పి రెండు నక్కల్ని చంపి ఆ రక్తాన్ని రాణికి ఇచ్చాడు. రాణి అందులో స్నానం చేసి సంతృప్తి పడింది.

వసంతుడు, హేమంతుడు అడవిలో ప్రయాణించి అలసిపోయి ఒక చెట్టు మొదట్లో కూచున్నారు.

వసంతుడు ‘నాకు బాగా దాహంగా ఉంది. నీళ్ళెక్కడ దొరకుతాయి?’ అన్నాడు. హేమంతుడు ‘ఇక్కడెక్కడా నీటిజాడ ఉన్నట్లు లేదు. నువ్వు ఇక్కడే ఉండు. నేను నీరు ఎక్కడయినా ఉందేమో చూసి వస్తాను’ అని వెళ్ళాడు.

హేమంతుడు నీటికోసం వెతుకుతూ ఉంటే ఒక బావి కనిపించింది. దాంట్లోకి మెట్లు ఉన్నాయి. మెట్లు దిగాడు. కానీ నీళ్ళు పట్టుకుపోవడానికి ఎట్లాంటి పాత్రా లేదు. పై కండువా తీసుకుని నీళ్లతో తడిపి పైకి వచ్చాడు. ఈలోగా ఒక విషయం జరిగింది.

పొరుగుదేశం రాజుకు వారసుడు లేడు. అతను చనిపోయాడు. మంత్రులు సమావేశమై ఒక ఏనుగుకు ఒక కిరీటమిచ్చారు. అది ఎవరి తల మీదపెడితే అతనే రాజుగా నిర్ణయించారు. ఆ ఏనుగు అరణ్యమార్గం గుండా వచ్చింది. అప్పుడే నీళ్ళతోగుడ్డను తడుపుకుని బావినించీ పైకి వచ్చిన హేమంతుడిపై ఏనుగు కిరీటం పెట్టింది. హేమంతుడు ఆశ్చర్యపోయేంతలో అతన్ని తొండంతో ఎత్తి తనపై కూచోపెట్టుకుని శరవేగంతో నగరానికి పరిగెట్టింది. వసంతుని పరిస్థితి తలచుకుని హేమంతుడు తల్లడిల్లాడు.

వసంతుడు ఎంతసేపు చూసినా హేమంతుడు రాకపోయేసరికి అతన్ని వెతుకుతూ బయల్దేరాడు. హేమంతుడు కనిపించలేదు. చీకటిపడింది. కన్నీళ్ళతో, బాధతో ఒక చెట్టు కింద పడుకున్నాడు.

ఉదయాన్నే ఒక ఋషి ఆ దారంటే వెళుతూ నేలమీద నిద్రపోతున్న వసంతుణ్ణి చూసి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు.

హేమంతుణ్ణి నగర ప్రజలు రాజుగా అభిషేకించారు. తన అన్నను తలచుకుని హేమంతుడు అల్లాడాడు. అన్నిటికీ కాలమే పరిష్కారం చూపుతుంది. హేమంతుడు క్రమంగా రాచకార్యాల్లో మునిగిపోయాడు. యుద్ధాల్లో, రాజ్యసంరక్షణలో మునిగాడు. వసంతుడు ఎప్పుడోగానీ గుర్తొచ్చేవాడు కాడు.

వసంతుడు రుషి సంరక్షణలో ప్రశాంతంగా పెరిగాడు. పళ్ళు, పూలు, దర్భలు సేకరిస్తూ పూజాదిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, శాస్త్రాలు అభ్యసిస్తూ గడిపాడు.

క్రమంగా ఇద్దరూ ఒకర్నొకరు మరచిపోయారు. ఒకరోజు మహారాణి తన కొడుకుల్తో సముద్రతీరానికి వెళ్ళింది. కొడుకులు స్నానం చేస్తొంటే ఒక పెద్ద అలవచ్చి వాళ్ళను లాక్కెళ్ళింది. అది చూసి సువోరాణి గుండెలు బాదుకుంది. బిడ్డలు పోయిన తరువాత బతికి లాభం లేదనుకుని తను కూడా సముద్రంలో మునిగి ప్రాణాలు వదిలింది.

వసంతలత క్రమంగా పెద్దదయింది. రామచిలుకతో ఆడుకునేది. కూతురు పెద్దదయింది అని రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయం వరానికి దేశదేశాల రాజులు వచ్చారు. వసంతలత పూలదండ పట్టుకుని అందర్నీ చూస్తూ వెళ్లింది. స్వయంవరానికి ముందు ఏఏ అలంకారాలు ధరించాలో రామచిలుక చెప్పింది.

హేమంతుడు కూడా స్వయంవరానికి వచ్చాడు. వసంతలత అతన్ని వరించింది. భర్తతో బాటు, తన రామచిలుకతో బాటు అరణ్యం గుండా సాగుతూ ఉంటే ఆశ్రమంలో వసంతుడు కనిపించాడు. బిడ్డలిద్దర్నీ ఒక దగ్గర చూసిన రామచిలుక దువోరాణిగా మారింది. ఆశ్రమంలో రుషి దీవెనలందుకున్న వాళ్ళు తమ రాజ్యానికి వెళ్ళారు. తండ్రి ఎవరూ లేక మంచమెక్కి అనారోగ్యంతో కన్నుమూసి రాజ్యం అల్లకల్లోలంగా ఉంటే అన్నదమ్ములు అరాచకాల్ని అణచి శాంతింపజేసి రెండు రాజ్యాల్ని ప్రజారంజకంగా పాలిం చారు.

– సౌభాగ్య

First Published:  8 Aug 2015 1:02 PM GMT
Next Story